Share News

Inseparable Bond of Shiva and Parvati: వాగర్థాలు... అన్యోన్యతా చిహ్నాలు

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:29 AM

కాళిదాస మహాకవి తన రఘువంశ కావ్యంలో పార్వతీ పరమేశ్వరులను మాట అర్థంతో పోల్చాడు. ..

Inseparable Bond of Shiva and Parvati: వాగర్థాలు... అన్యోన్యతా చిహ్నాలు

కాళిదాస మహాకవి తన ‘రఘువంశ’ కావ్యంలో పార్వతీ పరమేశ్వరులను ‘మాట-అర్థం’తో పోల్చాడు. (వాగర్థా వి సంపృక్తౌ... పార్వతీ పరమేశ్వరౌ). ఏదో కొంత భావాన్ని మనసులో పెట్టుకొని...ఆ అర్థం వచ్చేలా మాటను మాట్లాడుతాం. ఏదైనా ఒక మాట మాట్లాడామంటే... దానికి ఒక అర్థం రానే వస్తుంది. అర్థం లేని మాట ఉండదు. మాటలేకుండా అర్థం పుట్టదు. అలా ‘వాక్‌-అర్థం’ అనే విడదీయరాని, విడదీయలేని జంటగా పార్వతీ పరమేశ్వరులు ఉంటారని ఆ శ్లోకం అర్థం. ఇంతకుమించి వారిఅన్యోన్యతను చెప్పగల మరొక పోలిక ఉందా, ఉంటుందా? ఇది నిజం అనడానికి... ఆ ఇద్దరిలోనూ భౌతికంగా కనిపించే ‘అర్ధ+నారీ+ఈశ్వర’ రూపం మరొక తిరుగులేని సాక్ష్యం.

ఒకే మాట...

సృష్టిని నిర్వహించే బ్రహ్మ... తన భార్య సరస్వతికి కేవలం తన ముఖం (నోరు) భాగాన్నే ఇచ్చాడు. స్థితి (రక్షణ) బాధ్యతను చేపట్టిన శ్రీహరి... తన భార్యకు తన వక్షస్థలాన్ని ఇచ్చాడు. ఏ వ్యక్తి శరీరంలోనైనా ఉండే ప్రధాన అవయవాల సంఖ్య 42 కాగా... వాటిలో ఒక్కొక్కటి చొప్పున బ్రహ్మ, విష్ణువు తమ భార్యలకు ఇస్తే... శంకరుడు మాత్రమే 21 భాగాలను.. అంటే తన శరీరంలో తన అర్ధ భాగాన్ని భార్యకు ఇచ్చాడు. ఇక్కడ మరొక విశేషం కూడా ఉంది. బ్రహ్మ భార్య అయిన సరస్వతి... ఆయనమీద తాత్కాలికంగా అలిగి, ఒక నదిగా మారి, ప్రవహించడానికి వెళ్ళిపోయింది. అదే తీరుగా... శ్రీహరి భార్య అయిన లక్ష్మీదేవి కూడా... తాత్కాలికంగా అలిగి, తన తల్లిదండ్రులతో కలిసి సుఖంగా ఉండిపోవడానికి... తన పుట్టిల్లయిన కొల్హాపురానికి వెళ్ళిపోయింది. ఈ రెండు సంఘటనల్లోనూ తత్త్వపరమైన అర్థాలు, సాంకేతిక రహస్యాలు ఉన్నాయనేది వేరే విషయం. అభిప్రాయ భేదాలు రావడానికి కారణం ఒకరు చెప్పినదాన్ని మరొకరు వినకపోవడమే కదా! కానీ శివ పార్వతుల విషయంలో మరొక మాటంటూ లేదు, ఉండదు. పాల సముద్రాన్ని చిలికే వేళ... చెప్పలేనంత వేడిమితో, విషపు వాసనతో గొప్ప ధూమం బయటకు రాసాగింది. శ్రీహరితో సహా అందరూ వెళ్ళిపోతూ ఉంటే... ‘మ్రింగుమనె సర్వమంగళ... మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో’... అలా చోద్యం చూడడమేమిటి? ఈ లోకాలన్నిటినీ భస్మం చెయ్యగల శక్తితో వస్తున్న ఆ విషాగ్నిని మింగాలని శివుణ్ణి ఆజ్ఞాపించింది. అంతే... ఆమె చెప్పడం, ఆయన ముందూ వెనుకా చూడకుండా ఆ విషాన్ని స్వీకరించడం జరిగిపోయింది.


దాంపత్యం అంటే...

అలాగే మరొక సంఘటన. పార్వతి... సతీదేవిగా ఉన్న కాలంలో.. ఆమెను, అల్లుడైన శివుణ్ణి పిలువకుండానే దక్షుడు యాగాన్ని ప్రారంభించాడు. మొదట్లో సతీదేవి కూడా వెళ్ళకూడదని అనుకుంది. కానీ ఆకాశంలో ప్రయాణిస్తున్న అందరి విమానాలు తన పుట్టింటివైపు వెళ్తూ ఉంటే... తనకూ వెళ్ళాలని అనిపిస్తోందని శంకరుడికి చెప్పింది. ‘‘వెళ్ళాలని ఉంది గనుక నువ్వు వెళ్ళు. పిలుపు లేకుండా నేను రాకూడదు. ఇది అర్థం చేసుకో. అయితే అక్కడ నీ మనసుకు బాధ కలిగే సంఘటన ఏదైనా జరిగినా, జరగబోతోందని అనిపించినా... నన్ను మనసులో తలచుకో’’ అని చెప్పాడు. అనుకున్నట్టుగానే ఆమె వెళ్ళింది. తండ్రి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నిలబడింది. ఆమెను చూసిన ఋత్విక్కులు, సోదరులు, ఇతర ముఖ్యులు ‘ఏం జరుగుతుందో’ అనే భయంతో ముఖం తిప్పుకున్నారు. దక్షుడు కూడా ఆమెను చూసి పక్కకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె తీవ్ర మనోవేదనతో శివుణ్ణి స్మరించుకున్న తక్షణమే ఆయన వీరభద్రుణ్ణి పంపాడు. వీరభద్రుడు యాగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా, దక్షుడి తలను తెంచి, యాగాగ్నిలో పడేసి, తల పూర్తిగా దగ్ధమయ్యేదాకా ఉండి, తిరిగి వచ్చేశాడు. సాధారణంగా లోకంలో ఇలాంటి సందర్భం ఎక్కడైనా ఎదురైతే ఏ భర్త అయినా ‘‘వద్దంటే వెళ్తున్నావుగా! జరగరానిది ఏది జరిగినా అనుభవించు’’ అనే అంటాడు. దాంపత్యం అంటే... శివ పార్వతుల మాదిరిగా అన్యోన్యత కలిగి ఉండడమే!

-డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు

Updated Date - Nov 07 , 2025 | 12:29 AM