Share News

Prophet Muhammad: కష్టాల్లో సహనం

ABN , Publish Date - Jul 18 , 2025 | 03:02 AM

‘‘కష్టం వెనుక నిశ్చయంగా సుఖం ఉంటుంది. ఏ ఒక్కరి మీదా వారు భరించేగలిగేదానికన్నా ఎక్కువ భారాన్నీ, బాధ్యతను అల్లాహ్‌ మోపడు’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ ఒక సందర్భంలో చెప్పారు. దానికి ఉదాహరణగా పేర్కొనే కథ ఇది. ఒక ఊరిలో ఒక బాలుడు...

Prophet Muhammad: కష్టాల్లో సహనం

సందేశం

‘‘కష్టం వెనుక నిశ్చయంగా సుఖం ఉంటుంది. ఏ ఒక్కరి మీదా వారు భరించేగలిగేదానికన్నా ఎక్కువ భారాన్నీ, బాధ్యతను అల్లాహ్‌ మోపడు’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ ఒక సందర్భంలో చెప్పారు. దానికి ఉదాహరణగా పేర్కొనే కథ ఇది. ఒక ఊరిలో ఒక బాలుడు ఉండేవాడు. అతను ఊరి చివర్లో ఉండే పాఠశాలలో చదివేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం.

ఒక రోజు అతని ఉస్తాద్‌ (గురువు) పిల్లలకు పాఠం చెబుతూ... ‘‘తను సృష్టించిన ప్రతిదానిలో అల్లాహ్‌ ఒక హిక్మత్‌ (జ్ఞానం) ఉంచాడు. దాన్ని మనం కచ్చితంగా గమనించాలి’’ అని బోధించారు. ఈ మాటలు ఆ బాలుడి మనస్సులో బలంగా నాటుకుపోయాయి. ఆ రోజు సాయంత్రం తన ఇంటి దగ్గర ఉన్న తోటలోకి వెళ్ళాడు. అతనికి ఒక పట్టుపురుగు కనిపించింది. ఆ పురుగు తన చుట్టూ ఒక గూడు తయారు చేసుకుంటోంది. ఆ బాలుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ‘ఈ పురుగు ఇలా ఎందుకు చేస్తోంది? ఆ తరువాత దాని నుంచి బయటకు రావడానికి ఎందుకు అన్ని కష్టాలు పడుతోంది?’ అని ఆలోచించాడు.

కొద్ది రోజులకు ఆ పురుగు పెద్దదయింది. రెక్కలు రావడం కోసం శ్రమ పడుతోంది. ఈ దశను గమనించిన ఆ బాలుడి హృదయం చలించిపోయింది. దానికి సాయం చెయ్యాలనుకున్నాడు. దాని చుట్టూ ఉన్న గూడును (కోకూన్‌) ఒక చిన్న కత్తెరతో మెల్లగా కత్తిరించాడు. అప్పుడు ఆ పురుగు బయటకు వచ్చింది. కానీ రెక్కలు బలహీనంగా ఉండడంతో ఎగరలేకపోయింది. కొద్దిసేపటికే ప్రాణం కోల్పోయింది. ఆ బాలుడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. మర్నాడు బడికి వెళ్ళి... తను చేసిన పనిని గురువుకు చెప్పాడు.


అప్పుడు ఆ గురువు ‘‘నాయనా! ఇలాంటి ప్రతి శ్రమలో అల్లాహ్‌ జ్ఞానాన్ని ఉంచాడు. ఆ పురుగు తన శరీరాన్ని ఒత్తిడి చేసి బయటకు రావడం ద్వారా దాని రెక్కలకు బలం వస్తుంది. నువ్వు చేసిన సాయం నీకు దయగా కనిపించవచ్చు. కానీ అది సాయం కాదు. అల్లాహ్‌ కొన్ని పరీక్షల ద్వారా మనల్ని బలోపేతం చేస్తాడు. ఆ సమయంలోమనం సహనం చూపిస్తే మనం బలంగా రూపుదిద్దుకుంటాం’’ అని వివరించారు. ‘ప్రతి కష్టం మనకోసం అల్లాహ్‌ పెట్టే ఒక పరీక్ష, ఒక బహుమానం’ అనే ‘దివ్య ఖుర్‌ఆన్‌’ వాక్యాలను చదివి వినిపించారు. ‘కష్టాల్లో సహనం చూపించేవారికి అల్లాహ్‌ మేలు చేస్తాడు’ అనే విషయం ఆ బాలుడికి అర్థమయింది. గురువుకు సలామ్‌ చేసి ఇంటికి బయలుదేరాడు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 03:02 AM