Skin Pigmentation Remedies: ఇలా చేస్తే పిగ్మెంటేషన్ మాయం
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:37 AM
ఎండలో ఎక్కువగా తిరగడం, వాతావరణ కాలుష్యం వల్ల చర్మం ఛాయ తగ్గి ముఖంపై పిగ్మెంటేషన్ ఏర్పడుతూ ఉంటుంది. చిన్న చిట్కాలతో దీన్ని పోగొట్టుకోవచ్చు....
ఎండలో ఎక్కువగా తిరగడం, వాతావరణ కాలుష్యం వల్ల చర్మం ఛాయ తగ్గి ముఖంపై పిగ్మెంటేషన్ ఏర్పడుతూ ఉంటుంది. చిన్న చిట్కాలతో దీన్ని పోగొట్టుకోవచ్చు. ఆ వివరాలు...
బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకుంటే పిగ్మెంటేషన్ సమస్య రాదు.
రాత్రి పడుకునేముందు ముఖానికి కలబంద గుజ్జు పట్టించి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే కలబందలోని అలోయిన్ పదార్థం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
రోజూ ఉదయాన్నే ఆలుగడ్డ రసం లేదా పెరుగును ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరవాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండురోజులకు ఒకసారి చేస్తూ ఉంటే ముఖం కళకళలాడుతుంది.
చిన్న గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, ఒక చెంచా పసుపు వేసి నాలుగు చెంచాల గులాబీ నీరు చిలకరించి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనివ్వాలి. తరువాత వేళ్లతో మెల్లగా రుద్దుతూ పిండిని తొలగించాలి. ఆపైన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసు కుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఒక గిన్నెలో రెండు చెంచాల నిమ్మరసం, ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాయాలి. పావు గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే సమస్య తీరుతుంది.
చిన్న గిన్నెలో రెండు చెంచాల బియ్యప్పిండి, ఒక చెంచా ముల్తాని మిట్టి, నాలుగు చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే ముఖంపై పిగ్మెంటేషన్ మచ్చలు తొలగిపోతాయి.
ఒక పళ్లెంలో బియ్యప్పిండి లేదా శనగపిండి తీసుకుని మధ్యకు కోసిన టమాటా ముక్కతో అద్దాలి. దీంతో ముఖాన్ని పది నిమిషాలు మెల్లగా రుద్దాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
ముఖానికి బాగా పండిన బొప్పాయిపండు గుజ్జు లేదా టమాటా రసం రాసినా నలుపుదనం తగ్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు
PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు