Share News

Spiritual Freedom Lies: ఆధ్యాత్మికతకు మతం అవసరం లేదు

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:51 AM

ప్రపంచంలో మరే ఏ సంస్కృతిలోను ఇది లేదు. చాలా మంది మోక్షం అంటే మనిషి చనిపోయిన తర్వాత వచ్చేది అనుకుంటారు. కానీ మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు వచ్చే స్వేచ్ఛే మోక్షం. ఒక వ్యక్తి పూర్తిగా అంతర్ముఖుడైనప్పుడే ఈ స్థితి వస్తుంది.....

Spiritual Freedom Lies: ఆధ్యాత్మికతకు మతం అవసరం లేదు

మన భారతీయ ఆధ్యాత్మిక మూల తత్త్వం ఏమిటి?

మోక్షం. ప్రపంచంలో మరే ఏ సంస్కృతిలోను ఇది లేదు. చాలా మంది మోక్షం అంటే మనిషి చనిపోయిన తర్వాత వచ్చేది అనుకుంటారు. కానీ మనం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు వచ్చే స్వేచ్ఛే మోక్షం. ఒక వ్యక్తి పూర్తిగా అంతర్ముఖుడైనప్పుడే ఈ స్థితి వస్తుంది. ఈ స్థితిలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనపై ప్రభావం చూపించటం మానేస్తాయి. ఇలాంటి వ్యక్తులు ఒకప్పుడు మనభారత దేశంలో ఉండేవారు. ఇప్పటికీ ఉన్నారు.

సనాతన ధర్మాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు?

ధర్మం, అర్ధం, కామం, మోక్షం అనే భావనలు అన్ని సంస్కృతులలోనూ ఉన్నాయి. కానీ సనాతన ధర్మంలోని నిష్పాక్షికత ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే- ప్రకృతి, సూర్యుడు, గాలి, నీరు- ఇవన్నీ నిష్పాక్షికమైనవి. మనలోని ఆత్మ కూడా నిష్పాక్షికమైనదే! దానికి ఎటువంటి రాగద్వేషాలు ఉండవు. ఈ రెండింటినీ అర్ధం చేసుకున్నప్పుడు సనాతన ధర్మం అర్థమవుతుంది. భారతీయ సంస్కృతిలో నదులను, పర్వతాలను, ప్రకృతిని ఆరాధిస్తారు, పూజిస్తారు, గౌరవిస్తారు. రక్షించటానికి ప్రయత్నిస్తారు. ఇతర దేశాల్లో ఇలాంటి విధానం ఉండదు. ఇదే విధంగా ప్రతి వ్యక్తికి కొన్ని ధర్మాలు నిర్దేశించారు. పితృధర్మం, పుత్ర, పుత్రి ధర్మం ఈ కోవలోకే వస్తాయి. వీటిని ఆచరిస్తే ప్రతి వ్యక్తి తన చుట్టు పక్కల ఉన్న వారిని గౌరవించగలుగతాడు. ఇలా మనకు అంతర్ముఖంగా... బహిర్ముఖంగా ఉన్న వాటన్నింటినీ గౌరవించటమే సనాతన ధర్మం.

మనుషుల అవసరాల కోసం ఈ ధర్మం మారుతోందా? ఉదాహరణకు మన అవసరాల కోసం భూమిని, కొండలను, నదులను ఎక్కువగా వాడుకుంటున్నాం కదా...

అవగాహనారాహిత్యం వల్ల ఇలా జరుగుతోంది. ప్రస్తుతం మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. మన స్వలాభం కోసం, అవసరాల కోసం ప్రకృతిని వాడుకుంటున్నాం. అదే సమయంలో ప్రకృతికి దూరంగా జరుగుతున్నాం. ధర్మం ఎప్పటికీ మారదు. మనిషిలో- ‘ ఈ ప్రకృతి నాది’ అనే భావన పెరిగినప్పుడు ఈ సమస్యలు పెరుగుతాయి. ఒక మనిషి ఈ భూమి మీద 30 వేల రోజులు ఉంటాడనుకుందాం. ఆ తర్వాత ఏదీ అతనిది కాదు కదా! ‘నాది’, ‘నాకోసం’, ‘నా పిల్లల కోసం’ అనే అజ్ఞానం వల్ల సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నాం. పిల్లలలో పోటీతత్వాన్ని, పోల్చుకోవడాన్ని పెంచుతున్నాం. ‘ఆనందం నాలోనే ఉంది’- అనే ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంటుంది. దానినుంచి దూరం జరిగినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ప్రతి వ్యక్తి ఒక ద్వీపంలా మారుతున్నాడు. ఇతరులకు దగ్గరగా ఉండాలనుకోవటం లేదు. టెక్నాలజీ మనల్ని స్వతంత్రులుగా చేయటం లేదు. బానిసలుగా మారుస్తోంది.


