Bhagyamma: అడవికి ఆత్మబంధువు
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:39 AM
నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆమె చదువు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.అభ్యంతరాలను, అవహేళనలను తట్టుకున్నారు. చెల్లెళ్లను ప్రయోజకుల్ని చేశారు.....
నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆమె చదువు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.అభ్యంతరాలను, అవహేళనలను తట్టుకున్నారు. చెల్లెళ్లను ప్రయోజకుల్ని చేశారు. అటవీశాఖ అధికారిగా నల్లమల ప్రాంతంలో అక్రమార్కులకు సింహస్వప్నమైన భాగ్యమ్మ... ‘‘వన్యప్రాణులు, వృక్షాల సంరక్షణ కేవలం వృత్తికాదు... నా ఆరో ప్రాణం’’ అని చెబుతున్నారు.
అడవితో భాగ్యమ్మ అనుబంధం బాల్యంలోనే మొదలయింది. ఆమెది మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామానికి చెందిన దళిత కుటుంబం. భాగ్యమ్మ తండ్రి నరసింహ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటించే పని చేసేవారు. తమ పెద్ద కుమార్తె భాగ్యమ్మను, మరో ముగ్గురు కుమార్తెలను బాగా చదివించాలని తల్లిదండ్రులు భావించారు. కానీ ఆడపిల్లలు ఉన్నత విద్యావంతులైతే సంబంధాలు రావడం కష్టం అని తోటి కులస్తులు అభ్యంతరపెడితే, వీరికి పెద్ద చదువులెందుకని గ్రామస్తులు అవహేళన చేశారు. అయినా భాగ్యమ్మ పట్టుదలతో చదివేవారు. అయితే తండ్రి మరణించడంతో... భాగ్యమ్మపైన, ఆమె తల్లి వెంకటమ్మపైన కుటుంబ బాధ్యతలు పడ్డాయి. వెంకటమ్మ కూలీ నాలీ చేసి పిల్లల్ని పోషించేవారు. ‘‘ఆ సమయంలో... కొండారెడ్డిపల్లి పాఠశాలలో టీచర్‌గా పని చేసిన గోపాల్‌రెడ్డి నాకు మనోస్థైర్యాన్ని కల్పించారు. నేను ప్రయోజకురాలిని కావాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆశించారు’’ అని చెప్పారు భాగ్యమ్మ. ఆమె స్వగ్రామంలో పదో తరగతి, మహబూబ్‌నగర్‌లో ఇంటర్మీడియెట్, డిగ్రీ, బీఈడీ చదివారు. రాజేంద్రనగర్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశారు. తనకు ఇష్టమైన నల్లమల ప్రాంతంలోనే ఉద్యోగం చేయాలనేది ఆమె కోరిక. ఆ క్రమంలో... 2008లో అచ్చెంపేట ఫారెస్ట్ డివిజన్‌లో బీట్ ఆఫీసర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.
భయపడేది లేదు...
‘‘నేను పుట్టిన కొండ్రావుపల్లి గ్రామం... కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభం కాకముందు గుక్కెడు నీళ్లకు అలమటించిన ప్రాంతం. నిరుపేదలైన మా తల్లిదండ్రులు ఎన్నో కష్టాలుపడ్డారు. మేం నలుగురం ఆడపిల్లలం. నాన్న మరణించడం, ఎవరినుంచీ సహాయం లభించకపోవడం మాలో కసిని పెంచింది. ‘ఆడపిల్లలు ఏం చెయ్యగలుగుతారు?’ అని ప్రశ్నించినవారికి మా గెలుపుతో సమాధానం ఇవ్వాలనుకున్నాను’’ అని చెప్పారు భాగ్యమ్మ. తల్లి సహకారంతో తన చెల్లెళ్లను ఆమె ప్రయోజకుల్ని చేశారు. ఒక సోదరి పార్వతి మూసాపేట మండలంలో పంచాయతీ కార్యదర్శిగా, మరో సోదరి నాగర్‌కర్నూల్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ఇంకో సోదరి పద్మ పాలిటెక్నిక్ చేస్తోంది. జీవితంలో ఎదురైన సమస్యలను ఆత్మస్థైర్యంతో అధిగమించిన భాగ్యమ్మ... నల్లమల అటవీ ప్రాంతాన్ని, అందులో ఉన్న చెట్లను, వన్యప్రాణులను సంరక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొన్నేళ్ల క్రితం సెక్షన్ అధికారిగా పదోన్నతి పొందిన ఆమె... 74 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని ఆక్రమణల చెర విడిపించి, చెట్లు నాటించారు. మాచారం ప్రాంతంలో... వన్యప్రాణులకోసం 90 హెక్టార్లలో ఫల వృక్షాల పెంపకానికి కృషి చేశారు. రంగాపురం నుంచి రుసుల్‌చెరువు వరకు.. 30కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి ఎదురైన అవాంతరాలను అధిగమించడంలో కీలకపాత్ర పోషించారు. వన్యప్రాణులను చంపినవారి మీద 20కి పైగా కేసులు నమోదు చేశారు. ఆమె నల్లమలలో ఉంటే తమ ఆటలు సాగవనే ఆలోచనతో... కొందరు అనేక అవాంతరాలు కలిగించారు. డిప్యుటేషన్ల పేరిట ఇబ్బందులు పెట్టారు. ‘‘అలాంటి వాటికి నేను భయపడను. చెట్లకు, జంతువులకు హాని కలిగించేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాను. ఎందుకంటే అవి నా ఆత్మబంధువులు’’ అంటున్నారు భాగ్యమ్మ
మహమ్మద్ అబ్దుల్లాఖాన్