Christian stories: అత్తాకోడళ్ల కథ
ABN , Publish Date - Jul 18 , 2025 | 02:58 AM
బైబిల్‌లో రూతు కథ ఆసక్తికరంగా ఉంటుంది. అత్తాకోడళ్ళకు సరిపడదనేది లోకంలో స్థిరపడిన సాధారణమైన అభిప్రాయం. అందుకు భిన్నంగా... ‘అత్తా కోడళ్ళంటే ఇలా ఉండాలి’ అనేలా నయోమి, రూతు దర్శనమిస్తారు. కోడలిలో అత్తకు బాధ్యత కలిగిన...
దైవమార్గం
బైబిల్‌లో రూతు కథ ఆసక్తికరంగా ఉంటుంది. అత్తాకోడళ్ళకు సరిపడదనేది లోకంలో స్థిరపడిన సాధారణమైన అభిప్రాయం. అందుకు భిన్నంగా... ‘అత్తా కోడళ్ళంటే ఇలా ఉండాలి’ అనేలా నయోమి, రూతు దర్శనమిస్తారు. కోడలిలో అత్తకు బాధ్యత కలిగిన కుమార్తె కనిపిస్తే, కోడలికి అత్తలో ప్రేమమయి అయిన తల్లి గొంతు వినిపిస్తుంది.
బెత్లెహేములో నివసించే నయోమి యూదు మతాన్ని అనుసరించే వ్యక్తి. ఆమెకు ఇద్దరు కుమారులు. భర్త మరణంతో, అనంతరం తమ ప్రాంతంలో కరువు ఏర్పడడంతో... బిడ్డలతో పాటు మోయబ్ ప్రాంతానికి బతుకుతెరువు కోసం నయోమి పయనమైంది. అక్కడే తన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసింది. ఆమె కోడళ్ళు ఇద్దరూ యూదులు కాదు. అన్యమతస్తులు. కాగా... కొన్నాళ్ళకు నయోమి కుమారులు ఇద్దరూ మరణించారు. వారికి పిల్లలు లేరు. ఈ పరిస్థితుల్లో... తన సొంత ప్రాంతమైన బెత్లెహేముకు తిరిగి వెళ్ళాలని నయోమి నిర్ణయించుకుంది. కోడళ్ళను పిలిచి... ‘‘మీరు ఇక్కడే... మీ తల్లితండ్రుల దగ్గర ఉండిపోండి’’ అని చెప్పింది. ఒక కోడలు సరేనంది. మరో కోడలైన రూతు ‘‘నీవే నాకు తల్లివి, తండ్రివి. వయసు ఉడిగిపోయి, కష్టపడలేని సమయంలో నిన్ను ఇలా విడవడం నాకు భావ్యం కాదు. నిన్ను ఒక్కదాన్నీ విడిచిపెట్టి నేను ఎలా సంతోషంగా ఉండగలను? నీతోనే నా పయనం, నా జీవనం. నీ దేవుడే నా దేవుడు’’ అని చెప్పింది.
అలా అత్తగారితోనే ఉండిపోయిన రూతు... క్రమంగా అత్త కొలిచే దేవుణ్ణి ఇష్టపడింది. నయోమిని తన తల్లిలా ప్రేమించింది. నయోమి కూడా తన కోడలు గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.
బెత్లెహేముకు తిరిగి వచ్చిన తరువాత... తన దగ్గర బంధువైన బోయజు అనే పెద్ద భూస్వామి పొలంలో పరిగె ఏరుకోవడానికి రూతును నయోమి పంపింది. రూతు అందం, వినయం, అత్తగారికి చేసే సేవలు చూసి మనసు పడిన బోయజు... ఆమెను తన భార్యగా స్వీకరించాడు. వారికి ఒక కుమారుడు. ఆ రూతు... క్రీస్తు వంశానికి పూర్వీకురాలు. ఆ అత్తాకోడళ్ళ మధ్య ప్రగాఢంగా అల్లుకుపోయిన బంధాలు ప్రతి కుటుంబంలో నెలకొనవలసిన విలువైన ఆదర్శంగా ఎప్పటికీ నిలుస్తాయి.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్
9866755024
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్