Diwali: దీపావళి...దివ్య శోభావళి
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:52 AM
భారతీయ సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా... యుగయుగాలుగా జరుపుకొంటున్న పండుగ దీపావళి. భారతీయ సనాతన ధర్మం దీపారాధనకు విశిష్ట స్థానం ఇచ్చింది. శ్రీఆదిశంకరాచార్యులు షణ్మత స్థాపన చేసినప్పుడు...
భారతీయ సాంస్కృతిక వారసత్వ చిహ్నంగా... యుగయుగాలుగా జరుపుకొంటున్న పండుగ దీపావళి. భారతీయ సనాతన ధర్మం దీపారాధనకు విశిష్ట స్థానం ఇచ్చింది. శ్రీఆదిశంకరాచార్యులు షణ్మత స్థాపన చేసినప్పుడు... పంచాయతన పూజా విధానంలో స్కంధునికి ప్రతీకగా... దీపారాధన ఏర్పాటు చేశారు. ఏ శుభ కార్యాన్ని ప్రారంభించినా ముందుగా దీపారాధన చేయడం ఆచారం. దీపం అగ్నికి సంకేతం. సత్కార్యాన్ని అడ్డుకోవడానికి వచ్చిన దుష్టశక్తులను దహించేయాలన్నది దానిలోని అంతరార్థం. సృష్టి, స్థితి, లయలకు దీపంతో సంబంధం ఉంది. దీపంలో కనిపించే నీలం, తెలుపు, ఎరుపు రంగులు త్రిమూర్తులకు ప్రతీకలంటారు. అదే విధంగా, విద్య, శక్తి, ఐశ్వర్యాలను ప్రసాదించే సరస్వతి, దుర్గ, మహాలక్ష్మి ఆ దీపకాంతిలో కొలువై ఉంటారని పూర్వులు చెప్పారు.
దీపదర్శనం సకల పాపాలను పోగొడుతుంది. హృదయం అనే ప్రమిదలో భక్తి అనే తైలాన్ని నింపి, విశ్వాసం అనే వత్తిని ప్రేమ అనే అగ్నితో జ్వలింపజేసేదే దీపం. కళ్ళలో కనిపించే వెలుగు దాని కాంతి, జ్ఞానం అనే జ్యోతి. దీపకాంతులు విరజిమ్మే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందనీ, నిత్యం ఉభయ సంధ్యల్లో దీపాలు వెలిగే ఇంట సిరిసంపదలు, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని శాస్త్రవచనం. దీపావళి వేడుకలు ప్రాచీన కాలం నుంచి జరుగుతున్నాయి. పురాణాల్లో, ఇతిహాసాల్లో దీని ప్రస్తావన ఉంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల వారు తమతమ ఆనవాయితీల ప్రకారం ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు. ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో అయిదు రోజుల పాటు... ధనత్రయోదశి (లక్ష్మీ పూజ), నరకచతుర్దశి (నరక సంహారం), దీపావళి (నరకాసుర సంహారానికి ఆనందం ప్రకటించడం, పితృదేవతలను స్మరిస్తూ, భూలోకానికి వచ్చిన వారు తిరిగి ఊర్థ్వలోకాలకు వెళ్ళే మార్గం సూచిస్తున్నట్టు దివిటీలు చూపించడం) ఆశ్వయుజ మాసం చివరిలో వస్తాయి. కార్తిక మాసం ప్రారంభం రోజును... అంటే ‘బలి పాడ్యమి’గా పరిగణిస్తారు. ఆ రోజున గోవర్ధన పూజలు జరుగుతాయి. విదియనాడు సోదరి ఇంట సోదరుడు విందు (భగినీ హస్తభోజనం) ఆరగించి, దీవెనలు, కానుకలు ఇస్తాడు. ఇది రక్షాబంధన్‌ను పోలి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో... నరక చతుర్దశి, దీపావళిగా... రెండు రోజుల పండుగగా దీన్ని నిర్వహిస్తారు. బెంగాల్ ప్రాంతంలో కాళీ పూజలు, తమిళనాడులో ప్రత్యేకంగా పితృ పూజలు చేస్తారు.
విధి, విధానం
దీపావళి ముందురోజే ఇంట్లో అందరూ తైలంతో అభ్యంగన స్నానం చెయ్యాలి. తైలంలో లక్ష్మి, జలంలో గంగ సూక్ష్మరూపంలో ఉంటారని శాస్త్రాలు చెప్పాయి. అలాగే దీపావళి రోజున కూడా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి. ఆ రెండు రోజులూ ఉదయాన్నే ఇష్ట దైవాలను పూజించాలి. దీపాలను వెలిగించి, పూజామందిరం దగ్గర, ఇంటి ముందు, తులసికోట దగ్గర ఉంచాలి. దీపావళి నాడు లక్ష్మీ పూజ నిర్వహించాలని విష్ణు, మార్కండేయ పురాణాలు ప్రత్యేకంగా చెప్పాయి. అది క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు. దీపావళి నాటి సాయంత్రం ఇంటి ముంగిట కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి. తులసికోట దగ్గర అలంకారాలు చేయాలి. అష్టైశ్వర్యాలు అనుగ్రహించే లక్ష్మీదేవితోపాటు గణపతిని కూడా అర్చించాలి. ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. షడ్రుచులతో కూడిన వంటకాలను నివేదించాలి. ధూప, దీప నివేదనలు పూర్తయిన తరువాత... ప్రమిదలను ఇంటి ముంగిట అలంకరించాలి. తులసికోట దగ్గర, ప్రతి గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెట్టాలి. అలా దీపజ్యోతులతో ప్రకాశవంతమైన ఇంటికి మహాలక్ష్మి వచ్చి కొలువై ఉంటుందన్నారు పెద్దలు. అనంతరం బాణాసంచా కాల్చి, ఆనందోత్సాహాలతో వేడుక జరుపుకోవాలి.
ఆయపిళ్ళ రాజపాప