Share News

Rural Schoolgirls Win National Award: మట్టిలో మాణిక్యాలు

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:22 AM

ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే... పరిమితులు ఎన్ని ఉన్నా అద్భుతాలు చేయవచ్చని నిరూపించారు ఎం.యశస్విని, ఎస్‌.సింధు.చిత్తూరు జిల్లాకు చెందిన ఈ తొమ్మిదో తరగతి విద్యార్థినులు...

Rural Schoolgirls Win National Award: మట్టిలో మాణిక్యాలు

ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే... పరిమితులు ఎన్ని ఉన్నా అద్భుతాలు చేయవచ్చని నిరూపించారు ఎం.యశస్విని, ఎస్‌.సింధు.చిత్తూరు జిల్లాకు చెందిన ఈ తొమ్మిదో తరగతి విద్యార్థినులు... మహిళల భద్రత కోసం ఒక పరికరాన్ని రూపొందించారు.అదే ‘ఉమెన్స్‌ సేఫ్టీ డివైజ్‌ ఇన్‌ టూ వీలర్‌ బైక్స్‌’. వారి ఆవిష్కరణ ఇటీవల జాతీయ స్థాయిలో ప్రత్యేక బహుమతి గెలుచుకోవడంతోపాటు సర్వత్రా అభినందనలు అందుకుంటోంది.

ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ, చున్నీలు, చీరలు వెనుక చక్రంలో చుట్టుకుపోవడం వల్ల మహిళలు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనల గురించి వింటూనే ఉంటాం. ఈ ప్రమాదాలు త్రీవంగా గాయపడడానికి, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడానికి దారి తీస్తాయి. ఇలాంటి సంఘటనల నుంచి మహిళలకు భద్రత కల్పించే పరికరం.. ఉమెన్స్‌ సేఫ్టీ డివైజ్‌ ఇన్‌ టూ వీలర్‌ బైక్స్‌. దీన్ని తయారు చేసింది నిష్ణాతులైన ఆవిష్కర్తలు కాదు. ఒక సాధారణమైన పల్లెటూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినులు ఎం.యశస్విని, ఎస్‌.సింధు. మట్టిలో మాణిక్యాల్లాంటి వీరిద్దరూ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రెడ్లపల్లె గ్రామానికి చెందినవారు. ఆ గ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువుతున్న ఈ బాలికలవి వ్యవసాయం జీవనాధారమైన కుటుంబాలు. మొన్నటివరకూ సాధారణమైన విద్యార్థినులైన యశస్విని, సింధుల ఆవిష్కరణ ఇప్పుడు ప్రశంసలు అందుకోవడంతోపాటు ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.


వెయ్యికి పైగా ఆవిష్కరణలతో పోటీపడి...

ఈ ఏడాది జూన్‌ నెలలో రెడ్లపల్లె జెడ్‌పి హైస్కూల్‌కు ఎం.జి.శ్రీనివాస్‌ ప్రధానోపాధ్యాయుడిగా వచ్చారు. గతంలో పనిచేసిన పాఠశాలల్లో... విద్యార్థులతో సైన్స్‌ ప్రాజెక్ట్‌లు తయారు చేయించి, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో విజయాలు సాధించడానికి దోహదపడిన అనుభవం ఆయనకు ఉంది. యశస్విని, సింధులలో నిగూఢంగా దాగిఉన్న ప్రతిభను ఆయన గుర్తించారు. అదే సమయంలో... అన్ని రాష్ట్రాల నుంచి సైన్స్‌ ప్రాజెక్ట్‌లను ఆహ్వానిస్తూ... జాతీయస్థాయి ‘గీతా యంగ్‌ సైంటిస్ట్‌ ఆవిష్కార్‌ అవార్డ్స్‌’ (జివైఎస్‌ ఆవిష్కార్‌) ప్రకటన వెలువడింది. ఆ అవార్డుల గురించి యశస్వినికి, సింధుకు శ్రీనివాస్‌ వివరించి, వారిని ప్రోత్సహించారు. ఆ బాలికలు కూడా ఉత్సాహంగా ముందుకువచ్చారు. దాని ఫలితమే... ‘ఉమెన్స్‌ సేఫ్టీ డివైజ్‌ ఇన్‌ టూ వీలర్‌ బైక్స్‌’. హెచ్‌ఎం శ్రీనివాస్‌ పర్యవేక్షణలో వారు తయారు చేసిన ఆ పరికరం... చిత్తూరు జిల్లా స్థాయి పోటీ నుంచి... జివైఎస్‌ ఆవిష్కార్‌ అవార్డుల కోసం జాతీయ స్థాయికి ఎంపికయింది. ఈ ఏడాది అక్టోబర్‌ 29న ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పోటీలకు ఆ బాలికలకు ఆహ్వానం అందింది. దానిలో 26 రాష్టాలకు చెందిన 1,000కి పైగా ఆవిష్కరణలను ప్రదర్శించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలతోపాటు... 25 మంది ఆవిష్కరణలను ప్రత్యేకంగా ఎంపిక చేసి, మెరిట్‌ సర్టిఫికెట్లను, ట్రోఫీలను, రూ.1.30 లక్షల నగదు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. యశస్విని, సింధుల ఆవిష్కరణకు ప్రత్యేక బహుమతి లభించింది. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందిస్తున్నారు. పల్లె ప్రాంతాలకు చెందిన విద్యార్థుల్లో సృజనాత్మకను ప్రోత్సహిస్తే... తోటి విద్యార్థుల్లో, ప్రధానంగా బాలికలలో ప్రేరణకు, చైతన్యానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

2.jpg

ఎలా పని చేస్తుందంటే...

‘ఉమెన్స్‌ సేఫ్టీ డివైజ్‌ ఇన్‌ టూ వీలర్‌’ సెన్సర్‌ ఆధారంగా పని చేస్తుంది. ఈ పరికరాన్ని ద్విచక్ర వాహనం సీటుకింద... ఎడమ భాగంలో అమర్చుకోవాలి. అది వాహనం హ్యాండిల్‌కు ఏర్పాటు చేసిన బల్బుకు అనుసంధానమై ఉంటుంది. చున్నీ లేదా చీరకొంగు వాహనం చక్రంలో ఇరుక్కోగానే... ఆ పరికరం నుంచి సైరన్‌ మోత వినిపిస్తుంది. అలాగే హ్యాండిల్‌కు అమర్చిన బల్బు వెలుగుతుంది. ఆ సంకేతాలను గమనించగానే... వాహనాన్ని నడుపుతున్న, దానిపై ప్రయాణిస్తున్న మహిళలు అప్రమత్తమై, వాహనాన్ని ఆపి, ప్రమాదం నుంచి బయట పడవచ్చు.

Updated Date - Dec 22 , 2025 | 04:22 AM