Medicine: మందుల వాడకం ఇలా...
ABN , Publish Date - Jan 07 , 2025 | 03:56 AM
సాధారణంగా మాత్రలు మింగడానికి నీళ్లనే ఆశ్రయిస్తూ ఉంటాం.

సాధారణంగా మాత్రలు మింగడానికి నీళ్లనే ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ కొందరు పండ్లరసం, పాలతో మందులు మింగుతూ ఉంటారు. కానీ నిజానికి మందులను కొన్ని పదార్థాలతో జోడించి తీసుకోకూడదు. అవేంటంటే..
ఔషధాలను కొన్ని పదార్థాలతో జోడించినప్పుడు, వాటి ప్రభావాలు పెరగవచ్చు లేదా తగ్గిపోవచ్చు. అరుదుగా ఊహించని దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. కాబట్టి ఔషధాలతో కలపకూడని ఘన, ద్రవ పదార్థాల గురించి తెలుసుకుందాం!
ద్రాక్ష రసం: ఔషధాలతో జోడించకూడని ద్రవ పదార్థమిది. ద్రాక్షరసం దాదాపు అన్ని మందులతో ప్రతికూలంగా ప్రతిస్పందిస్తుంది. అలాగే ద్రాక్షరసం శరీరం ఔషధాన్ని శోషించుకునే తీరును కూడా ప్రభావితం చేస్తుంది. ద్రాక్షరసం, స్టాటిన్స్ (రక్తంలో కొవ్వును కరిగించే మందులు), క్యాల్షియం ఛానల్ బ్లాకర్స్ (గుండె జబ్బు మందులు)... ఈ మూడు ప్రమాదకరమైన సమ్మేళనం. ఇవి గుండె వేగాన్ని, రక్తపోటును ప్రభావితం చేస్తాయి.
బ్రొకొలి, పాలకూర: రక్తపు గడ్డలను అరికట్టే కొన్ని మందులను, విటమిన్ కె ఎక్కువగా కలిగి ఉండే బ్రొకొలి, పాలకూరలతో కలిపి తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల తీసుకునే మందుల ప్రభవం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
అరటిపండు, రెడ్ వైన్: మానసిక కుంగుబాటుకు మందులు వాడుకునేవారు, అరటిపండు, రెడ్ వైన్ తీసుకోవడం వల్ల వారిలో రక్తపోటు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.
కాఫీ: కాఫీ లేదా కెఫీన్ కలిగి ఉండే పానీయాలు బ్రోంఖోడిలేటర్స్‌ను ప్రభావితం చేస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి, తలతిరుగుడు, వాంతులు, తలనొప్పి లాంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి శ్వాసకోశ సమస్యలకు మందులు వాడుకునే వాళ్లు కాఫీని పరిమితం చేయాలి.