Healthy Recipes: పచ్చి బొప్పాయితో పసందుగా
ABN , Publish Date - Dec 06 , 2025 | 03:43 AM
పచ్చి బొప్పాయిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. దీనితో పచ్చడి, కూర, పులుసు, హల్వా, సలాడ్ లాంటివి చేసుకుని తింటూ ఉంటాం. ఇవి కాక పచ్చి బొప్పాయితో సులువుగా తయారుచేసే విభిన్న వంటకాలు మీ కోసం...
పచ్చి బొప్పాయిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. దీనితో పచ్చడి, కూర, పులుసు, హల్వా, సలాడ్ లాంటివి చేసుకుని తింటూ ఉంటాం. ఇవి కాక పచ్చి బొప్పాయితో సులువుగా తయారుచేసే విభిన్న వంటకాలు మీ కోసం...

థాలీపీట్
కావాల్సిన పదార్థాలు
పచ్చి బొప్పాయి తురుం- ఒకటిన్నర కప్పులు, బియ్యప్పిండి- రెండు కప్పులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- మూడు, జీలకర్ర- ఒక చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, నూనె- తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు, నువ్వులు- అర చెంచా, ఉప్పు- ఒక చెంచా, అల్లం తురుం- ఒక చెంచా, పచ్చి కొబ్బరి తురుం- పావు కప్పు
తయారీ విధానం
వెడల్పాటి గిన్నెలో పచ్చి బొప్పాయి తురుం, బియ్యప్పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, నువ్వులు, జీలకర్ర, అల్లం తురుం, పచ్చి కొబ్బరి తురుం, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని అయిదు నిమిషాలపాటు నాననివ్వాలి. స్టవ్ మీద పాన్ పెట్టి అర చెంచా నూనె రాసి వేడిచేయాలి. బట్టర్ పేపర్ మీద కొద్దిగా నూనె రాసి దాని మీద చిన్న పిండి ముద్దను పలుచగా పరచాలి. దీన్ని వేడెక్కిన పాన్ మీద వేసి చిన్న మంట మీద రెండు వైపులా ఎర్రగా వేయించి పళ్లెంలోకి తీయాలి. దీన్ని టమాటా సాస్, గ్రీన్ చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు.

పేఠా
కావాల్సిన పదార్థాలు
పచ్చి బొప్పాయి కాయలు- రెండు, కిళ్లీలో వాడే సున్నం- ఒక చెంచా, చక్కెర- మూడు కప్పులు
తయారీ విధానం
పచ్చి బొప్పాయి కాయలను శుభ్రంగా కడిగి తొక్క తీసి మధ్యకు కోయాలి. లోపలి గింజలను తీసివేసి మరోసారి శుభ్రంగా కడగాలి. వీటి మీద రెండు వైపులా ఫోర్క్‌తో రంధ్రాలు చేసి ఆపైన చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పెద్ద గిన్నెలో సగానికి పైగా నీటిని తీసుకుని అందులో సున్నం వేసి కలపాలి. ఈ నీళ్లలో బొప్పాయి ముక్కలు వేసి అయిదుగంటలసేపు నానబెట్టాలి. తరువాత ఈ ముక్కలను మంచినీళ్లలో వేసి అయిదారుసార్లు కడగాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో సగానికిపైగా నీళ్లు పోసి అరచెంచా ఉప్పు వేసి వేడిచేయాలి. అందులో బొప్పాయి ముక్కలు వేసి అవి మెత్తబడేవరకూ ఉడికించాలి. తరువాత స్టవ్ మీద నుంచి దించి నీళ్లు వంచేసి మరోసారి మంచినీళ్లు పోసి ముక్కలను కడగాలి. ఒక కడాయిని తీసుకుని అందులో ఉడికించిన బొప్పాయి ముక్కలు, రెండున్నర కప్పుల చక్కెర వేసి బాగా కలపాలి. దీనిమీద మూతపెట్టి గంటసేపు ఉంచాలి. తరువాత కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో అర కప్పు చక్కెర వేసి కలపాలి. చక్కెర మొత్తం కరిగి పాకంలా మారి ముక్కలకు పట్టేవరకూ గరిటెతో కలుపుతూ చిన్న మంట మీద ఉడికించాలి. పావు గంట తరువాత నీరంతా ఇగిరి ముక్కలు పొడిపొడిగా మారతాయి. వెంటనే కడాయిని స్టవ్ మీద నుంచి దించి చల్లార్చాలి. ఇలా తయారు చేసిన పేటా.. లోపల జ్యూసీగా పైన పొడిపొడిగా ఉంటుంది. దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు.

నిల్వ పచ్చడి
కావాల్సిన పదార్థాలు
పచ్చి బొప్పాయి- ఒకటి(నాలుగు కప్పుల ముక్కలు), పచ్చళ్ల కారం- ఒకటిన్నర కప్పులు, ఆవపిండి- ఒకటిన్నర కప్పులు, పచ్చళ్ల ఉప్పు- ముప్పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు- పావు కప్పు, నువ్వుల నూనె- రెండు కప్పులు, నిమ్మరసం- అర కప్పు, మెంతి పిండి- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, అల్లం తరుగు- ఒక చెంచా, నిమ్మ ఉప్పు- ఒక చెంచా
తయారీ విధానం
బొప్పాయి కాయను శుభ్రంగా కడిగి తొక్క తీయాలి. తరువాత మధ్యకు కోసి గింజలు తీసివేసి చిన్న ముక్కలుగా తరగాలి. వీటిని రెండు గంటలసేపు ఎండలో ఆరబెట్టాలి.
వెడల్పాటి గిన్నెలో పచ్చి బొప్పాయి ముక్కలు, కారం, ఆవపిండి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, మెంతి పిండి, పసుపు, అల్లం తరుగు, నిమ్మ ఉప్పు వేసి చేత్తో బాగా కలపాలి. తరువాత నూనె పోసి కలపాలి. ఆపైన నిమ్మరసం వేసి కలపాలి. ఉప్పు సరిచూసుకోవాలి. ఈ పచ్చడిని గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరచుకోవాలి. మూడు రోజుల తరువాత ఈ పచ్చడిని వెడల్పాటి గిన్నెలోకి తీసి మరోసారి బాగా కలపాలి. తరువాత అదే డబ్బాలోకి సర్ది పెట్టాలి. ఇలా తయారుచేసిన బొప్పాయి పచ్చడి మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది. ఇది వేడి అన్నం, ఉప్మా, దోశల్లోకి రుచిగా ఉంటుంది.