Share News

Sri Krishna: సంతృప్తికి మార్గం

ABN , Publish Date - Jan 31 , 2025 | 04:24 AM

పరమాత్మ పట్ల మాత్రమే పూర్తిగా స్థిరపడుతుంది’’ అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మన కోరికలన్నీ తీరిన తరువాత... మనం సంతుష్టి చెంది, సుఖాన్ని పొందుతామనీ, దుఃఖాన్ని దూరం చేసుకుంటామనీ భావిస్తూ ఉంటాం.

Sri Krishna: సంతృప్తికి మార్గం

‘‘ఎవరైతే మనఃప్రసన్నతను పొందుతారో... తక్షణం వారి దుఃఖాలన్నీ నశిస్తాయి. ప్రసన్నచిత్తుడైన యోగి బుద్ధి ఇతర విషయాలన్నిటి నుంచి వైదొలగి, పరమాత్మ పట్ల మాత్రమే పూర్తిగా స్థిరపడుతుంది’’ అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మన కోరికలన్నీ తీరిన తరువాత... మనం సంతుష్టి చెంది, సుఖాన్ని పొందుతామనీ, దుఃఖాన్ని దూరం చేసుకుంటామనీ భావిస్తూ ఉంటాం. కానీ మొదట సంతుష్టి చెందాలనీ, ఆ తరువాత మిగిలినవన్నీ వాటంతట అవే అనుసరిస్తాయనీ శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు.

ఉదాహరణకు మనకు జ్వరం, శరీర అవయవాల్లో నొప్పులు తదితర లక్షణాలు ఉంటే... మనం ఆరోగ్యంగా లేమని నిర్ధారించుకుంటాం. ఈ లక్షణాల మూలాలకు చికిత్స చేయకుండా వాటిని అణచివెయ్యడం వల్ల ఆరోగ్యం కుదుటపడదు. పోషకాహారం, మంచి నిద్ర, వ్యాయామం లాంటివి మనకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అదే విధంగా అసంతృప్తికి కారణమైన భయం, క్రోధం, ద్వేషం లాంటివి మనలో సంతృప్తి లేకపోవడాన్ని సూచిస్తాయి. వాటిని కృత్రిమంగా అణచివేయడం వల్ల మనకు సంతృప్తి లభించదు. క్రోధాన్ని, ద్వేషాన్ని అణచివేసి, సమాజంలో ఆమోదయోగ్యమైన ప్రవర్తనను ప్రదర్శించడానికి అనేక శీఘ్ర పరిష్కారాలు ఉన్నాయి. ప్రస్తుతకాలంలో కూడా అవి ఆచరణలో ఉన్నాయి. కానీ ఈ లక్షణాల్ని అణచివేస్తే... కొంతసేపటి తరువాత మరింత శక్తితో తిరిగి వస్తాయి. ఉదాహరణకు మన బాస్‌ మీద అణచిపెట్టుకున్న కోపం తరచుగా కింది ఉద్యోగులు లేదా కుటుంబ సభ్యుల మీద వ్యక్తమవుతుంది. ఈ ప్రపంచం తాలూకు ద్వంద్వ స్వభావం గురించి తెలుసుకోవడం, కర్మ ఫలం ఆశించకుండా కర్మను ఆచరించాలనే అవగాహన, త్రిగుణాలే మన కర్మలకు, ఆలోచనలకు భావాలకు అసలైన కర్తలనీ, మనం కేవలం సాక్షులం మాత్రమేననీ గుర్తించడం... ఇదీ సంతృప్తికి మార్గం.


మన నిజ స్వరూపమైన అంతరాత్మ ఎల్లప్పుడూ సంతుష్టిగా ఉంటుంది. తాడు, పాము ఉదాహరణలో... తాడులో పాముని చూసినట్టు మనలో వ్యక్తమయ్యే దానితో మనల్ని జత చేసుకొని, అసంతృప్తికి లోనవుతాం. ఈ దుఃఖం నుంచి విముక్తి పొందాడానికి శ్రీకృష్ణుడు మనల్ని ‘ఆత్మవాన్‌’, ‘ఆత్మారామన్‌’... అంటే ఆత్మతో తాదాత్మ్యం చెందాలని సూచిస్తున్నాడు. ఇది దుఃఖాల అణచివేత కాదు. వాటిని సాక్షిగా చూస్తూ ఉండే సామర్థ్యాన్ని సంపాదించుకోవడం.

Updated Date - Jan 31 , 2025 | 04:24 AM