Rukmini Vasanth: భళా...కాంతారా కాంత
ABN , Publish Date - Oct 09 , 2025 | 03:26 AM
పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకున్నంత మాత్రాన ఆ పాత్రకు నూరు శాతం న్యాయం చేకూర్చడం సాధ్యపడదు. మరీ ముఖ్యంగా ఒక చారిత్రక పాత్రను పోషించే సందర్భంలో...
పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకున్నంత మాత్రాన ఆ పాత్రకు నూరు శాతం న్యాయం చేకూర్చడం సాధ్యపడదు. మరీ ముఖ్యంగా ఒక చారిత్రక పాత్రను పోషించే సందర్భంలో కాలమాన పరిస్థితులు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, ఆహార్యాలు, ప్రవర్తనలు లాంటి ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయంలో ‘కాంతారా’ కాంత రుక్మిణి ఎంతో జాగ్రత్తగా నడుచుకుంది.
బాడీ లాంగ్వేజ్ కీలకం
‘కాంతారా ఛాప్టర్1’ కథానాయకురాలైన రుక్మిణి వసంత్ తాను పోషించిన యోధురాలు కనకవతి పాత్ర గురించి వివరిస్తూ, ‘‘ఆ పాత్రలో ఒదిగిపోవడం కోసం అర్థం చేసుకోవలసిన సాంస్కృతిక అంశాలెన్నో ఉన్నాయనే విషయాన్ని నేను గ్రహించాను. ఆ ప్రాంతాన్ని అధ్యయనం చేయడం ద్వారా సాంస్కృతిక అవగాహన సాధ్యపడింది. అలాగే కత్తి యుద్ధం, గుర్రపు స్వారీలో కూడా శిక్షణ తీసుకున్నాను. ఏ పాత్రకైనా బాడీ లాంగ్వేజ్ ఎంతో కీలకం. రాకుమారి పాత్ర పోషించినా, కాలేజీ విద్యార్థి పాత్ర పోషించినా నాల్గవ శతాబ్దపు రాకుమారి పాత్ర పోషించినా, మనల్ని మనం తెర మీద ప్రదర్శించుకునే సందర్భంలో బాడీ లాంగ్వేజ్ ఒక కీలకమైన అంతర్గత భాగమవుతుంది. కాబట్టి ఈ పాత్ర కోసం షూటింగ్‌కు నాలుగు రోజుల ముందే రచయితలతో చర్చించి, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో తెలుసుకుని తెర మీద కనబరచవలసిన బాడీ లాంగ్వేజ్ గురించి అవగాహన ఏర్పరుచుకున్నాను’ అంటూ పాత్ర ప్రాధాన్యం గురించి వివరించింది రుక్మిణి.
కత్తి యుద్ధం, గుర్రపు స్వారీల కోసం...
రాకుమారి కేవలం రాజమందిరానికే పరిమితం కాదు. అవసరమైతే కరవాలం చేతపట్టి, కదనరంగంలో ధైర్యసాహసాలను ప్రదర్శించాలి. అందుకోసం కరవాలాన్ని ఉపయోగించడంలో కూడా శిక్షణ తీసుకుందామె. ఈ అనుభవం గురించి వివరిస్తూ...‘ ‘ఒక చోట నిలబడడం, నడవడం సులభమే! కానీ కత్తియుద్ధం చేసేటప్పుడు మన శరీరం భిన్నంగా కదులుతుంది. ఆ సమయంలో శరీరం కదలికల మీద పట్టు పెంచుకోవడం కోసం ఆ పోరాటంలో పాఠాలు కూడా నేర్చుకున్నాను. అలాగే డైలాగులు చెప్పేటప్పుడు భావోద్వేగాలను ఒలికించడంలో మెలకువలు కూడా పెంపొందించుకున్నాను’ అంటోంది రుక్మిణి. నిజానికి ‘కాంతారా ఛాప్టర్1’లో రాకుమారి పాత్రకు సిద్ధపడే క్రమంలో... గుర్రపు స్వారీ మొదలు, కత్తి యుద్ధం, బాడీ లాంగ్వేజ్, సంప్రదాయ ఆధారిత డాన్స్ వరకూ తానెన్నో అంశాల మీద పట్టు పెంచుకున్నట్టు రుక్మిణి చెప్తోంది. ఈ సినిమాలో నటించడం తన కల అనీ, ఇలాంటి భిన్నమైన అంశాలను అన్వేషించే అవకాశం దొరకడం తన అదృష్టమని కూడా అంటోంది.
రుక్మిణి ప్రస్థానమిది
నటి రుక్మిణి తండ్రి, కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారత సైన్యంలో ఉన్నతాధికారి. దేశానికి అందించిన సేవలకుగాను అతను అశోక చక్ర అవార్డును పొందడం విశేషం. రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ భరతనాట్య కళాకారిణి. ధైర్యసాహసాలు, కళల సమ్మిళిత కుటుంబానికి చెందిన రుక్మిణి కూడా ఆ అద్భుతమైన లక్షణాలను పుణికిపుచ్చుకుంది. కాబట్టే తన తల్లి అడుగుజాడల్లో నడుస్తూ భరతనాట్యం నేర్చుకుని తన తల్లి డాన్స్ ట్రూప్‌తో కలిసి ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. లయ, భావ ప్రదర్శన, డాన్స్‌లో పొందిన శిక్షణలు ఆమెలోని కళాత్మకతను సుసంపన్నం చేయడమే కాకుండా, నటనలో కూడా ఆమెకెంతో తోడ్పడ్డాయి. రుక్మిణి ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక డ్రామా స్కూల్స్‌లో ఒకటైన లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్‌లో నటనలో శిక్షణ పొందింది. రుక్మిణికి పుస్తకాలంటే ఆపేక్ష ఎక్కువ. సాహిత్యం, కవిత్వాల పట్ల తనకున్న మక్కువను తరచూ ఇన్‌స్టా పోస్టుల్లో ప్రదర్శిస్తూ ఉంటుంది. నటిగా ఎదగడానికి తోడ్పడిన అంశాల్లో పుస్తకపఠనం ఒకటని రుక్మిణి చెబుతూ ఉంటుంది. కథల్లో లీనమైపోవడం ద్వారా భిన్నమైన భావోద్వేగాలు, ధృక్కోణాలను అన్వేషించడం నేర్చుకున్నట్టు కూడా చెబుతుంది. విభిన్న భాషల్లో కూడా ఆమెకు ప్రావీణ్యం ఉంది. మాతృభాష కన్నడతో పాటు, ఇంగ్లీషు, హింది, తమిళం భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. ‘కాంతారా ఛాప్టర్1’కు ముందు ‘సప్తసాగరదాచె ఎల్లో’ అనే సినిమాలో మర్చిపోలేని నటనను ప్రదర్శించి అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ‘కాంతారా ఛాప్టర్1’ సినిమా విజయంతో రుక్మిణి తిరుగులేని నటిగా గుర్తింపు పొందు తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
