Alaya Darshana: అష్టభుజాలతో ఆదిదేవుడు
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:46 AM
నిరాకారో మహేశ్వరః అంటారు. ఈశ్వరుడికి ఆకారం లేదని చెబుతారు. కేదారేశ్వరుడి నుంచి రామేశ్వరుడి వరకు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించినా...
‘నిరాకారో మహేశ్వరః’ అంటారు. ఈశ్వరుడికి ఆకారం లేదని చెబుతారు. కేదారేశ్వరుడి నుంచి రామేశ్వరుడి వరకు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించినా, కాళహస్తీశ్వరుడి నుంచి జంబుకేశ్వరుడి వరకు ఏ పంచభూతేశ్వరుడిని చూసినా, అమరేశ్వరుడి నుంచి భీమేశ్వరుడి వరకు ఏ పంచారామ క్షేత్రానికి వెళ్లినా కనిపించేది ఆ మహాదేవుడి లింగ రూపమే. కానీ, ఆదిదేవుడు సాకార రూపంలో కొలువైన ప్రదేశం... నెల్లూరులోని మహామృత్యుంజయ క్షేత్రం. ఇక్కడ ఆ సర్వేశ్వరుడు సాకార, నిరాకార రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
చిన్న ఆలయంగా మొదలై...
ఆమంచర్ల శివశంకర శర్మ (శంకరయ్య స్వామి) పరమ శివ భక్తుడు. అనారోగ్యం, అర్ధాయుష్షు, అకాల మరణం లాంటి వాటితో బాధపడుతున్న వారికి ఆది వైద్యుడైన ఆ ముక్కంటి అనుగ్రహం ఉండాలని ఆశించారు. మహా మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. 2007లో తాత్కాలికమైన చిన్న ఆలయం ఏర్పాటు చేసి... నిత్యం రుద్రాభిషేకము, పూజలు జరిపేవారు. ఏటా ఉత్సవాలు నిర్వహించేవారు. తదనంతరం అప్పటి కంచి పీఠాఽధీపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి, కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి ఆశీస్సులతో ప్రధాన ఆలయ నిర్మాణానికి 2008లో పునాది వేశారు. ఎందరో దాతలు, భక్తుల సహకారంతో 2020 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయింది అదే ఏడాది నవంబర్‌లో ప్రతిష్ఠ జరుపుకొంది. మహా మృత్యుంజయేశ్వర స్వామి, ఆదిపరాశక్తి, మహాకాళి అమ్మవార్లను నూతన ఆలయంలో ప్రతిష్ఠించారు. లక్ష్మీ గణపతి, బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు, మేధా దక్షిణామూర్తి స్వామి సన్నిధులు, నాగదేవత సహిత నాగేశ్వర స్వామి మందిరం కూడా ఉన్నాయి.
ఆరోగ్య, ఆయు:ప్రదాత
ఈ క్షేత్రంలో మహా మృత్యుంజయేశ్వర స్వామి అష్టభుజాలతో, వ్యాఘ్ర చర్మంపై యోగ ముద్రలో ఆసీనుడై, నాలుగు చేతులతో అమృత కలశాలను ధరించి, తనను తానే అభిషేకించుకుంటూ దర్శనమిస్తారు. మరో రెండు హస్తాలతో జపమాలను, శంఖాన్ని ధరించి ఉంటారు. అలాగే ఆదిపరాశక్తి, కాళికాదేవి కూడా ఎనిమిది చేతులతో పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ కాళీదేవి ప్రసన్న వదనంతో, చిరు మందహాసంతో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని, ఆయుష్షును ప్రసాదించే క్షేత్రంగా పేరు పొందిన ఈ మహా మృత్యుంజయేశ్వర స్వామి ఆలయాన్ని శీఘ్ర వివాహం, సంతాన ప్రాప్తి, మృత్యుగండ దోష పరిహారం నిమిత్తం ఎక్కువ మంది భక్తులు దర్శిస్తారు.