Kritajnata Deepam: కృతజ్ఞతా దీపం
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:44 AM
తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన కార్తికం... ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఆకాశదీపాలు అంటే... సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు...
తెలుగు మాసాలలో ఎంతో పవిత్రమైన కార్తికం... ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఆకాశదీపాలు అంటే... సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. వాటిని వెలిగించినది పరమేశ్వరుడు. లోకాన్ని వెలుగులతో నింపుతున్న ఆ దైవానికి కృతజ్ఞతగా... భక్తులు ఆకాశదీపాలు వెలిగిస్తారు. గాలికి ఆరిపోకుండా చుట్టూ మూసి ఉండే, చిన్న రంధ్రాలు కలిగిన పాత్రలో దీపం వెలిగించి, దానికి తాడు కట్టి, ధ్వజస్తంభానికి వేలాడదీసిన తాడుతో జాగ్రత్తగా పైకి లాగుతారు. ఆ దీపం పితృదేవతలకు దారి చూపిస్తుందనే నమ్మకం ఉంది. ఆకాశదీపాన్ని వెలిగించినా, చూసినా, తలచుకున్నా ఎంతో మంచిదని, ఆ దీపకాంతి ప్రసరించే ప్రదేశాన్ని పరమేశ్వరుడు కాపాడుతాడని పెద్దలు చెబుతారు. దీనివల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయి. ఈ దీపం కోసం భక్తులు చమురు, పత్తితో తయారు చేసిన వత్తులు తమ శక్తి కొద్దీ ఇస్తూ ఉంటారు.
ప్రదోషకాలంలో...
ధ్వజస్తంభం మీద ప్రకాశించే ఆకాశదీపం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా వెలుతురు విరజిమ్ముతుంది. ధ్వజస్తంభం పైకి ఆకాశదీపాన్ని ఆరోహణ చేస్తే... ఈశ్వరుడి ఉత్సవం నిర్వహిస్తున్నట్టు లెక్క. పూర్వకాలంలో, రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో... బాటసారుల కోసం ఆకాశదీపాన్ని పెట్టేవారు. కాలినడకన వచ్చే బాటసారులు ఆకాశదీపాన్ని చూసి, ఆ సమీపంలో దేవాలయం, ఒక గ్రామం ఉన్నాయని తెలుసుకొనేవారు. రాత్రి ఆ గ్రామంలో విశ్రమించి, మరునాడు ప్రయాణాన్ని కొనసాగించేవారు. ప్రదోష వేళల్లో వెలిగించిన ఆకాశదీపాలను దర్శిస్తే... సకల దోషాలు, పాపాలు దూరమవుతాయంటారు.
ఉసిరి దీపాలు...
కార్తిక మాసంలో దీపాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పత్తితో చేసిన వత్తులను ఆవునెయ్యిలో నానబెట్టి, వాటిని అరటి దొప్పల్లో పెట్టి వెలిగిస్తారు. అలాగే ఈ మాసంలో ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తారు. ఉసిరి కాయల పైభాగాన్ని గుండ్రంగా కోసి, మధ్యలో తొలిచి, దానిలో ఆవునేతిలో నానబెట్టిన వత్తి వేసి దీపం వెలిగించడం ఎంతో పుణ్యంగా భక్తులు భావిస్తారు. దీనివల్ల శుభాలు కలుగుతాయని, నవగ్రహ దోషాల పరిహారం జరుగుతుందని, ఇంటికి నరదృష్టి తొలగిపోతుందని నమ్ముతారు. త్రిమూర్తులు, సకల దేవతలు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని విశ్వసిస్తారు. ప్రధానంగా దశమి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో, సోమవారం నాడు ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఇది శ్రీమహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరికి హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. కార్తిక మాసంలో దీని స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్నానం, దానం, దీపం, భోజనం... ఇలా అన్నిటిలోనూ ఉసిరిని మన పూర్వులు చేర్చారు. ముఖ్యంగా కార్తిక పౌర్ణమినాడు ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టి, ఉసిరికి సంబంధించిన ఇరవై ఒక్క నామాలను చదువుతారు. దీపావళి తరువాత ఎనిమిది రోజుల పాటు ‘ఉసిరి నవమి’ వ్రతాన్ని పాటిస్తారు. తొమ్మిదో రోజును ‘అక్షయ నవమి’ అంటారు. ఆ రోజు ఉపవాసం ఉంటారు. ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా పూజిస్తారు. అనంతరం ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తారు. ఇలా చేయడం వల్ల అన్నిరకాల పాపాలు, వ్యాధులు పోతాయనేది విశ్వాసం.
- సి.ఎన్.మూర్తి, 8328143489