Prophet Muhammad: మూడు వాగ్దానాలు
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:40 AM
దేవుడి పట్ల భక్తి విశ్వాసాలు ఉన్న వారికి భరోసాను కల్పించే మూడు వాగ్దానాలను దైవ ప్రవక్త మహమ్మద్ చేశారు. వాటిలో మొదటిది... దాసుడి సంపద దానం చేయడం వల్ల తరిగిపోదు...
దేవుడి పట్ల భక్తి విశ్వాసాలు ఉన్న వారికి భరోసాను కల్పించే మూడు వాగ్దానాలను దైవ ప్రవక్త మహమ్మద్ చేశారు. వాటిలో మొదటిది... దాసుడి సంపద దానం చేయడం వల్ల తరిగిపోదు. అంటే ఒక మనిషి అల్లాహ్ మార్గంలో తన ధనాన్ని వెచ్చించడం వల్ల పేదవాడు అయిపోడు. అంతేకాదు, అతనికి శుభం కలుగుతుంది. అతను దానాలకు, సత్కార్యాలకు చేసిన ఖర్చుకు ఎన్నో రెట్లు తన ధనాగారం నుంచి అల్లాహ్ ప్రసాదిస్తూ ఉంటాడు. అతని ధనాన్ని వృద్ధి చేస్తాడు. రెండోది... దౌర్జన్యం పట్ల సహనం వహించినవారు దౌర్జన్యానికి గురికారు. అంటే ఒక వ్యక్తి దౌర్జన్యానికి, అన్యాయంగా హింసకు గురైనప్పుడు... దానికి ప్రతీకారంగా దౌర్జన్య మార్గాలను అనుసరించకుండా ఉంటే... అతని గౌరవాన్ని అల్లాహ్ ఇనుమడింపజేస్తాడు. ఇహపరాలలో గౌరవమైన పదోన్నతులు కల్పిస్తాడు. మూడోది... ఏ వ్యక్తి అల్లా్‌హను అర్థించే మార్గం తెరవడో... అతనికి దారిద్య్రపు మార్గాన్ని అల్లాహ్ తెరుస్తాడు. అంటే... ఎవరైనా సృష్టికర్తను విస్మరించి, సృష్టిని అర్థించడం అలవాటుగా చేసుకుంటే... వారు దరిద్రుల దగ్గర చేతులు చాచే పరిస్థితికి ;గురవుతారు.
ఈ మూడు దైవ ప్రవక్త వాగ్దానం చేసిన తిరుగులేని అల్లాహ్ నిర్ణయాలు. అలాగే నాలుగు రకాల మనుషుల గురించి కూడా దైవప్రవక్త వివరించారు. ఒక రకం దాసులకు దైవం ధన సంపదలు ప్రసాదించాడు. సరైన జీవన విధానానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించాడు. అలాంటివారు తమ సంపదల వినియోగం విషయంలో అల్లా్‌హకు భయపడతారు. ధన సంపదలతో తమ బంధు మిత్రులకు సాయపడతారు. సత్ప్రవర్తన కలిగి ఉంటారు. వారు అందరికన్నా అత్యున్నత స్థానంలో ఉంటారు. రెండో రకం వారికి దైవం మంచి జ్ఞానాన్ని, సత్సంకల్పాన్ని ప్రసాదించాడు. కానీ ధన సంపదలను ఇవ్వలేదు. అలాంటివారు ‘‘మేము కూడా ధనవంతులం అయి ఉంటే... వారిలా ఎన్నో పుణ్యకార్యాలు చేసేవాళ్ళం. మా ధనాన్ని సత్కార్యాలకు వినియోగించేవాళ్ళం’’ అంటారు. ఇలాంటి సంకల్పం కారణంగా... మొదటివారికి లభించినంత పుణ్యం వీరికి కూడా లభిస్తుంది. మూడోరకం వారికి దైవం ధన సంపదలు ప్రసాదించాడు. కానీ వాటిని సక్రమంగా వినియోగించే జ్ఞానాన్ని ప్రసాదించలేదు. అలాంటి వారు ధనాంధకారంతో ఉంటారు. తమ ధనాన్ని తప్పుడు మార్గాల్లో ఖర్చు చేస్తారు. బంధుమిత్రులను, బీదసాదలను పట్టించుకోరు. వారు అత్యంత నీచమైన స్థితిలో ఉంటారు. నాలుగోరకం వారికి అల్లాహ్ ధన సంపదను, మంచి జ్ఞానాన్ని ఇవ్వలేదు. వారు ‘‘మాకు ఆస్తిపాస్తులు ఉంటే హాయిగా ఉండేవాళ్ళం. కులాసాగా తిరిగేవాళ్ళం. భోగ విలాసాలలో తేలేవాళ్ళం’’ అని అనుకుంటారు. వీరి ఉద్దేశం మంచిది కాదు కాబట్టి సర్వ నాశనం అవుతారు. సంకల్పం మంచిది కాదు కాబట్టి అత్యంత నీచమైన స్థితిలో ఉంటారు. అంటే మనిషికి పాపాలు చేయాలనే కోరిక బలంగా ఉండి, వీలుకాకపోవడం వల్ల ఆ పాపాలు చేయకపోయినా... చెడ్డ ఆలోచనల కారణంగా అల్లాహ్ వేసే శిక్షకు పాత్రుడవుతాడు.
మహమ్మద్ వహీదుద్దీన్