Bottle Gourd Breakfast: సొరకాయతో కమ్మని అల్పాహారం
ABN , Publish Date - May 03 , 2025 | 06:11 AM
సొరకాయతో కేవలం కూరలు కాకుండా, ఊతప్పం, గారెలు, పరాఠా వంటి రుచికరమైన అల్పాహారాలు కూడా సిద్ధం చేయవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా వేసవిలో శరీరానికి తాపాన్ని తగ్గించే ప్రభావం చూపుతాయి.
వంటిల్లు
మనం సొరకాయతో కూర, పచ్చడి, పప్పు, పులుసు లాంటి ఎన్నో వంటలు చేస్తూ ఉంటాం. ఇవి కాక సొరకాయతో రుచికరమైన అల్పాహారాలు కూడా చేసుకోవచ్చు. అలాంటి రుచులు మీ కోసం...
ఊతప్పం
కావాల్సిన పదార్థాలు
సొరకాయ తురుం- రెండు కప్పులు, కేరట్ తురుం- అర కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు- రెండు చెంచాలు, ఉడికించిన ఆలుగడ్డలు- రెండు, బియ్యం- ఒక కప్పు, అల్లం ముక్కలు- ఒక చెంచా, మిరియాలు- ఒక చెంచా, పెరుగు- పావు కప్పు, బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా- అర చెంచా, ఉప్పు- తగినంత, నువ్వులు- ఒక చెంచా, ఇంగువ- పావు చెంచా, జీలకర్ర- అరచెంచా, ఆవాలు- పావు చెంచా, ఎండు మిర్చి- రెండు, నూనె- తగినంత, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- అర కప్పు
తయారీ విధానం
ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి నిండా నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి.
మరో గిన్నెలో సొరకాయ తురుం, కేరట్ తురుం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక చెంచా ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు నాననివ్వాలి. తరవాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుంటూ మరో గిన్నెలోకి రసాన్ని గట్టిగా పిండాలి.
మిక్సీలో ఉడికించిన ఆలుగడ్డల ముక్కలు, నానబెట్టిన బియ్యం, అల్లం ముక్కలు, మిరియాలు, సొరకాయ మిశ్రమం నుంచి పిండిన రసం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిండి గరిటె జారుగా ఉండాలి. అవసరమనిపిస్తే అరగ్లాసు నీళ్లు కలుపుకోవచ్చు. ఈ పిండిని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ వేసి కలపాలి. అయిదు నిమిషాలు నాననివ్వాలి.
స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. తరవాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేపాలి. ఈ తాలింపును పిండిలో వేసి కలపాలి. తరవాత పిండిలో సొరకాయ-కేరట్ తురుముల మిశ్రమం, నువ్వులు, పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి ఒక చెంచా నూనె రాయాలి. ఒక గరిటెడు పిండిని పెనం మధ్యలో వేయాలి. చుట్టూరా కొద్దిగా నూనె చిలకరించి మూతపెట్టి రెండు నిమిషాలు ఉంచాలి. తరవాత మూత తీసి ఊతప్పాన్ని రెండోవైపునకు తిప్పాలి. రెండు నిమిషాల తరవాత పళ్లెంలోకి తీయాలి. ఈ ఊతప్పాన్ని పెరుగు చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.
జాగ్రత్తలు
లేత సొరకాయ తురుం తీసుకుంటే ఊతప్పం రుచిగా ఉంటుంది
పిండిని పెనం మీద వేసిన తరవాత దాన్ని గరిటెతో పరచకూడదు.
చిన్న మంట మీదనే ఊతప్పాన్ని రెండు వైపాలా ఉడకనివ్వాలి.
గారెలు
కావాల్సిన పదార్థాలు
పెసరపప్పు- రెండు కప్పులు, సొరకాయ తురుం- ఒక కప్పు, బియ్యప్పిండి- అర కప్పు, అల్లం తురుం- మూడు చెంచాలు, పుదీనా తరుగు- ఒక చెంచా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, కరివేపాకు- ఒక రెమ్మ, పచ్చిమిర్చి- నాలుగు, జీలకర్ర- ఒక చెంచా, ఉల్లిపాయ- ఒకటి, ఉప్పు- తగినంత, నూనె- గారెలు వేగడానికి సరిపోయేంత
తయారీ విధానం
పెసరపప్పును ఒక గంటసేపు నీళ్లలో నానబెట్టాలి. సొరకాయ తురుమును చేత్తో తీసుకుని గిన్నెలోకి గట్టిగా రసాన్ని పిండాలి. మిక్సీలో నానబెట్టిన పెసరపప్పు, సొరకాయ రసం, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో జీలకర్ర, కరివేపాకు తరుగు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తురుం, బియ్యప్పిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి గట్టిగానే ఉండాలి.
