Share News

Annadanam: అన్ని ధర్మాలలో శ్రేష్ఠం

ABN , Publish Date - Dec 26 , 2025 | 06:19 AM

కృతయుగంలో తపస్సును, త్రేతాయుగంలో జ్ఞానాన్ని, ద్వాపరయుగంలో యజ్ఞాన్ని, కలియుగంలో దానాన్ని పరమధర్మాలుగా పూర్వులు నిర్ణయించారు. కలియుగంలో...

Annadanam: అన్ని ధర్మాలలో శ్రేష్ఠం

కృతయుగంలో తపస్సును, త్రేతాయుగంలో జ్ఞానాన్ని, ద్వాపరయుగంలో యజ్ఞాన్ని, కలియుగంలో దానాన్ని పరమధర్మాలుగా పూర్వులు నిర్ణయించారు. కలియుగంలో ఎల్లప్పుడూ దానధర్మాలు చేస్తూ ఉండవలసిందే. అందులోనూ ఆకలిని తీర్చడం, నిత్యనియమంగా అన్నదానం చేయడం కర్మలలో ముఖ్యమైన కర్మ. మధ్యాహ్నం పన్నెండు కాగానే... అన్నం తినకపోతే ప్రాణం ఆందోళన పడుతుంది. మనలాగే ఇతరులు కూడా అని తెలుసుకొనేవారు గొప్పవారు.

దానితోనే పరిపూర్ణం

ధర్మాలన్నిటిలో అన్నదానం ప్రథమ స్థానంలో ఉంటుంది. దానికన్నా శ్రేష్ఠమైనది మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం నుంచే ప్రాణులు ఉత్పన్నమవుతాయి. ప్రాణులను జీవింపజేసేది అన్నమే. అతిథులు ఏ సమయంలో వచ్చినా అన్నం పెట్టాలి. అతిథుల్ని సంతృప్తిపరచడం మన సంప్రదాయం, మన సంస్కృతి, మన ఆచారం. అతిథులను, అభ్యాగతులను ఆకలితో వెనక్కు పంపిస్తే దుర్గతిని ఆహ్వానించినట్టే. దుస్తులు, వస్తువుల దానంలో యోగ్యతను చూడవచ్చు కానీ... అన్నదానంలో పాత్రతను ఎంచవలసిన అవసరం లేదు. ఎవరు ఎప్పుడు గుమ్మంలోకి వచ్చినా.... వారికి అన్నం పెట్టకుండా నిరాదరణ చేయడం మంచిది కాదు. ఎన్ని దానాలు చేసినా అన్నదానం చేయకపోతే అది పరిపూర్ణం కాదన్నారు పూర్వులు. అలాగే ఎవరి ఆకలి ముందుగా తీర్చాలనేది కూడా నిర్దేశించారు. అనారోగ్యంతో, వైకల్యంతో, బలహీనంగా ఉన్నవారికి, అభ్యాగతులకు ముందుగా ఆహారం అందించాలి. ఆ తరువాతే ఆప్తులకు, బంధుమిత్రులకు భోజనాలు వడ్డించాలి. అందరికీ తృప్తిగా భోజనం పెట్టి పంపించడం మన సంప్రదాయంలో ప్రధానమైన అంశం. ఆలయాలలో నిర్వహించే అన్నప్రసాద వితరణ లక్ష్యం కూడా అదే. అన్నదానానికి విశిష్టతలు ఉన్నాయి. వాటిలో ఆధ్యాత్మిక చింతన కూడా ప్రబలంగా ఉంది.

Updated Date - Dec 26 , 2025 | 06:19 AM