Carrot: కేరట్ మనదే!
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:30 AM
‘కేరో’ అనే ఇండో-యూరోపియన్ మూల పదానికి ‘కొమ్ము’ ఆకారంలో ఉండేదని అర్థం. పసుపుకొమ్ము, శొంఠికొమ్ము లాగానే ‘కేరెట్ కొమ్ము’ అని వాడేవారు.

‘కేరో’ అనే ఇండో-యూరోపియన్ మూల పదానికి ‘కొమ్ము’ ఆకారంలో ఉండేదని అర్థం. పసుపుకొమ్ము, శొంఠికొమ్ము లాగానే ‘కేరెట్ కొమ్ము’ అని వాడేవారు. చాలామంది ఇది విదేశాల నుంచి మనకు దిగుమతి అయిన దుంప అని భావిస్తారు. వాస్తవానికి ఈ దుంప మన దేశంలో కొన్ని వేల ఏళ్లుగా పండుతోంది. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు గుంజన దుంపలు, గాజర గడ్డలనే పేర్లతో కేరట్‌నే పేర్కొన్నాయి. 16వ శతాబ్ది నాటి భోజన కుతూహలం, 17వ శతాబ్ది నాటి హంసవింశతి గ్రంథాలలో ఈ దుంప ప్రస్తావన ఉంది.
మనకు దొరికే గాజర దుంపలు లేత కాషాయ రంగులో ఉంటాయి. ఇవి మిగిలిన రంగుల్లో కూడా మనకు లభ్యమవుతాయి. కేరట్ కాయలను మెరికార్స్ అంటారు. మానవ శరీరంలో నిర్మాణ క్రియలకు సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సరిచేసే గుణం వీటికుంది. ఇక కేరట్‌లోని బీటాకెరోటీన్ అనే పదార్థంవల్ల ఆ దుంపలకు కాషాయ వర్ణం ఏర్పడుతుంది. సాధారణంగా మొక్కల్లోని కణాలను అలా్ట్రవయెలెట్ కిరణాల నుంచి ఈ బీటాకెరోటిన్ కాపాడుతూ ఉంటుంది. అందువల్లే కేరట్‌ను తింటే బీటాకెరోటిన్ శరీరానికి అందుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. అంతే కాకుండా కంటి చూపు మెరుగుపరచటానికి కూడా కేరట్ ఉపకరిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైనికులకు కంటి చూపు మెరుగుపరచటం కోసం కేరట్‌ను ఆహారంగా పెట్టేవారట!
కేరట్, ముల్లంగి, కీర... ఈ మూడు దుంపలను సమాన పరిణామాల్లో తీసుకొని జ్యూస్ చేసుకొని రోజూ ఉదయం తాగితే శరీరంలోని అనేక రకాల రోగాలు తగ్గుతాయి. దీనిలో కొద్దిగా పెరుగు కలిపినా మంచిదే.
‘భోజన కుతూహలం’ గ్రంథం ప్రకారం కేరట్‌వల్ల కలిగే ప్రయోజనాలివి...
కేరట్‌లు కఫ దోషాలను పోగొడతాయి. కడుపు ఉబ్బరాన్ని, ఆమ్లాలను తగ్గిస్తాయి.
నులిపురుగులను అరికడతాయి. కడుపునొప్పి వంటి సమస్యలకు ఔషధంగా పని చేస్తాయి.
శరీరంలో వేడి తగ్గుతుంది. చలవ చేస్తుంది. దప్పిక కూడా తగ్గుతుంది.
స్త్రీలలో రక్తస్రావాన్ని అరికట్టడానికి ఇవి ఉపకరిస్తాయి
అమీబియాసిస్ వ్యాధి ఉన్నవారికి కేరట్‌వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి.
గంగరాజు అరుణాదేవి