సైన్స్‌, ఆధ్యాత్మికతల మధ్య ఉన్న మౌలికమైన తేడాలు ఏమిటి?

ఆధ్యాత్మికత ఇతరులకు చెప్పలేని అందమైన అనుభవం. అది మన స్వభావంలో వచ్చిన మార్పుల ద్వారా బయటకు కనిపిస్తుంది. మేఽధ ద్వారా దానిని అర్థం చేసుకోలేం. జీవితం అంటే ఎనర్జీ అండ్‌ మేటర్‌ (శక్తి, పదార్థం)ల కలయిక. చావు అంటే ఎనర్జీ మైనస్‌ మేటర్‌. ఇక్కడ శక్తి అనేది స్థిరమైన అంశం. ఇది మనలోనే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవటమే ఆత్మశోధన. మనలో ఉన్న శక్తితో పాటుగా బయట ఉన్న శక్తిని అనుభవించటమే దైవత్వం. ఇది అనుభవిస్తే కానీ తెలియని విషయం. ఇక సైన్స్‌- బయట ప్రపంచాన్ని అన్వేషించే ఒక సాధనం. ఇది మేధోపరమైనది. అనుభవించలేనిది. అందుకే ఈ రెండూ వేర్వేరు.

మతం, ఆధ్యాత్మికత- ఈ రెండింటి మధ్య విభజన రేఖను ఎలా గుర్తించాలి?

మతం ఒక విధానం. ఒక వ్యవస్థ. మనుషులను క్రమశిక్షణలో పెట్టే ఒక ప్రక్రియ. ఆధ్యాత్మికత వ్యక్తి ప్రధానం. దీనికి ఎటువంటి మతం అవసరం లేదు. మనిషి ఒంటరిగా పుడతాడు. ఒంటరిగా చనిపోతాడు. ఈ మధ్యలో జరిగే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే ఆధ్యాత్మికతకు దూరంగా వెళ్లిపోతాం. ప్రపంచం నుంచి ఎంత ఎక్కువ కావాలనుకుంటే- అంత శక్తిహీనులం అవుతాం. ఒకసారి ప్రముఖ సూఫీ కవి రూమి తన గురువు దగ్గరకు వెళ్లి - ‘‘నాకు ఆధ్యాత్మికత మార్గాన్ని బోధించండి’’ అని అడిగాడట. అప్పుడు ఆ గురువు- ‘‘నీ పుస్తకాలన్నీ సముద్రంలో పడేసి నా దగ్గరికి రా!’’ అన్నాడట. ఇక మతాలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవే! ఒక సమాజంలోని వ్యవస్థలు సమర్ధంగా పనిచేయాలంటే మనుషులు కావాలి. వారిని ఒక క్రమశిక్షణలో పెట్టేదే మతం. దీనిలో దేవుడి పాత్ర తక్కువ. దేవుడి కోసం బయట వెతికితే బొమ్మలు, శిల్పాలు మాత్రమే కనిపిస్తాయి. మన లోపల అన్వేషిస్తే నిజమైన శక్తి అనుభవంలోకి వస్తుంది.


నిజమైన గురువు ఎవరు..

మనం ఎవరితో మమేకం కాగలుగుతామో అతనే నిజమైన గురువు. ఆయన మనకు ఒక మాధ్యమం. ఒక పిల్లవాడిని వాళ్ల నాన్న - ‘‘వెళ్లి అగ్గి తీసుకురా’’ అన్నాడట. ఆ పిల్లవాడు వెళ్లి దీపం తీసుకొచ్చాడు. వాళ్ల నాన్న ‘‘ఇది దీపం కదా...’’ అన్నాడట. అప్పుడు ఆ పిల్లవాడు వెలుగుతున్న కర్పూరాన్ని తీసుకువచ్చాడట. ‘‘ఇది కర్పూరం కదా’’ అన్నాడట. అగ్నిని ఒక మాధ్యమం లేకుండా ఎలా అనుభవించలేమో... దైవత్వాన్ని కూడా మాధ్యమం లేకుండా అనుభవించలేం. ఆ మాధ్యమమే గురువు. చాలామంది- ‘నిజమైన గురువు’ ఎవరు అని అడుగుతూ ఉంటారు. మనం మమేకం కాగలిగే వ్యక్తే నిజమైన గురువు. అది మన మనసుకు తెలుస్తుంది. చాలామంది రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. ఒక తలుపును తడితే అన్వేషి అవుతాడు. అనేక తలుపులు తడితే బిచ్చగాడు అవుతాడు. అన్వేషి తృప్తిగా జీవితాన్ని జీవించగలుగుతాడు. బిచ్చగాడికి ఇతరులు విదిల్చిన మెతుకులే దక్కుతాయి.

-సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Oct 10 , 2025 | 01:51 AM