Cooking Tips: వెల్లుల్లిని వెలివేయవద్దు!
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:11 AM
మన వంటల్లో వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మధ్యకాలంలో వెల్లుల్లి లేని వంటిల్లు అరుదుగా కనిపిస్తుంది. ఇలాంటి వెల్లుల్లికి ఉన్న లక్షణాలను మన పూర్వీకులు ఎన్నడో గుర్తించారు. ఆయిర్వేద గ్రంథాల్లో కూడా దీనికి సముచిత స్థానం కల్పించారు.
మనకు తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు చేదు అని ఆరు రుచులున్నాయి. వెల్లుల్లిలో ఒక్క పులుపు తప్ప మిగిలిన రుచులన్నీ ఉంటాయి. ఒక రుచి లేనిది కాబట్టి దీన్ని ‘రసోన’ అని పిలిచేవారు. అదే ‘లశునం’ అయింది. ఇక వెల్లుల్లి పొరలు తెల్లగా ఉంటాయి. నీరుల్లిపాయలకు ఎర్రపొరలు ఉంటాయి. వెల్లుల్లి కూడా చూడటానికి తెల్ల ఉల్లిపాయ మాదిరిగానే ఉంటుంది. అందుకే వెల్ల + ఉల్లి అనే పదాలను కలిపి ‘వెల్లుల్లి’ అని పిలవటం మొదలుపెట్టారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పుకోవాలి. వెల్లుల్లిని ‘భోజన కుతూహలం’ రసాయనం అని పేర్కొంది. వైద్య శాస్త్ర ప్రకారం- మన శరీరంలో రస, రక్తాది ఏడు ధాతువులుంటాయి. ఈ ఏడు ధాతువులను పెంపు చేసే ద్రవ్యాలను రసాయనాలు అంటారు. వెల్లుల్లి కూడా అలాంటి రసాయనం. అందుకే ఇది ధాతుపుష్టిని ఇస్తుంది. వయోభారం మీదపడకుండా, ముసలితనం ముంచుకు రాకుండా కాపాడుతుంది. శరీరానికి కావలసిన వేడిని సమకూరుస్తుంది. శరీరంలో దోషాలను తొలగిస్తుంది. గుండెకు టానిక్‌లా ఉపయోగపడుతుంది.
జీర్ణశక్తిని శస్తుంది. కంటి చూపును పెంచుతుంది. దగ్గు, ఆయాసాల్ని పోగొడుతుంది. నీరుపట్టటాన్ని తగ్గిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే ఆయుర్వేద వైద్యులు దీనిని తినమని సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఈ వెల్లుల్లిని అతిగా తినకూడదు. ప్రతి రోజు ఒక వ్యక్తి నాలుగైదు గ్రాముల కన్నా ఎక్కువ తినకూడదు. ఇది శక్తిమంతమైన ఔషధం కాబట్టి కొద్దిగా తిన్నా ఎక్కువ కాలం దీని ప్రభావం ఉంటుంది. వేడి శరీరతత్వం ఉన్నవారు వెల్లుల్లిని ఎక్కువగా తినకూడదు. రక్తస్రావం అవుతున్నవారు.. రక్త స్రావాన్ని ఆపే మందులను వాడేవారు, మొలల వ్యాధితో బాధపడుతున్నవారు దీనిని తినకూడదు. వాత వ్యాధులతో బాధపడేవారు, స్థూలకాయ సమస్య ఉన్నవారు వెల్లుల్లిని పరిమిత మోతాదుల్లో తీసుకోవాలి. వెల్లుల్లిని అన్నంలో తినటం ఇష్టం లేని వారు ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలను నోట్లో వేసుకొని క్యాప్సుల్స్‌ను మింగినట్లు మింగాలి.
గంగరాజు అరుణాదేవి
వెల్లుల్లిని యూరోపియన్లు ఎక్కువగా ఇష్టపడేవారు. అందుకే దీనికి ‘యవనేష్టం’ అనే పేరు వచ్చింది. ‘ఆయుర్వేద ప్రకాశ’ అనే గ్రంథంలో వెల్లుల్లి వల్ల కలిగే లాభాలను ప్రస్తావించారు. ‘‘ఏకేన లశునేనాపి శుద్ధో భవతి పారదః’’ అని ఈ గ్రంఽథం పేర్కొంది. అంటే - పాదరసం లాంటి ఖనిజాలను కూడా బయటకు పంపటానికి వెల్లుల్లి తోడ్పడుతుందని అర్థం.