The Four Pillars of Respect: నాలుగు దిక్సూచులు
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:16 AM
మనిషిని గొప్ప వ్యక్తిగా నిలబెట్టేది అతని ప్రతిభ, విద్య, అధికారం మాత్రమే కాదు. వినయం, విధేయత, కృతజ్ఞత, చిన్నా పెద్దా తేడా లేకుండా ఇతరుల్ని గుర్తించి గౌరవించే హృదయం.....
మనిషిని గొప్ప వ్యక్తిగా నిలబెట్టేది అతని ప్రతిభ, విద్య, అధికారం మాత్రమే కాదు. వినయం, విధేయత, కృతజ్ఞత, చిన్నా పెద్దా తేడా లేకుండా ఇతరుల్ని గుర్తించి గౌరవించే హృదయం, నడవడి ప్రతి వ్యక్తికీ చాలా అవసరం. అవి మనిషి వ్యక్తిత్వానికి బలం, గౌరవం, ఆత్మగౌరవం ఇస్తాయి. వ్యక్తిగత సంబంధాల్లోకానీ, ప్రజా జీవితంలోకానీ, వ్యక్తిత్వ వికాసంలో కానీ మన ప్రవర్తన, సంభాషణలు, సంబంధాలు, విలువలు అనేవి నాలుగు సులువైన, ఆణిముత్యాల్లాంటి పదాలతో ప్రారంభమవుతాయి. అవి ‘దయచేసి’ (ప్లీజ్), ‘ధన్యవాదాలు’ (థాంక్యూ), ‘క్షమించండి’ (అయామ్ సారీ), ‘మీకు స్వాగతం’ (యు ఆర్ వెల్కమ్) అనే ఆ నాలుగూ నాలుగు సముద్రాలు, నాలుగు దిక్కులు మన నలుగురు సహోదరులు. వాటిని అర్థం చేసుకొని, ఆస్వాదిస్తే, అవి మన జీవనయానంతో మనతో చెట్టాపట్టాలు వేసుకొని పయనిస్తాయి. అవి కేవలం మాటలు కాదు. మహత్తర దార్శనిక విలువలు, మన నీతి దిక్సూచులు.
కృతజ్ఞత లేకపోవడం అంటే...
స్వభావాన్ని నిర్మించే ఈ నాలుగు పదాలు అసాధారణ శక్తిని కలిగి ఉంటాయి. ‘దయచేసి’ అనే పదం వినయానికి ప్రతీక. మనం కోరుకోవడమే తప్ప డిమాండ్ చేయడం కాదనే స్వభావ భావన కలిగినది. ‘ధన్యవాదాలు’ అనేది కృతజ్ఞతకు అద్దం. ‘క్షమించండి’ అనేది ఆత్మ సత్యానికి సూచిక. తప్పులను అంగీకరించే ధైర్యాన్ని, సరైన మార్గంలో నడిచే విలువను చూపుతుంది. ‘స్వాగతం’ అనేది ఔదార్యాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రత్యేకించి అధికార స్థానాలకు, అందునా ప్రభుత్వాధికార ఉన్నత స్థానాలకు అలవోకగా చేరినవారు ఈ పదాలలోని బలాలను అర్థం చేసుకోవాలి. ఇవి ప్రభావాన్నే కాదు, నమ్మకాన్ని కూడా నిర్మిస్తాయి. ఎవరూ అధికారాన్ని ప్రకటించాల్సిన, ప్రదర్శించాల్సిన అవసరం ఉండకూడదు. ప్రజలు స్వయంగా ఇవ్వగలరు, లాక్కోనూ గలరు. కానీ ఇతరులను గుర్తించడాన్ని, గౌరవించడాన్ని బలహీనతగా, క్షమాపణను ఓటమిగా, కృతజ్ఞత తెలపడం కూడా ఒక పనిగా భావించేవారు సామ్రాజ్యాలను నిర్మించినా చివరకు ఒంటరితనమే మిగులుతుంది. కనీసం ఒక సామాన్యుడి మద్దతైనా లేకుండా... బలహీనంగా, ఏకాకిగా అయిపోతారు. విజయం ఎంత ఉన్నతమైనా తాత్కాలికమే. కానీ వినయం, కృతజ్ఞత శాశ్వతమైనవి. ‘నేనొక్కడినే సాధించాను’ అనే భావన నిజానికి మనిషిని బలహీనుడిగా చేస్తుంది. ఎందుకంటే గొప్పతనం అనేది ఎవరికీ పూర్తిగా స్వయంకృతం కాదు. విత్తనం వృక్షం కావడానికి నేల, నీరు, గాలి, వెలుగు అవసరమైనట్టే... వ్యక్తుల ఎదుగుదలకు కూడా ఉపకారం, సహకారం, మార్గదర్శకత్వం, అవకాశాలు అవసరం. కొంతమంది సహాయాన్ని ఒప్పుకోవడం బలహీనతగా భావిస్తారు. కానీ చేసిన సాయాన్ని గుర్తించడం వల్ల గొప్పతనం తగ్గదు, పెరుగుతుంది. కృతజ్ఞత లేకపోవడం అంటే... సహాయాన్ని మరచిపోవడం కాదు, గుర్తుంచుకొని బహిర్గతం చేయకపోవడం.