స్టవ్ మీద మూకుడు పెట్టి సగానికి పైగా నూనె పోసి వేడి చేయాలి. కొద్దిగా పిండిని తీసుకుని వేళ్ల మీద గారెలా చేసి మధ్యలో బొటనవేలితో రంధ్రం చేసి నూనెలోకి మెల్లగా జారవిడచాలి. ఇలా మొత్తం పిండితో గారెలు చేసి నూనెలో వేయించాలి. గారెలను రెండు వైపులా ఎర్రగా వేపి పళ్లెంలోకి తీయాలి. వీటిని వేడిగా తింటే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
ఈ పిండితో చిన్న పునుగులు, పకోడీలు, చెక్కలు కూడా చేసుకోవచ్చు. ఈ పిండిని మిక్సీలో వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి దానితో దోశలు వేసుకోవచ్చు.
జాగ్రత్తలు
సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి పిండి జారుగా కావచ్చు. అప్పుడు పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ కలిపితే గారెలు కరకరలాడుతూ వస్తాయి. నూనె పీల్చుకోవు.
పిండిలో కొద్దిగా పాలకూర తరుగు కలిపితే గారెల రుచి పెరుగుతుంది.
పరాఠా
కావాల్సిన పదార్థాలు
సొరకాయ తురుం- రెండు కప్పులు, పచ్చి మిర్చి- నాలుగు, వెల్లుల్లి రెబ్బలు- ఏడు, చిన్న అల్లం ముక్కలు- రెండు, నువ్వులు- ఒక చెంచా, జీలకర్ర- ఒక చెంచా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, జొన్న పిండి- ఒక కప్పు, బియ్యప్పిండి- అర కప్పు, గోధుమ పిండి- అర కప్పు, శనగపిండి- పావు కప్పు, నెయ్యి- తగినంత
తయారీ విధానం
మిక్సీలో పచ్చి మిర్చి ముక్కలు, అల్లం, వెల్లులి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో సొరకాయ తురుం, పచ్చిమిర్చి-అల్లం పేస్టు, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత జొన్న పిండి, గోధుమ పిండి, బియ్యప్పిండి, శనగపిండి వేసి ముద్దలా కలపాలి. అవసరమనిపిస్తే ఒక చెంచా నీళ్లు చిలకరించి కలపాలి. ఈ ముద్ద మీద మూత పెట్టి పావు గంటసేపు నానబెట్టాలి.
చేతి రుమాలు లేదా కాటన్ క్లాత్‌ను తడిపి నీళ్లు పిండి సిద్దం చేసుకోవాలి. చేతిని నీళ్లతో తడుపుకుని కొద్దిగా పిండిని తీసుకుని గుండ్రని ముద్దలా చేసి తడి క్లాత్ మీద పెట్టి చేతితో పరాఠాలా అదమాలి.
స్టవ్ మీద పెనం పెట్టి వేడిచేయాలి. ఒక చెంచా నెయ్యి రాయాలి. వేడెక్కిన పెనం మీద పరాఠా వేసి పై నుంచి క్లాత్‌ని తీయాలి. మూతపెట్టి రెండు నిమిషాలు ఉంచాలి. తరవాత పరాఠా మీద ఒక చెంచా నెయ్యి రాసి రెండో వైపునకు తిప్పి రెండు నిమిషాలు ఉంచాలి. రెండు వైపులా ఎర్రగా కాలిన తరవాత పళ్లెంలోకి తీసుకోవాలి. ఈ పరాఠాని వేడిగా తిన్నా చల్లారాక తిన్నా రుచిగానే ఉంటుంది.
జాగ్రత్తలు
సొరకాయ పరాఠాని రెండు కప్పుల బియ్యప్పిండి లేదా జొన్న పిండి లేదా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ అన్నిరకాల పిండ్లు కలిపితేనే దాని రుచి అమోఘంగా ఉంటుంది.
పరాఠాలు అదిమిన క్లాత్‌ను మధ్య మధ్యలో తడుపుతూ దానికి అంటిన పిండిని తొలగించాలి. లేని పక్షంలో పరాఠాలు క్లాత్‌కి అంటుకుపోతాయి.
పరాఠాని మరీ సన్నగా లేదా మరీ లావుగా అదమకూడదు
నెయ్యికి బదులు నూనె వాడుకోవచ్చు.
సొరకాయలో ఎ, బి, సి విటమిన్లతోపాటు పొటాషియం, ఐరన్ లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇది పూర్తిగా నీటితో నిండి ఉంటుంది కాబట్టి వేసవిలో ఏర్పడే నిర్జలీకరణ సమస్యలను నివారిస్తుంది. సొరకాయను తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. గుండె, కాలేయం, మెదడు ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఒత్తిడి, అలసట, నీరసం తగ్గుతాయి. దీనిలోని పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్దకాన్ని, ఊబకాయాన్ని నివారిస్తాయి. సొరకాయలోని పోషకాలు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో చర్మం బిగుతుగా కాంతివంతంగా ఉంటుంది.