Clothing Care: బట్టల మన్నిక కోసం...
ABN , Publish Date - May 21 , 2025 | 07:35 AM
బట్టలు ఎక్కువకాలం మన్నికగా ఉండాలంటే సరైన ఉతుకుదల, ఆరబెట్టే పద్ధతులు పాటించాలి. రంగు వెలవేలాడకుండా, బట్టలు చిరుగకుండా ఉండేందుకు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.
సాధారణంగా మనం వెతికి వెతికి మరీ నచ్చిన బట్టలు కొనుక్కుంటూ ఉంటాం. ఒక్కోసారి ఇవి త్వరగా రంగులు వెలిసి పోవడమో, చిరుగులు పట్టడమో జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా బట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.
బట్టలను ఎక్కువసార్లు ఉతకడం వల్ల వాటి నాణ్యత దెబ్బతింటుంది. కొద్దిసేపు ధరించినవాటిని వెంటనే ఉతకకుండా గాలి తగిలేలా హ్యాంగర్‌కు తగిలించాలి.
ముదురు రంగు బట్టలను మొదటిసారిగా ఉతికేటప్పుడు నీళ్లలో కొద్దిగా గళ్ల ఉప్పు కలిపితే అవి రంగు విడవకుండా ఉంటాయి.
రంగుల బట్టలను ఉతికిన తరవాత నేరుగా ఎండలో ఆరవేయకూడదు. ఎండ వల్ల రంగులు వెలిసిపోతాయి. కాబట్టి వాటిని నీడలో గాలి తగిలేలా ఆరవేయాలి.
బట్టలను ఉతికేటప్పుడు ఎక్కువ డిటర్జెంట్ ఉపయోగించకూడదు. సబ్బుతో అదేపనిగా రుద్దకూడదు. ఏవైనా మరకలు పడితే ఆ ప్రాంతం వరకు సబ్బు లేదా షాంపూతో రుద్దితే సరిపోతుంది.
తెల్లని బట్టలను ఉతికేముందు వాటిని కొద్దిసేపు సర్ఫ్ నీళ్లలో నానబెడితే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
కొత్త బట్టలను వాషింగ్ మెషిన్‌లో వేయకూడదు. ఒకవేళ ఇవి రంగులు విడుస్తున్నట్లయితే అవి మిగిలిన బట్టలకు అంటుకునే అవకాశం ఉంటుంది.
బాగా వేడెక్కిన ఇస్త్రీ పెట్టెతో బట్టలు ఇస్త్రీ చేయకూడదు. బట్టల మీద ముడుతలు పోయేలా ఇస్త్రీ పెట్టెను మధ్యస్థాయిలో వేడిచేస్తే సరిపోతుంది.
అనుకోకుండా బట్టల మీద చిరుగులు ఏర్పడితే వెంటనే వాటిని దర్జీ వద్దకు తీసుకువెళ్లి కుట్టించాలి. లేదంటే ఇంట్లో కుట్టుమిషన్ మీదనైనా సరిచేసుకోవచ్చు.
కాలానుగుణంగా ధరించే బట్టలను శుభ్రంగా ఉతికి సరైన విధానంలో మడతపెట్టి జాగ్రత్త చేసుకోవాలి.
బట్టలను భద్రపరచే చోట కలరావుండలు ఉంచితే పురుగులు చేరకుండా ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News