Share News

Traditional Forest Feasts: సర్వ సమత్వమే పరమార్థం

ABN , Publish Date - Nov 14 , 2025 | 03:36 AM

ఏ పద్ధతులు పూర్వం నుంచి సంప్రదాయబద్ధంగా వస్తున్నాయో... వాటిని పూర్తిగా విస్మరించి, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు జరుపుకొంటున్న కార్యక్రమాల్లో వనభోజనాలు కూడా ఒకటి. చైత్ర, వైశాఖ మాసాల్లో....

Traditional Forest Feasts: సర్వ సమత్వమే పరమార్థం

ఏ పద్ధతులు పూర్వం నుంచి సంప్రదాయబద్ధంగా వస్తున్నాయో... వాటిని పూర్తిగా విస్మరించి, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు జరుపుకొంటున్న కార్యక్రమాల్లో వనభోజనాలు కూడా ఒకటి. చైత్ర, వైశాఖ మాసాల్లో అమ్మవారి ఉత్సవాలు, జ్యేష్ఠ, ఆషాఢాల్లో విపరీతమైన ఎండలు, శ్రావణ, భాద్రపదాల్లో ఉద్ధృతంగా కురిసే వర్షాలు, ఆశ్వయుజంలో అమ్మవారి ఉత్సవాలు, మార్గశీర్షంలో చలి, మంచు, మాఘ, ఫాల్గుణాల్లో ప్రకృతి ఆకులు రాలుస్తూ, జలాశయాలు ఎండిపోతూ సౌందర్య రహితంగా కనిపించే వాతావరణం... ఈ చివరి మాసాల్లోనే శివరాత్రి, హోలీ పండుగలు ఉంటాయి. కాబట్టి చలీ, వేడీ కలిసి ఉండే కార్తికాన్ని వనభోజనాలకు అనువైన కాలంగా పూర్వ ఋషులు నిర్ణయించారు.

ఆ విశేషాలు తెలుసుకోవాలి...

ప్రయోజన మనుద్దిశ్య న మందోజపి ప్రవర్తతే... ఏదో ఒక ప్రయోజనం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరు. కార్తిక మాసానికి ముందు వచ్చే శ్రావణ, భాద్రపదాలు వర్ష ఋతువు. వర్షాలు భారీగా కురిసి ఉంటాయి. అప్పటివరకూ మనకు కనిపించకుండా ఉన్న విత్తనాలన్నీ మొలకెత్తి, ఆశ్వయుజ మాసంలో తగిన ఔషధ శక్తిని తమలో నింపుకొంటాయి. కార్తిక మాసానికి మంచి ఓషధులుగా ఆ మొక్కలు తయారవుతాయి. అలాంటి కాలంలో... వృక్షాలకు సంబంధించిన ఓషధీ గుణాలను వివరించి చెప్పగలిగే ఒక వయోధికుణ్ణి వనాలకు తీసుకువెళ్ళి, ఆ చెట్ల విశేషాల గురించి ఆయన చెబుతూ ఉంటే తెలుసుకోవాలి. వ్యాధి నివారకమైన మందులు, మాకుల గురించి (మాకులు అంటే చెట్లు) తెలుసుకోవాలి.

ప్రయోజనాలు ఎన్నెన్నో...

వనంలో చెట్లన్నీ పక్కపక్కనే ఉంటాయి. సువాసనను ఇచ్చే మంచి గంధం చెట్టు పక్కన.. కుంకుడు, తుమ్మ లాంటి చెట్లు కనిపిస్తాయి. అదే తీరుగా... వనభోజనానికి వచ్చిన వ్యక్తులు కూడా ‘తమ సంపద స్థాయి, పలుకుబడి, హోదా లాంటి విషయాలను మరచి మెలగాలి’ అనేది తెలుసుకోవాలి. వనభోజనాలలో శరీర ఆరోగ్యానికి భంగం కలిగించని సాత్త్వికమైన పదార్థాలతోనే వంటలు చేయాలి. వడ్డనలో నైపుణ్యం ఉన్నవారు మాత్రమే వడ్డిస్తే... పదార్థాలు వృధా కావు. ఇక... భోజనం చేసేటప్పుడు సభ్యతగా వ్యవహరించాలి. సెల్‌ఫోన్లు చూస్తూ తినకూడదు. అన్నిటికీ మించి... పక్షి తీర్థంలో భోజన సమయానికి గెద్ద వాలినట్టు... సరిగ్గా భోజన సమయానికే రావడం తగదు. బోజనాలకు ముందు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో పాల్గొన్నాక... మనకు ఆహారాన్ని ఇచ్చిన ఆ దైవాన్ని ధ్యానించిన తరువాతే భోజనం చేయాలని తెలుసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో ఆహార పదార్థాలను వండి తేవడం, క్యాటరర్స్‌ ద్వారా తెప్పించుకోవడం సరికాదు. వనంలో భోజనం చేయాలనుకున్న వేళ... ఒకరు ఎండు కట్టెలను పోగు చేయడం, ఒకరు పొయ్యిని సిద్ధం చేయడం... ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక్క పని చేయాలి. భోజనాలు అయ్యాక పాత్రలను కూడా కలిసే శుభ్రం చేయాలి. అక్కడ ఎక్కువ, తక్కువ అనే ఆలోచనలు లేకుండా... సర్వ సమత్వ దృష్టిని కలిగి ఉండాలి. వ్యాపార ప్రకటనలకు సంబంధించిన కాగితాలను పంచడం, వస్త్రాలను అమ్మడం, లక్కీడిప్‌ లాంటివి నిర్వహించడం... ఇలాంటివి మానుకోవాలి.

- డాక్టర్‌ మైలవరపు శ్రీనివాసరావు

Updated Date - Nov 14 , 2025 | 03:36 AM