Divine Forms of the Supreme: భగవంతుని రూపాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:29 AM
అర్చాస్వరూపుడైన భగవంతుని విగ్రహ రూపాన్ని మూడు విధాలుగా అభివర్ణిస్తారు. అవి... రూపం, అరూపం, రూపారూపం. వీటినే శిల్ప, ఆగమ గ్రంథాలు...
అర్చాస్వరూపుడైన భగవంతుని విగ్రహ రూపాన్ని మూడు విధాలుగా అభివర్ణిస్తారు. అవి... రూపం, అరూపం, రూపారూపం. వీటినే శిల్ప, ఆగమ గ్రంథాలు... ‘వ్యక్తం, అవ్యక్తం, వ్యక్తావ్యక్తం’ అనీ, ‘సకళం, నిష్కళం, సకళనిష్కళం’ అని పేర్కొంటున్నాయి. పదాలు వేరైనా భావం ఒక్కటే. స్పష్టంగా కనిపించేది రూపం. అస్పష్టంగా కనిపించేది అరూపం. స్పష్టాస్పష్టంగా కనిపించేది (కనిపించీ కనిపించనిది) రూపారూపం.
రూపం/ వ్యక్తం/ సకళం:
‘సకళం’ అంటే రూపంతో కూడినది. అంటే తాళమాన (దైవికమైన కొలతల) ప్రమాణాలను అనుసరించి, శిల్ప, ఆగమ నియమాలకు అనుగుణంగా... తల, శరీరం, కాళ్ళు, చేతులు, సకల ఆభరణాలు, ఆయుధాలు, వస్త్రాలంకరణతో కూడిన ప్రతిమలను ‘సకళములు’ అనీ, ‘వ్యక్తములు’ అనీ పిలుస్తారు. సామాన్య భక్తులు కూడా ఈ విగ్రహరూపంలోని భగవంతుణ్ణి దర్శించగలరు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తదితర విష్ణురూపాలు, చంద్రశేఖరమూర్తి, ఆనందతాండవమూర్తి లాంటి శివరూపాలు, ఇంకా వివిధ దేవతా ప్రతిమలు దీనికి ఉదాహరణలు.

అరూపం/ అవ్యక్తం/ నిష్కళం:
‘నిష్కళం’ అంటే రూపరహితం. కానీ ఇది అఖండమైన చైతన్య స్వరూపం. ప్రత్యేకించి ఎటువంటి లక్షణాలు, అంగ విన్యాసం, ఆభరణ విన్యాసం, ఆయుధ విన్యాసం భౌతికమైన కళ్ళకు కనిపించకపోయినా... అఖండమైన భగవత్ శక్తిని తమలో నింపుకొని, ఆశ్రయించిన భక్తులను అనుగ్రహించే స్వరూపాలను ‘అరూప బింబాలు’ అనీ, ‘అవ్యక్త బింబాలు’ అనీ పిలుస్తారు. ఈ నిష్కళ రూపాలలోని భగవంతుణ్ణి యోగులు, సిద్ధులు, తపస్సంపన్నులు, ఆచార్యులు మాత్రమే గమనించి, ఈ లోకానికి ప్రకటించగలరు. సామాన్యులకు నేరుగా అంతుపట్టనిది ఈ అరూప బింబం. శివలింగం, నర్మదానదిలో సహజసిద్ధంగా దొరికే బాణ లింగాలు, గండకీ నదిలో దొరికే విష్ణు స్వరూపాలైన సాలగ్రామాలు ఈ నిష్కళ మూర్తికి ఉదాహరణలు. సాలగ్రామం సదా విష్ణు సాన్నిధ్యంలో ఉంటుంది. సాలగ్రామారాధనలో ప్రత్యేకించి ఆవాహన ఉండదు. అవి సాక్షాత్తూ సుకుమారమైన భగవంతుడి దివ్య స్వరూపం కాబట్టి... అభిషేకం అయ్యాక ‘ప్లోత వస్త్రం’ (మెత్తటి వస్త్రం)తో తుడవడం కూడా చెయ్యరు. అభిషేకం అనంతరం తిరుమణి (నామం)తోపాటు చందనం, తులసి తప్పకుండా సమర్పిస్తారు.

రూపారూపం/ వ్యక్తావ్యక్తం/ సకళనిష్కళం:
కనిపించీ కనిపించక, ఉందా, లేదా? అన్నట్టు ఉండే రూపమే... ‘రూపారూపం లేదా ‘వ్యక్తావ్యక’్త బింబాలు. అరూపమైన శివ లింగానికి నలువైపులా సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష రూపాల ముఖాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఊర్ధ్వ ముఖంగా ఈశాన రూపమూ చెక్కి ఉంటుంది. దీనినే ‘ముఖలింగం’ అంటారు. ఇవి వ్యక్తావ్యక్త బింబానికి ఉదాహరణ. రేణిగుంట సమీపంలోని గుడిమల్లంలో ఉన్న అతి ప్రాచీన శివలింగంపై ఒక మూర్తి చెక్కి ఉంటుంది. రూపానికి ప్రతీక అయిన ప్రతిమ, అరూపానికి ప్రతీక అయిన శివలింగం కలిసిన ఈ రూపాన్ని ‘రూపారూపం’ అని పేర్కొనవచ్చు. ఇక విష్ణు రూపానికి వస్తే... గోచరించీ గోచరించని పూరీ శ్రీ జగన్నాథ స్వామి విగ్రహాలు వైష్ణవ సంప్రదాయంలో ‘వ్యక్తావ్యక్త’ లేదా ‘సకళనిష్కల’ బింబానికి ఉదాహరణ.