Share News

Health Power of Spinach: పాలకూర శక్తిదాయకం

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:22 AM

పాలకూర శక్తిదాయక శాకంగా ఆయుర్వేదం పేర్కొంది. ఇది రక్తనాళాల ఒత్తిడిని తగ్గించి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది

Health Power of Spinach:  పాలకూర శక్తిదాయకం

పాలక్యమీషత్కటుకం మధురం పథ్యశీతలమ్‌

రక్తపిత్తహరం గ్రాహి ఙ్ఞేయం సంతర్పణం పరమ్‌

పాలకూర... కొద్దిగా తీపి, కొద్దిగా కారం, సున్నితమైన రుచి కలిసిన మధురమైన శాకం. ‘భోజనకుతూహలం’ గ్రంథం దీన్ని శక్తిదాయకమైన, అన్ని వ్యాధుల్లోనూ తినదగిన శాకంగా పేర్కొంది. ఇది శీతల గుణంతో రక్తనాళాల సమస్యలు, జీర్ణవ్యాధుల నివారణలో సహాయపడుతుంది. రోగనిరోధకతను బలోపేతం చేస్తుంది. రక్తస్రావాన్ని, రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చలవ చేస్తుంది.

మలబద్ధకానికి ఉపశమనం

పాలకూర అత్యంత సురక్షితమైన ఆకుకూరల్లో ఒకటి. మలబద్ధకాన్ని తగ్గించి కాలవిరేచనం కలిగిస్తుంది. నీళ్ల విరేచనాలతో బాధపడేవారి దేహంలోని నీటి శాతం నియంత్రణకు తోడ్పడుతుంది.

పాలకూర శక్తిదాయకం

1930లలో వచ్చిన ‘పొపేయి ది సైలర్‌ మ్యాన్‌’ అనే కార్టూన్‌ పాత్ర, పాలకూర తింటూ అకస్మాత్తుగా బలాన్ని పొందే కథనం... ఈ కూరకు అమెరికా పిల్లలలో మంచి ఆదరణ తెచ్చింది. అది అతిశయోక్తి అయినా, పాలకూర శక్తిమంతమైనదనే నిజాన్ని చాటిచెప్పింది.

ఆధునిక వైద్య శాస్త్రం ఏమంటోంది?

పాలకూరలో ఉన్న ఆహార నైట్రేట్లు (డైటరీ నైట్రేట్స్‌) శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మారి, రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. పాలకూరను రక్తపోటు నియంత్రించడంలో సహాయపడే ఆహారద్రవ్యంగా... 2021లో ‘యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ’ పేర్కొంది. దీనిలో విటమిన్‌ బి9 (ఫోలేట్‌), మెగ్నీషియం, లూటీన్‌ లాంటి సూక్ష్మపోషకాలు మెదడు, కళ్ళ ఆరోగ్యాన్ని సమర్థంగా పెంపొందిస్తాయి. ఇది విద్యార్థులకు అవసరమైన మేధో వృద్ధి, ఙ్ఞాపకశక్తి మెరుగుదల కలిగించే ఆహారం. పాలకూరలో ఉండే ఎస్‌క్యూడీజీ అనే లిపిడ్లు వైరస్‌ పునరుత్పత్తి ప్రక్రియను నిరోధించగలవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అవి కేన్సర్‌ కణాల అభివృద్ధిని కూడా అడ్డుకోగలవని చెబుతున్నాయి.


జాగ్రత్తలు అవసరం

పేగుల ఆరోగ్యానికి, కాలేయ సంరక్షణకు పాలకూర బాగా పనిచేస్తుంది. పాలకూర ఆకుల్లోని పత్రహరితంలో ‘థైలాకోయిడ్‌’ అనే పొర ఉంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియను పెంపు చేస్తుంది. అలాగే ‘లిపేజి’ అనే జీర్ణ ఎంజైమ్‌ పనిని అడ్డగిస్తుంది. అందువల్ల పాలకూర తిన్నాక మళ్ళీ ఆకలి కలగటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే దీన్ని ’సంతర్పణ శక్తి కలిగిన శాకంగా ‘భోజనకుతూహలం’ అభివర్ణించింది. అయితే... పాలకూర వాతం, కఫం కొద్దిగా పెంచవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. దీన్ని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వాత, కఫ దోషాలున్నవారు మితంగా తీసుకోవాలి.

అపోహలూ, నిజాలూ

కొంతమంది ఆకుకూరలు నులిపురుగులకు కారణమని భావిస్తారు. కానీ పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు, డీటాక్సిఫైయింగ్‌ గుణాలు నులిపురుగుల పెరుగుదలను అడ్డుకుంటాయి. మద్యం సేవించడం వల్ల కాలేయం మీద కలిగే ఒత్తిడిని తగ్గించడంలో కూడా ఇది తోడ్పడుతుంది. ఉబ్బసం, జీర్ణ సంబంధ వ్యాధుల నివారణలో మంచి ప్రభావం చూపుతుంది.

భోజన కుతూహలం

పాలకూరలో పోషకాలు...

విటమిన్లు:

ఎ, బి6, బి9, బి12, సి, ఇ, కె

ఖనిజాలు: మెగ్నీషియం, మాంగనీస్‌, ఇనుము, కాల్షియం, పొటాషియం

యాంటీఆక్సిడెంట్లు: లూటీన్‌, బీటా-కెరోటిన్‌, ఫ్లావనాయిడ్స్‌

ఆహార పీచు (ఫైబర్‌): జీర్ణకోశానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

-గంగరాజు అరుణాదేవి


For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 12 , 2025 | 12:22 AM