అది మహత్తర విజయం...
ఎవరైనా ఎత్తుకు ఎదిగితే ప్రపంచం చప్పట్లు కొడుతుంది. కానీ తమను ఆ ఎత్తుకు తీసుకువెళ్ళినవారిని మరచిపోతే... ఆ చప్పట్లు నెమ్మదిగా నిశ్శబ్దం అవుతాయి. గొప్పతనం అంటే కేవలం స్థానం, సంపద, గుర్తింపు కాదు. అది వినయం, కృతజ్ఞత, మానవత్వాలను నిలుపుకోవడంలో ఉంటుంది. సహాయం పొందినవారు మరచిపోతే అది బాధ కలిగిస్తుంది... కృతజ్ఞత ఆశించినందుకు కాదు, వారు ఆ ప్రస్తావన తేకపోవడం వల్ల సంబంధాల విలువ తగ్గిందని. వినయం, కృతజ్ఞత ఎప్పుడూ ఐచ్ఛికాలు కావు... అవి వ్యక్తిత్వ పరిమళం. పదవులు మారిపోతాయి. బిరుదులు చెదిరిపోతాయి. జనసందోహం చరిత్రలో కలిసిపోతుంది. కానీ కృతజ్ఞతతో గడిపిన జీవితపు స్మృతి... మనం చూడకపోయినా మనకోసం భద్రంగా ఉంటుంది. ఎంత ఎత్తు ఎక్కేమనేది కాదు, ఎంత వినమ్రంగా వెనక్కి చూసి ధన్యవాదాలు చెప్పగలిగామనేదే మహత్తర విజయం.
కృతజ్ఞత వ్యక్తీకరణ, మర్యాద కనబరచడం, పరుల గౌరవాన్ని గుర్తించడం అనేవి ప్రాచీన భారతీయ సంప్రదాయాల్లో, ఆధునిక నీతి సూత్రాల్లో అత్యున్నత ధర్మాలుగా, గుణాలుగా పరిగణన పొందాయి. వర్తమాన కాలంలో కొంతమంది వ్యక్తులు వీటిని మరచిపోతున్నారు. అజ్ఞానంతో కాదు, పదవీ, ధన అహంకారంతో. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం కేవలం ఎంపికగా మారుతోంది. కృతజ్ఞత అరుదైపోతోంది. సంబంధాలు లావాదేవీలుగా మారుతున్నాయి. సంబంధిత వ్యక్తులకు తమ ఎదుగుదల మూలాలు కనిపించవు. ఫలితంగా భవిష్యత్తులో గౌరవం లేకుండా మిగిలిపోతారు. వారి నడమంత్రపు విజయమే ఇతరులకు వారు ఇవ్వాల్సిన మర్యాదను కనుమరుగు చేసిందేమో లోతుగా ఆలోచించాలి.
వనం జ్వాలా నరసింహారావు
8008137012