Actress Samantha wedding to filmmaker Raj Nidimoru: ఆ వేడుకలో ఆకర్షణలివే
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:12 AM
సినీ నటి సమంతకు పెళ్లయిపోయింది. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. పెళ్లిలో సమంత ఎర్రని చీర ధరించి బంగారు ఆభరణాలు పెట్టుకుని....
సినీ నటి సమంతకు పెళ్లయిపోయింది. ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. పెళ్లిలో సమంత ఎర్రని చీర ధరించి బంగారు ఆభరణాలు పెట్టుకుని, పూల కొప్పుతో అందంగా మెరిసిపోయారు. సింపుల్ మేకప్, చేతులకు ఎర్రగా పండిన గోరింటాకు ఆమె అందాన్ని మరింత పెంచాయి. ముఖ్యంగా ఆమె ఎడమచేతి వేలికి ఉన్న పెళ్లి ఉంగరం అందరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.
పెళ్లి ఉంగరం ప్రత్యేకమైనదే...
గత రెండు రోజులుగా సమంత పెళ్లి ఉంగరం ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఉంగరంలో ఉన్నది వజ్రమా? క్రిస్టలా? దాని ధర ఎంత? ఆ మోడల్ ప్రత్యేకత ఏంటీ? అంటూ నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు అమ్మాయిలు. సమంత పెళ్లి ఉంగరం.. పొడవాటి షడ్భుజి (హెక్సాగోనల్) ఆకృతిలో పారదర్శకంగా మెరుస్తూ కనిపించింది. దీనికి స్పష్టమైన కోణీయ ముఖాలు ఉన్నాయి. ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ అభిలాష భండారి చెప్పిన వివరాల ప్రకారం ఇది వజ్రపుటుంగరం. దీన్ని పోరె్ట్రయిట్ కట్‌తో ప్రత్యేకంగా రూపొందించారు. దీని ఉపరితలం పెద్దగా పలుచగా ఉంటుంది. చూడడానికి ఓ పెద్ద రాంబస్ మధ్యలో మరో చిన్న రాంబస్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఉంగరం మధ్యలో ఉన్న పోరె్ట్రయిట్ కట్ డైమండ్ దాదాపు రెండు క్యారెట్ల బరువుంటుంది. దీని చుట్టూ ఎనిమిది సన్నని పోరె్ట్రయిట్ కట్ వజ్రాల రేకులను పొందికగా కూర్చారు. ఈ ఉంగరం మీద కాంతి పడినప్పుడు తళతళ మెరుస్తూ తెల్లగా కాంతులీనుతుంది. విలక్షణమైన ఈ పోరె్ట్రయిట్ కట్‌కు చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మొఘలుల కాలంలో వజ్రాన్ని సన్నని పలకల మాదిరి కట్ చేసేవారు. అరుదైన పెయింటింగ్‌లు, రాజుల తైలవర్ణ చిత్రాలను భద్రపరచేందుకు వాటిమీద ఈ తరహా డైమండ్ కట్ ప్లేట్‌ను పెట్టి ఉంచేవారు. అద్దంలా మెరుస్తూ పారదర్శకంగా ఉండే ఈ ప్లేట్‌లో నుంచి పెయింటింగ్‌లు, చిత్రాలు స్పష్టంగా కనిపించేవి. ఈ డైమండ్ పలకలతో పలుచని ఉంగరాలను కూడా తయారుచేసేవారు. షాజహాన్ భార్య ముంతాజ్ ఇలాంటి ఉంగరాలను అమితంగా ఇష్టపడేవారు. ఈ టెక్నికల్ కట్ ఆధారంగానే సమంత పెళ్లి ఉంగరాన్ని థియోడోరోస్ జ్యువెలరీ బ్రాండ్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసింది. దీని ధర సుమారు 50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా! బలం, తేజస్సు, వ్యక్తిత్వం, స్పష్టత, నిబద్ధత, ప్రేమ, విశ్వాసం, నిజాయితీలకు ప్రతీకగా నిలుస్తుందీ ఉంగరం.
అలంకరణ
సమంత తన పొడవైన శిరోజాలను కొప్పులా చుట్టి దాని చుట్టూ మల్లెమాల పెట్టుకున్నారు. ముఖానికి సింపుల్ మేకప్ మాత్రమే వేసుకున్నారు. మెడలో గుండ్రని పెద్ద బంగారు చోకర్, చెవులకు జుంకాలు, బంగారు గాజులు, వేళ్లకు బంగారు ఉంగరాలు పెట్టుకుని చిరునవ్వుతో అహ్లాదంగా కనిపించారు సమంత. భూత శుద్ధి పద్ధతిలో వివాహం జరిగింది కాబట్టి ఆనవాయితీ ప్రకారం సమంత మెడలో నల్ల పూసల గొలుసుకు దేవీ మాత పెండెంట్ కనిపించింది.
బహుమతులు
వివాహానికి హాజరైన అతిథులకు అరుదైన బహుమతులను అందించారు. వీటిలో... సద్గురువు సందేశం, ఈషా పూలతో తయారుచేసిన అగరుబత్తులు, ఇండియాలో తయారైన చాక్లెట్ బార్లు, సమంతకు ఇష్టమైన సీక్రెట్ ఆల్కెమిస్ట్ బ్రాండ్ పెర్ఫ్యూమ్ తదితరాలు ఉన్నాయి.
అందమైన చీర
ఎర్రని బనారస్ పట్టుచీరను సంప్రదాయ పద్ధతిలో కట్టుకుని ఆకర్షణీయంగా కనిపించారు సమంత. చీర బార్డర్ మొత్తం గోల్డ్ జరీ వర్క్, సీక్విన్ వర్క్, జర్దోసి వర్క్‌లతో నిండి ఉంది. చీర అంతటా జరీ పూల మోటిఫ్‌లు ప్రత్యేకంగా కనిపించాయి. చీర కొంగు కూడా జరీ దారాల ఎంబ్రాయిడరీ వర్క్‌తో విభిన్నంగా టెంపుల్ డిజైన్‌ను తలపించేలా ఉంది. ఈ చీర మీద సమంత ధరించిన ఫుల్ స్లీవ్ రెడ్ కలర్ బ్లౌజ్ చక్కగా మ్యాచ్ అయ్యింది. నెక్ లైన్ మీద, చేతుల అంచులకు చేసిన జరీ ఎంబ్రాయిడరీ వర్క్, అద్దాల వర్క్‌లు కలిసి రిచ్‌లుక్ నిచ్చాయి. రాజ్ నిడిమోరు కూడా తెల్లని కుర్తా, పైజమా, గోధుమ రంగు నెహ్రూ జాకెట్‌తో హుందాగా కనిపించారు.