Share News

Bonding Feast: బంధాలు నిలిపే భోజనం...

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:49 AM

భగిని అంటే పురుష సంతానమైన తనతో పాటు అదే తల్లి గర్భంలో పుట్టిన స్త్రీ సంతానం అని అర్థం. దీన్నే సహ ఉదర సహోదర అనే పదంతో వ్యవహరిస్తూ ఉంటారు....

Bonding Feast: బంధాలు నిలిపే భోజనం...

‘భగిని’ అంటే ‘పురుష సంతానమైన తనతో పాటు అదే తల్లి గర్భంలో పుట్టిన స్త్రీ సంతానం ’అని అర్థం. దీన్నే ‘సహ+ఉదర’ (సహోదర) అనే పదంతో వ్యవహరిస్తూ ఉంటారు. ‘సోదర’ అనే పదం కూడా ఉంది. సమానం ఉదరం యయోస్తౌ సోదరౌ... తనకు, తన చెల్లెలికి, అక్కకు తల్లి గర్భం ఒకటే అయినప్పుడు ‘సోదర’, ‘సోదరి’ అంటారు. ఆ సోదరీమణుల్లో వివాహాలు అయ్యాక, ప్రధాన కుటుంబం నుంచి వేరైపోయి, వేరే చోట ఉన్నప్పుడు... అప్పుడప్పుడు ఒక్క చోట కలుసుకోవడానికి, కలిసి భోజనం చేస్తూ, చిన్ననాటి విశేషాలను ముచ్చటించుకుంటూ, ఒక రోజంతా ఆనందంగా గడపడానికి ఏర్పాటు చేసిన పండుగ రోజు ఇది.

‘పుట్టింటి చుట్టమైతే వంటింట్లో, అత్తింటి చుట్టమైతే వరండాలో...’ అని తెలుగులో ఒక సామెత ఉంది. అక్కా చెల్లెళ్ళ ఇంటికి అన్నా తమ్ముళ్ళు వస్తే... కాళ్ళు కడుక్కున్నదే తడవుగా వంట చేస్తున్న అక్క దగ్గరకో, చెల్లెలి దగ్గరకో చేరుతారు. చిన్నప్పుడు బడిలో పెన్సిలు దొంగతనాలు, ఇంట్లో పాలూ పెరుగూ ఎవరికీ తెలియకుండా తాగెయ్యడం, మామయ్యను ఆటపట్టించడం, తాతయ్యతో మొట్టికాయలు తినడం, కలిసి ఎడ్ల బండి మీద పొరుగూరు తిరునాళ్ళకు వెళ్ళడం, అక్కడ కొనుక్కున్న బూరాలు, జడకుప్పెలు... ఇలా ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటే, ఎంతో ఆనందం వెల్లివిరుస్తుంది.

దాంపత్యాలకు చికిత్స

ఈ పండుగ ప్రయోజనం అంతమాత్రమే కాదు... ఆ ఇద్దరూ ఉన్నవేళ... బావగారో, బావమరిదో తమ భార్యల మీద విసుక్కున్నా, చిర్రుబుర్రుమన్నా ఆ ఇంటి పరిస్థితి అడగకుండానే తెలిసిపోతుంది. తమ సోదరులకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే పరిష్కరించవచ్చు. కానీ సోదరీమణుల కుటుంబాల్లో అలా కుదరదు. కాబట్టి పరిస్థితిని మౌనంగా గమనించి, తిరిగి వచ్చిన తరువాత ఆ తమ తండ్రికి తెలియజేసేవారు. మనం కూడా ఏదైనా కార్యాలయంలో పని చేస్తున్నట్టయితే.. ఉద్యోగుల మధ్య తలెత్తే వివాదాన్ని సర్వాధికారి సమక్షంలో, అతని అనుమతికి లోబడి పరిష్కరించుకుంటున్నాం కదా! ఇదీ అంతే. అన్నదమ్ములు ఈ పండుగ రోజున వస్తారని తెలిసి... చెల్లెలు-మరిది, అక్క-బావ జాగ్రత్తపడే అవకాశం ఉంది. కాబట్టి తమ కుమార్తెల సంసారం గురించి కుమారులు గమనించి చెప్పిన సమాచారాన్ని తల్లితండ్రులు మనసులో ఉంచుకొనేవారు. అకస్మాత్తుగా కుమార్తెల ఇళ్ళకు వెళ్ళేవారు. తద్వారా వాళ్ళ కుటుంబాల నిజస్వరూపాలు అర్థమయ్యేవి. వారం పదిరోజుల పాటు అక్కడే ఉండి, చికిత్స ప్రారంభించి, పరిస్థితిని సరి చేస్తూ ఉండేవారు. వెనుకటి రోజుల్లో... సకాలంలో ఇటువంటి చికిత్స జరగడం వల్ల విడాకుల మాట వినబడేది కాదు. అంతేకాదు, అత్తమామలు కబురూ కాకరకాయ లేకుండా ఎక్కడ వచ్చేస్తారో అనే ముందుచూపుతో... ఆ భార్యాభర్తలు కూడా సర్దుకుపోయేవారు.


చెరిగిపోని వాత్సల్యం కోసం...

ఈ పండుగ రోజున అన్న చెల్లెలి ఇంటికి వస్తే... చెల్లెలిని ఆశీర్వదించి, ఆ దంపతులకు, మేనల్లుళ్ళకు, మేనకోడళ్ళకు వస్త్రాలు ఇచ్చేవారు. సోదరీమణులు స్వయంగా వంట చేసి సోదరులకు వడ్డించేవారు. ‘భగీనీ హస్త భోజనం’ అంటే... సోదరి స్వహస్తాలతో వండి, వడ్డించిన భోజనం చేయడం. కాబట్టి పనివారికో, కేటరింగ్‌ వాళ్ళకో ఆ బాధ్యత అప్పగించడం సరికాదు. ఇలా పండుగలు, పబ్బాలు అనే వంకతో తరచూ కలుసుకోవడం వల్ల బాంధవ్యం, ప్రేమానురాగాలు, వాత్సల్యాలు చెరిగిపోకుండా ఉంటాయి. పురి (పురం అంటే శరీరం. ఆ శరీరంలో ఉంటాడు కాబట్టి ఆయన పురి (పూరీ) జగన్నాథుడు) క్షేత్రంలో అన్నాదమ్ములైన బలభద్రుడు, శ్రీకృష్ణుల మధ్య సుభద్ర నిత్యం పూజలందుకుంటూ ఉంటుంది. భాతృ సంబంధాన్ని ఎప్పటికీ చెడగొట్టుకోవద్దని ఆ విగ్రహాలు సూచిస్తాయి.

డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు

Updated Date - Oct 17 , 2025 | 03:49 AM