Lungs Clean and Healthy: ఇలా చేస్తే ఊపిరితిత్తులు శుభ్రం
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:02 AM
వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన పరిసరాలు, అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల ఊపిరితిత్తుల్లో రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటప్పుడు చిన్న.....
వాతావరణ కాలుష్యం, అపరిశుభ్రమైన పరిసరాలు, అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల ఊపిరితిత్తుల్లో రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో ఊపిరితిత్తులను శుభ్రంచేస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలు ఇవే...
వెల్లకిలా పడుకొని నడుము కింద దిండు పెట్టుకోవాలి. ముక్కుతో వేగంగా శ్వాస పీల్చుకుని నోటితో మెల్లగా వదలాలి. ఇలా పావుగంటసేపు చేస్తే ఊపిరితిత్తుల్లో పేరుకున్న శ్లేష్మం బయటికి వచ్చేస్తుంది. ఇదేవిధంగా ఓ పక్కకు తిరిగి పడుకుని చేసినా ఫలితం కనిపిస్తుంది.
వెడల్పాటి గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో కొద్దిగా జండు బామ్ లేదా యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. ఘాటైన ఆవిరిని పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ తొలగిపోయి శ్వాస బాగా ఆడుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లోని మలినాలు తొలగిపోతాయి.
రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్‌ను వాడడం మంచిది.
రోజూ ఉదయాన్నే భస్త్రికా ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా శుభ్రపడతాయి. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ చేసినా కూడా శ్వాస కోశ వ్యవస్థ బలోపేతమవుతుంది.
సాల్మోన్, మాకరెల్ లాంటి చేపలతోపాటు కోడిగుడ్లు, అవకాడో, కివీ, బాదం, గుమ్మడి గింజలు, చియా గింజలు, అల్లం, వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం లేదా అల్లం రసంతోపాటు కొద్దిగా తేనె కలుపుకుని తాగితే ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తవు.