Share News

Nandampudi Uma Ramalingeswara Temple: నంది లేనిశివాలయం

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:29 AM

ప్రమథ గణాలలో అత్యంత ముఖ్యుడు, పరమేశ్వరునికి ఎంతో విధేయుడు నంది. అందుకే శివుని వాహనంగా నందీశ్వరుడు ప్రతి శివాలయంలో...

Nandampudi Uma Ramalingeswara Temple: నంది లేనిశివాలయం

ప్రమథ గణాలలో అత్యంత ముఖ్యుడు, పరమేశ్వరునికి ఎంతో విధేయుడు నంది. అందుకే శివుని వాహనంగా నందీశ్వరుడు ప్రతి శివాలయంలో... గర్భాలయం బయట ఉంటాడు. కానీ నంది లేని అరుదైన క్షేత్రం... ఆంధ్రప్రదేశ్‌లోని అంబాజీపేట మండలం నందంపూడిలో ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర ఆలయం.

సంతాన పార్వతి

స్థలపురాణం, క్షేత్ర విశేషాల ప్రకారం... ఈ ఆలయంలోని లింగాన్ని త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠించాడు. క్రీస్తుశకం పదకొండో శతాబ్దంలో అప్పటి పాలకులు ఆ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. అందులో రామలింగేశ్వరస్వామి మాత్రమే కొలువై ఉండేవాడు. బ్రహ్మచారి అయిన పరశురాముడు... రామలింగేశ్వరుణ్ణి మాత్రమే ప్రతిష్ఠించడంతో... నందంపూడి గ్రామంలోని దంపతులెవరికీ ఆ రోజుల్లో సంతానం కలిగేది కాదట. బంధువులు, స్నేహితుల పిల్లలను దత్తత తీసుకొనేవారట. ఈ నేపథ్యంలో ఆ గ్రామ జమీందారు వడ్లమాని కామేశ్వరరావు పూర్వీకుల ఇంటికి ఒక స్వామీజీ వచ్చారు. ఆయనకు గ్రామస్తులు తమ సంతానలేమి సమస్యను వివరించగా... ఆయన దివ్యదృష్టితో పరిస్థితిని తెలుసుకొని... పార్వతీ దేవిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి గ్రామ ప్రజలకు సంతానభాగ్యం కలుగుతోందని, ఇక్కడి అమ్మవారు ‘సంతాన పార్వతి’గా ప్రఖ్యాతి పొందారని, ఈ సంగతి తెలుసుకున్న ఇతర ప్రాంతాల వారు కూడా అమ్మవారిని దర్శించుకొని సంతానవంతులయ్యారని ఆలయ అర్చకుడు యలమంచలి సుబ్రహ్మణ్య శర్మ వివరించారు.

నందీశ్వరుడి కోరిక

నందంపూడి గ్రామాన్ని రాజరాజనరేంద్రుడు... నన్నయభట్టుకు అగ్రహారంగా దానం చేసినట్టు ప్రతీతి. ఆలయంలోని రాతి శాసనం మీద ఈ ఊరి పేరు ‘ఆనందపురి’గా నమోదై ఉంది. కాలక్రమేణా నందంపూడిగా మారింది. ఇక్కడి శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామికి మరెన్నో విశిష్టతలు ఉన్నాయి. ఇక్కడ శివుడు పశ్చిమాభిముఖంగా ఉంటాడు. గర్భాలయంలో పానవట్టం ఉండదు. అమ్మవారు గర్భాలయంలో ఉండరు. అంతరాలయంలో... ఉత్తరాభిముఖంగా కొలువుతీరి ఉంటారు. సాధారణంగా ప్రతి ఆలయంలో.. అక్కడ కొలువైన దేవుడి వాహనం ఉంటుంది. పరమేశ్వరుడి వాహనమైన నంది... విగ్రహ రూపంలో, శివుడికి అభిముఖంగా అంతరాలయంలో లేదా ముఖమండపంలో ఉంటుంది. ఆ ఆలయాలలోని దేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు వెళ్ళినప్పుడు... వాహనం అనుమతి తీసుకోవడం ఆనవాయితీ. అయితే తన అనుమతి అవసరం లేకుండా భక్తులకు నేరుగా దర్శనం ఇవ్వాలని నందీశ్వరుడు కోరాడట. అందుకే ఈ ఆలయంలో నంది ఉండదు. ఈ ఆలయంలో శివుణ్ణి దర్శించుకొని, భక్తిశ్రద్ధలతో సేవిస్తే... అనంతమైన ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

-సి.ఎన్‌.మూర్తి, 8328143489

Updated Date - Nov 07 , 2025 | 12:29 AM