Team Shivangi: ఆడ పులులు
ABN , Publish Date - May 07 , 2025 | 01:04 AM
‘‘మహిళా పోలీసులు ఎందులోనూ తక్కువకాదు. అవకాశం కల్పిస్తే మగ పోలీసులతో సమానంగా సేవలు అందించగలరు. అది నిరూపించడానికే ‘టీమ్ శివంగి’ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాను. ఇప్పటికే జిల్లాలో మహిళా పోలీసులకు అనేక కీలక బాధ్యతలు...

సంకల్పం
కొద్ది రోజుల కిందట... అడవిలో తప్పిపోయిన నిర్మల్ జిల్లా కప్పనపల్లి మహిళా కూలీలను వెతికి పట్టుకువచ్చింది ‘టీమ్ శివంగి’. చిమ్మచీకటిలో... దట్టమైన అరణ్యంలో... కూంబింగ్ నిర్వహించిన ఆ కమాండో బృందం అంతటా ప్రశంసలు అందుకుంది. ఇరవై మంది మహిళా కానిస్టేబుళ్లతో ఏర్పాటైన ‘టీమ్ శివంగి’... నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల మానస పుత్రిక. పోలీసు వ్యవస్థలో మహిళలను శివంగుల్లా తీర్చిదిద్దడానికి... మగవారికి దీటుగా నిలబెట్టడానికి... తీసుకువచ్చిన ఈ ‘టీమ్’ విశేషాలు ‘నవ్య’ పాఠకుల కోసం.
‘‘మహిళా పోలీసులు ఎందులోనూ తక్కువకాదు. అవకాశం కల్పిస్తే మగ పోలీసులతో సమానంగా సేవలు అందించగలరు. అది నిరూపించడానికే ‘టీమ్ శివంగి’ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాను. ఇప్పటికే జిల్లాలో మహిళా పోలీసులకు అనేక కీలక బాధ్యతలు అప్పగించాం. వారిలో దాగివున్న ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. అంతేకాదు... వారిలో మనోధైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ‘టీమ్ శివంగి’ పేరుతో కమాండో బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ బృందం సభ్యులు నిర్మల్ జిల్లా కప్పనపల్లి గ్రామంలోని దట్టమైన అడవుల్లో తప్పిపోయిన నలుగురు మహిళా కూలీలను వెతికి తేవడం అందరూ చూశారు. ఎంతో సాహసంతో రాత్రింబవళ్లూ కూంబింగ్ చేసి వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చారు’’... అంటారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల. రాబోయే రోజుల్లో ఈ కమాండో్‌సకు ఆమె మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు ఆమె చెప్పారు.
ఇలాంటివెన్నో...
ప్రయోగాత్మకంగా జానకి చేపట్టిన అనేక ప్రాజెక్టుల్లో ‘టీమ్ శివంగి’ ఒకటి. మహిళా సమస్యల పరిష్కారానికి, సైబర్ నేరాల అదుపునకు శాఖలోని చురుకైన మహిళా కానిస్టేబుళ్లను గుర్తించి, పురుష పోలీసులతో సమానంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే పెట్రోలింగ్, వెహికిల్ చెకింగ్ వంటి క్లిష్టమైన పనులను వారికి కేటాయిస్తున్నారు. ‘కేజీబీవీ’ల్లో చదువుతున్న విద్యార్థినులకు అండగా ‘పోలీసు అక్క’ పేరిట చేపట్టిన కార్యక్రమానికి అంతటా ప్రశంసలు అందుతున్నాయి. ఇలా ఎన్నో. ఈ క్రమంలోనే ‘టీమ్ శివంగి’ రూపుదాల్చింది.
ఎందులోనూ తక్కువ కాదు...
జిల్లా పోలీసు శాఖలోని 20 మంది మహిళా కానిస్టేబుళ్లతో ఏర్పాటైన ‘టీమ్ శివంగి’కి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా వీరందరూ 45 రోజులపాటు హైదరాబాద్‌లో కమాండోస్ శిక్షణ తీసుకున్నారు. శివంగి అంటే ఆడ పులి. మహిళలను అంత శౌర్యవంతులుగా తయారుచేయడమే ఈ ‘టీమ్’ ఏర్పాటు లక్ష్యం. జాతీయ స్థాయిలో ఎన్‌ఎ్‌సజీ, రాష్ట్ర స్థాయిలో గ్రేహౌండ్స్ దళాలకు దీటుగా ‘శివంగి’ కమాండోస్ అన్నింటా తర్ఫీదు పొందారు.
శారీరక దారుఢ్యం, పరుగు పందేలు, వెరైటికల్ రోప్ క్లైంబింగ్, పోరాట నైపుణ్యాలు, పేలుడు పదార్థాల నిర్వహణలో శిక్షణ, ఆధునిక ఆయుధాల వినియోగం, వెపన్ హ్యాండ్లింగ్, ఫీల్డ్ సిగ్నల్స్, మ్యాప్ రీడింగ్, మ్యాప్ లేకుండా నేవిగేషన్, శత్రువుల కదలికలు, అడవిలో సంకేతాలను చదవడం, నిఘా పద్ధతులు, ఆకస్మిక దాడి, ఎదురుదాడి కసరత్తులు, రహస్య స్థావరాలపై దాడులు చేయడం వంటి అంశాలతో కూడిన కఠినమైన శిక్షణ కార్యక్రమంతో వీళ్లు రాటుదేలారు.
సాహసోపేతంగా...
ఆ మధ్య నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన నలుగురు తునికాకు మహిళ కూలీలు దట్టమైన అడవుల్లో తప్పిపోయారు. గ్రామస్తుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్పీ జానకీ షర్మిల... వెంటనే ‘టీమ్ శివంగి’ కమాండోలను రంగంలోకి దింపారు. ఎస్పీ నేతృత్వంలోని ఈ టీమ్... దట్టమైన అడవిలో రాత్రంతా కూంబింగ్ నిర్వహించింది. ఎంతో ధైర్యసాహసాలతో అడవిని వడపోసి... తప్పిపోయిన నలుగురు మహిళా కూలీలనూ సురక్షితంగా తీసుకువచ్చింది. తమ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పింది. పురుష కమాండో్‌సకు దీటుగా... దట్టమైన అడవిలో, చిమ్మ చీకటిని లెక్క చేయకుండా కూంబింగ్ నిర్వహించిన తీరు ప్రశంసలు అందుకుంది.
కొండూరి రవీందర్, నిర్మల్
ఇప్పటికే జిల్లాలో మహిళా పోలీసులకు అనేక కీలక బాధ్యతలు అప్పగించాం. వారిలో దాగివున్న ప్రతిభ, నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. అంతేకాదు... వారిలో మనోధైర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ‘టీమ్ శివంగి’ పేరుతో కమాండో బృందాన్ని ఏర్పాటు చేశాం.
ఇవి కూడా చదవండి
Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..