Share News

Diabetes: ఈ లక్షణాలు కనబడితే... నిర్లక్ష్యం వద్దు...

ABN , Publish Date - May 29 , 2025 | 06:15 AM

మధుమేహం (సుగర్) ఆకస్మాత్తుగా రాదు — శరీరం ముందుగా కొన్ని సంకేతాల ద్వారా హెచ్చరిస్తుంది. తరచూ మూత్రవిసర్జన, అకారణ బరువు తగ్గడం, నీరసం, గాయాలు నెమ్మదిగా మానడం, కాళ్ల తిమ్మిర్లు, కంటి మసకబారటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మధుమేహ పరీక్ష చేయించుకోవాలి.

Diabetes: ఈ లక్షణాలు కనబడితే... నిర్లక్ష్యం వద్దు...

నాకు 42 ఏళ్లు. ఈ మధ్య నేను టెస్ట్‌లు చేయించుకుంటే సుగర్‌ ఉందని తేలింది. ఇప్పటి దాకా నాకు ఎలాంటి లక్షణాలు కనబడలేదు. ఎటువంటి లక్షణాలు కనబడకుండానే సుగర్‌ వచ్చేస్తుందా?

(హైదరాబాద్‌ నుంచి ఒక సోదరి)

మధుమేహం హఠాత్తుగా రాదు. వచ్చే ముందు అనేక లక్షణాలు కనబడతాయి. కానీ వాటిని చాలా మంది పట్టించుకోరు. ముఖ్యంగా మహిళలలో ఈ ధోరణి ఎక్కువగా కనబడుతుంది. అందువల్ల 40 ఏళ్లు దాటిన వారు- ప్రతి ఆరునెలలకు ఒక సారి అన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిది. దీని వల్ల మన శరీరంలో మనం గమనించని రుగ్మతలు ఏవైనా ఉంటే అవి బయటపడతాయి. ఇక మధుమేహం విషయానికి వస్తే- ఈ కింది లక్షణాలు మీకు కూడా తప్పనిసరిగా కనబడే ఉంటాయి. కానీ వాటిని మీరు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఉంటారు. పాఠకుల కోసం మధుమేహం వచ్చే ముందు మన శరీరం మనకు ఇచ్చే సంకేతాలు ఏమిటో తెలియజేస్తాను. ఈ లక్షణాలలో ఏ ఒక్కటి కనబడినా మధుమేహం ఉందా? లేదా అనే విషయం తెలుసుకొనేందుకు పరీక్ష చేయించుకుంటే మంచిది.

రాత్రిళ్లు ఎక్కువ సార్లు బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి రావటం. మన శరీరంలో బ్లడ్‌ షుగర్‌ ఎక్కువగా ఉన్నప్పుడు- మన కిడ్నీలు అదనపు సుగర్‌ను బయటకు పంపటానికి ప్రయత్నిస్తాయి. దీని వల్ల ఎక్కువ సార్లు బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. చాలా మంది మహిళలకు యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు కూడా ఎక్కువ సార్లు బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల ఈ రెండు లక్షణాలు ఒకటే అనుకొనే ప్రమాదముంది. కనీసం 15 రోజులు- క్రమం తప్పకుండా రాత్రిళ్లు బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వస్తోదంటే- అది మధుమేహ లక్షణమే అని కచ్చితంగా చెప్పవచ్చు.

చాలా సార్లు మధుమేహం వచ్చినవారు హఠాత్తుగా బరువు తగ్గిపోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది బరువు తగ్గటానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఏమి చేయకుండానే బరువు తగ్గుతుంటే అది మధుమేహ లక్షణమని కచ్చితంగా చెప్పవచ్చు. మధుమేహం ఉన్న వారి కణాలకు తగినంత చక్కెర లభించదు.. దీనితో అవి శరీరంలో ఉన్న కొవ్వును కరిగించటం మొదలుపెడతాయి. దీని వల్ల ఎటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గిపోతారు. బరువు తగ్గటంతో పాటుగా ఎప్పుడు నీరసంగానే ఉంటుంది. ఎన్ని జ్యూస్‌లు తాగినా.. ఎన్ని సార్లు తిన్నా ఫలితం ఉండదు.


వంటింట్లో వంట చేసేటప్పుడు చిన్న చిన్న గాయలు అవుతూ ఉంటాయి. ఈ గాయాలు వెంటనే తగ్గకపోతే మధుమేహం ఉన్నట్లు కచ్చితంగా చెప్పవచ్చు. ఇదే విధంగా చాలా సార్లు రాత్రిళ్లు పడుక్కొనే సమయంలో కాళ్లు తిమ్మిర్లెక్కుతాయి. చాలా మంది పొద్దున్న నుంచి నిలబడి ఉండటం వల్ల కాళ్ల నెప్పులతో పాటుగా తిమ్మిర్లు ఎక్కాయనుకుంటారు. కానీ వాస్తవానికి మధుమేహం ఉన్నవారికి ఈ తిమ్మిర్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రాత్రిళ్లు పడుక్కొనే సమయంలో తిమ్మిర్లు అనిపిస్తే మధుమేహం ఉందా? లేదా అనే పరీక్ష చేయించుకోవటం ఎంత్తైనా మంచిది.

మధుమేహం వస్తే కంటి సమస్యలు కూడా పెరుగుతాయి. కళ్లు మసకబారటం వంటి లక్షణాలు కనబడతాయి. చాలా సార్లు కంటి చూపు మందగించటం వల్ల ఈ సమస్యలు ఏర్పడతాయని భావించి కంటి డాక్టర్‌ దగ్గరకు వెళ్తారు. కానీ అంతకన్నా ముందు మధుమేహ పరీక్ష చేయించుకోవటం మంచిది.

- డాక్టర్‌ మనోహర్‌

డయాబెటాలజిస్ట్‌, హైదరాబాద్‌


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:55 PM