ఆ హాలీవుడ్ సూట్లు మనవే
ABN , Publish Date - Mar 10 , 2025 | 06:04 AM
పై ఫొటోలో సూట్ కుడుతూ బిజీగా కనిపిస్తున్న మహిళ పేరు మేకల కీర్తి. చదివింది నాలుగో తరగతే. అయితేనేం... ఆమె చేత్తో కుడుతున్న సూట్లు....

పై ఫొటోలో సూట్ కుడుతూ బిజీగా కనిపిస్తున్న మహిళ పేరు మేకల కీర్తి. చదివింది నాలుగో తరగతే. అయితేనేం... ఆమె చేత్తో కుడుతున్న సూట్లు ధరించేది మాత్రం హాలీవుడ్ హీరోలు. తిరుపతి సమీపంలోని
శ్రీసిటీలో ఇలాంటి వారు ఎంతో మంది కనిపిస్తారు..
శ్రీసిటీలో ఎమ్మెస్సార్ గార్మెంట్స్ అనే సంస్థ 2010లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనిలో ప్రస్తుతం 148 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 120 మంది మహిళలే కావటం ఒక విశేషం. పైగా వీరిలో చాలా మంది ఐదు క్లాసు వరకే చదువుకున్నారు. ఈ సంస్థలో పనిచేసేవారు తమ చేతితో శ్రద్ధగా సూట్లను కుడతారు. వీరు తయారుచేసే సూట్లు మన దేశంలో అందుబాటులో ఉండవు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. వీటి ఖరీదు 2.5 లక్షల నుంచి 11 లక్షల వరకూ ఉంటుంది. ‘‘మా దగ్గర తయారయిన సూట్లను ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో వాడుతూ ఉంటారు..’’ అని సంస్థ ప్రతినిధి వివరించారు.
అంత సులభం కాదు..
సాధారణంగా మనకు మార్కెట్లో లభించే సూట్లు మన శరీర కొలతలకు తగినట్లుగా ఉండవు. చేతితో కుడితే మాత్రం శరీర కొలతలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విధంగా కుట్టాలంటే విదేశాలలో చాలా ఎక్కువ ఖరీదు అవుతుంది. అందువల్ల వారు తమ కొలతలను ఈ సంస్థకు పంపిస్తారు. దీనికి అనుగుణంగా ఇందులో పనిచేసే సిబ్బంది సూట్లను కుడతారు. అయితే ఇది సులభమైన పని కాదు. ‘‘దీనికి ప్రత్యేక నైపుణ్యం అవసరం. అందుకే మేము ముందు కొద్ది మందిని ఎంపిక చేసుకున్నాం. వారికి సుమారు ఆరేళ్ల పాటు శిక్షణ ఇచ్చాం. వారు బాగా ఆరితేరారని నమ్మకం వచ్చిన తర్వాత ఆర్డర్లు తీసుకోవటం ప్రారంభించాం. మా సంస్థ 2010లో ప్రారంభమయినా - 2016లోనే సూట్లను ఎగుమతి చేయటం ప్రారంభించాం. ప్రస్తుతం మాకు ఏడాదికి 12 కోట్ల టర్నోవర్ ఉంది’’ అని సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. ఒక మిషన్ ద్వారా తయారుచేసిన సూట్లలో ఎన్ని కుట్లు ఉంటాయో తెలియదు. కానీ చేతితో కుట్టేడప్పుడు కొన్ని వేల కుట్లు వేయాల్సి వస్తుంది. ‘‘ఒక మిషన్‌తో సూటు కుడితే ఎనిమిది గంటలు పడుతుంది. మా దగ్గర ఎనిమిది రోజులు పడుతుంది. కానీ ఒక సెంటీమీటర్ కూడా తేడా ఉండదు’’ అని సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
కవరకుంట్ల శివప్రసాద్
ఫొటోలు: సాయికుమార్