Share News

ఆ త్యాగం అనుపమానం

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:14 AM

లోకం అసాధ్యాలుగా పరిగణించే ఎన్నో కార్యాలు కొందరి త్యాగ ఫలంతో సుసాధ్యమైన ఉదాహరణలు చరిత్రలో అనేకం. వాటిలో దైవ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం గాథ ఒకటి. మనిషి దైవానికి ప్రీతిపాత్రుడు కావాలన్నా...

ఆ త్యాగం అనుపమానం

సందేశం

లోకం అసాధ్యాలుగా పరిగణించే ఎన్నో కార్యాలు కొందరి త్యాగ ఫలంతో సుసాధ్యమైన ఉదాహరణలు చరిత్రలో అనేకం. వాటిలో దైవ ప్రవక్త హజ్రత్‌ ఇబ్రహీం గాథ ఒకటి. మనిషి దైవానికి ప్రీతిపాత్రుడు కావాలన్నా, తోటి మానవుల హృదయాల్లో కొలువు తీరాలన్నా త్యాగమే ఉత్తమ మార్గమని ఆయన చరిత్ర చెబుతుంది.

త్యాగమయులను లోకం చిరకాలం గుర్తుంచుకుంటుంది. సమాజ శ్రేయస్సులో వారి త్యాగాలే కీలకం అవుతాయి. త్యాగం నుంచే సమర్థవంతమైన నాయకత్వం ఉద్భవిస్తుంది. హజ్రత్‌ ఇబ్రహీం జీవితం ఏ కాలానికైనా ఆదర్శప్రాయం. ఆయన సత్యాన్ని నిలబెట్టడానికి పాటుపడ్డాడు. దేవుడి ఆదేశం మేరకు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి త్యాగం చేయడానికి సైతం వెనుకాడలేదు. ‘త్యాగం’ (ఖుర్బానీ) అనే మాట వినగానే గుర్తుకువచ్చే పేరు ఆయనదే. ఒక విశ్వ సత్యాన్ని లోకానికి చాటిచెప్పడం కోసం కన్న వారిని, ఉన్న ఊరును ఇబ్రహీం విడిచిపెట్టాడు. దేశదేశాలు తిరిగాడు. నిరుపమానమైన త్యాగాలకు పూనుకున్నాడు. ఈ మహా ప్రయాణంలో ఆయనపై కష్టాలెన్నో విరుచుకుపడ్డాయి. అయినా అధైర్యపడలేదు. దైవం తనకు పెట్టిన ప్రతి పరీక్షలోనూ నెగ్గుకుంటూ వచ్చాడు. అప్పుడు దైవం ప్రసన్నుడయ్యాడు. ధర్మాన్ని నిలబెట్టే నాయకత్వ బాధ్యతలను అప్పగించాడు.


ధర్మ సంస్థాపన కార్యంలో తనకు తోడ్పడడం కోసం తనకు ఉత్తమ సంతానం కావాలని దైవాన్ని ఇబ్రహీం వేడుకున్నాడు. ఆ మొరను ఆలకించిన దైవం సచ్ఛీలుడైన కుమారుణ్ణి ప్రసాదిస్తున్నానని ప్రకటించాడు. కొంతకాలానికి అతనికి ఒక కుమారుడు... హజ్రత్‌ ఇస్మాయిల్‌ జన్మించాడు. లేకలేక కలిగిన సంతానం ముద్దు ముచ్చట్లతో సంతోషంగా ఉన్న ఇబ్రహీంకు ఒక కల వస్తుంది. అందులో తన కుమారుణ్ణి బలి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అది దైవం తనకు ఇచ్చిన ఆదేశంగా ఇబ్రహీం భావిస్తాడు. ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. దీనికి ఇస్మాయిల్‌ కూడా సంతోషంగా అంగీకరిస్తాడు. బలికి ఇబ్రహీం ఉపక్రమించబోతూ ఉండగా... ఆయన పట్ల ఎంతో దయ కలిగిన అల్లాహ్‌... ఒక గొర్రెపోతును పంపిస్తాడు. ఇస్మాయిల్‌ స్థానంలో ఆ గొర్రెను దైవానికి ఇబ్రహీం సమర్పిస్తాడు. అప్పుడు ‘‘నా ఆజ్ఞను శిరసావహించిన ఇబ్రహీం తన కుమారుణ్ణి బలి చెయ్యడానికి సంకోచించలేదు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రళయదినం వరకూ ఖుర్బానీని సంప్రదాయంగా పాటించాలి’’ అని అల్లాహ్‌ ఆదేశించాడు. అనంతరం తన గృహమైన కాబాను ఇబ్రహీం చేతుల మీదుగా అల్లాహ్‌ నిర్మింపజేశాడు. ఇస్లాం ధర్మంలో హజ్‌ ఒక విధిగా అప్పటి నుంచి స్థిరపడింది.

ఖుర్బానీ ఇవ్వడం అంటే... దేవుడి ఆజ్ఞలను పాటించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే. ఈ విధమైన స్ఫూర్తి, భక్తి పరాయణత విశ్వాసుల్లో కనిపించకపోతే... పుణ్యాన్ని, దైవానుగ్రహాన్ని పొందలేరు. బక్రీద్‌ రోజున అల్లా్‌హకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆరాధన... ఖుర్బానీ. దానివల్ల పాప ప్రక్షాళన జరిగి, దేవుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఖుర్బానీని సంతోషంగా ఇవ్వాలని దైవ ప్రవక్త మహమ్మద్‌ సూచించారు.

ఈ పండుగ సందర్భంగా హజ్రత్‌ ఇబ్రహీం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. దైవమార్గంలో పయనిస్తున్నప్పుడు... మనకు ప్రీతికరమైన వాటిని ఏమేరకు త్యాగం చేస్తున్నామనే విషయాన్ని విశ్వాసుల్లో ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌


ఖుర్బానీ ఇవ్వడం అంటే... దేవుడి ఆజ్ఞలను పాటించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించడమే. ఈ విధమైన స్ఫూర్తి, భక్తి పరాయణత విశ్వాసుల్లో కనిపించకపోతే... పుణ్యాన్ని, దైవానుగ్రహాన్ని పొందలేరు. బక్రీద్‌ రోజున అల్లా్‌హకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆరాధన... ఖుర్బానీ. దానివల్ల పాప ప్రక్షాళన జరిగి, దేవుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఖుర్బానీని సంతోషంగా ఇవ్వాలని దైవ ప్రవక్తమహమ్మద్‌ సూచించారు.

Updated Date - Jun 06 , 2025 | 05:14 AM