Remona Sets World Record: నాట్యం...పరవశం
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:20 AM
మాటల్లో చెప్పలేని భావాలను నాట్యంతో వ్యక్తీకరించవచ్చు. సంప్రదాయ నృత్యంలోని గొప్పదనం అదే. కాళ్లకు గజ్జె కట్టి, శరీరం లయబద్దంగా కదులుతున్నప్పుడు నన్ను నేను మరిచిపోతాను. ...
మూడు గంటలు భరతనాట్యం... మధ్యలో పావుగంట విరామం... అలా ఏకధాటిగా 170 గంటల ప్రదర్శన..! సాధ్యమేనా..? అందరిదీ ఇదే సందేహం. కానీ... అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించింది ఇరవయ్యేళ్ల రెమోనా ఎవెట్టే పెరీరా. అమ్మ అండతో... స్నేహితులు, సన్నిహితుల ప్రోత్సాహంతో... ఈ మెగా ఫీట్‌ను దిగ్విజయంగా ముగించి... ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించిన రెమోనా కథ ఇది.
‘‘మాటల్లో చెప్పలేని భావాలను నాట్యంతో వ్యక్తీకరించవచ్చు. సంప్రదాయ నృత్యంలోని గొప్పదనం అదే. కాళ్లకు గజ్జె కట్టి, శరీరం లయబద్దంగా కదులుతున్నప్పుడు నన్ను నేను మరిచిపోతాను. నర్తిస్తున్నంతసేపూ ఏదో తెలియని పరవశానికి లోనవుతాను. నేను అమితంగా ఇష్టపడింది, తొలిసారి ప్రేమలో పడింది భరతనాట్యంతోనే. కర్ణాటక రాష్ట్రం మంగళూరు నగరం మాది. ఊహ తెలియనప్పుడే మా అమ్మ నన్ను తీసుకువెళ్లి భరతనాట్యం గురువుకు అప్పగించింది. ఇక అప్పటి నుంచీ నాకు అదే లోకం అయిపోయింది. దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. సంప్రదాయ నృత్యం అభ్యసించాలని మా అమ్మ ఎన్నో కలలు కన్నది. కానీ సామాజిక కట్టుబాట్ల పేరుతో ఇంట్లోవాళ్లు అనుమతించలేదుట. అందుకే నాకు కళలు నేర్పించాలని నిర్ణయించుకుంది. కానీ భరతనాట్యం వైపు వెళ్లమని తను నన్ను బలవంతం పెట్టలేదు. దీంతోపాటు పెయింటింగ్, ఇతర నాట్య రీతులు కూడా ఆరంభంలో సాధన చేశాను. అయితే ఎందుకో తెలియదు... అన్నిటికంటే నన్ను భరతనాట్యమే అమితంగా ఆకర్షించింది.
ఆలోచన అలా వచ్చింది...
ఆరంభం నుంచీ మా గురువు శ్రీవిద్య మురళీధర్ గారి దగ్గరే నాట్యం అభ్యసిస్తున్నాను. భరతనాట్యం నాకు ఒక సంప్రదాయ నృత్య సాధన మాత్రమే కాదు... భావోద్వేగాల బంధం. ఆధ్యాత్మిక అనుబంధం. నేను వేరు, నాట్యం వేరు కాదు. ప్రస్తుతం నేను బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. విద్య ఎంత ముఖ్యమో కళ కూడా అంతే ముఖ్యం. అందులో ఎప్పుడూ ఏదో కొత్తగా చేయాలని తపిస్తుంటాను. అలా ఒక రోజు ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే... ‘డ్యాన్స్ మారథాన్’ అని కనిపించింది. అలాంటిది ఒకటి ఉంటుందని కూడా అప్పటివరకు నాకు తెలియదు. ఆశ్చర్యం కలిగింది. నన్ను బాగా ఆకర్షించింది. ‘నేను ఎందుకు ప్రయత్నించకూడదు’ అనిపించింది.

అనుకున్నది 24 గంటలే... కానీ...
ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే కార్యరంగంలోకి దిగాను. డ్యాన్స్ మారథాన్‌కు సంబంధించిన అప్లికేషన్ మా కాలేజీవాళ్లు తెప్పించారు. ముందుగా అనుకున్నది 24 గంటల మారథాన్. కానీ అప్లికేషన్ నింపుతుంటే... 170 గంటలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ సంఖ్య నా మదికి ఎలా తట్టిందో తెలియదు. దరఖాస్తులో రాసే ముందు అమ్మకు చెప్పాను. తను అవాక్కయింది. కాసేపటికి తేరుకొని... ‘అంటే ఎన్ని రోజులు’ అని అడిగింది. ‘సుమారుగా ఏడు రోజుల రెండు గంటలు’ అన్నాను. ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ... ‘నిజంగానే చేద్దామనుకొంటున్నావా’ అంటే... ‘అవును’ అని బదులిచ్చాను. మరో ఆలోచన లేకుండా... ‘అయితే నా మద్దతు నీకు ఉంటుంది’ అంది అమ్మ.
ప్రత్యేక సన్నాహకాలు లేకుండానే...
ఈవెంట్‌కు కొన్ని వారాల ముందే 170 గంటలు నాన్‌స్టా్‌పగా భరతనాట్య ప్రదర్శన ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దాంతో సన్నాహకాలకు ఎక్కువ సమయం లేకుండా పోయింది. అయితే నా మనసులో ఒకటే అనుకున్నా... ‘వారం రోజుల పాటు నిద్ర ఉండదు. కనుక దానికి ముందు బాగా నిద్ర పోవాలి’ అని. ఈ మారథాన్ కోసం నేను సన్నద్ధమైంది ఏదైనా ఉందంటే... అది కంటి నిండా కునుకు తీయడమే. చివరకు ఈవెంట్ రోజు, అంటే జూలై 21 వచ్చేసింది. ప్రదర్శన మొదలుపెట్టాను. మా కాలేజీ ఆడిటోరియంలోనే. నాకు తెలుసు... మొదటిరోజు హాయిగానే సాగిపోతుందని. మూడో రోజు నుంచి కష్టపడాల్సి వస్తుందని అనుకున్నా. కానీ నా అంచనాలు తలకిందులు అయ్యాయి. తొలి రోజే ఆపేద్దామనుకున్నా. అమ్మ ‘నువ్వు చేయగలవు’ అని ఆత్మవిశ్వాసం నింపింది. ఆడిటోరియంలో నా స్నేహితులు, స్థానికులు, అధ్యాపకులు... అందరూ నాకు అండగా నిలిచారు. నాకు నిద్ర వచ్చినప్పుడల్లా... చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ ఉత్సాహపరిచారు. మూడు గంటల నాట్యం... మధ్యలో పావుగంట విరామం. ఎక్కువగా అరటి, ఆపిల్, జామపండ్లు, కొబ్బరి నీళ్లతోనే సరిపెట్టుకున్నా. నిద్ర మరీ ముంచుకొస్తే ఒకటి రెండు సిప్‌లు కాఫీ. రాత్రి అయ్యేసరికి విపరీతమైన వెన్ను, కాళ్ల నొప్పులు. తట్టుకోలేక కళ్లల్లో నీళ్లు తిరిగేవి. అన్నిటికంటే పెద్ద సవాలు... నిద్ర ఆపుకోవడం. అన్నిటినీ భరించాను. అందరి సహకారంతో జూలై 28న విజయవంతంగా మారథాన్ ముగించాను.
సరికొత్త రికార్డు...
నా ప్రదర్శన ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో నమోదైంది. ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రికార్డు నెలకొల్పాననే ఆనందం కన్నా... అంత పెద్ద లక్ష్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాననేదే నాకు ఎక్కువ సంతృప్తిని ఇస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఇదే మొదటిసారి కాదు. గతంలో పిల్లలకు ఇచ్చే అత్యున్నత అవార్డు... ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ను నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్నాను. నేను ఎక్కడ ఉంటే అక్కడ భరతనాట్యం ఉండేలా కృషి చేస్తాను. ప్రస్తుతం ట్రాన్స్‌జెండర్స్, పిల్లలకు నృత్యం నేర్పిస్తున్నాను. భరతనాట్యంలో పీహెచ్‌డీ చేయాలనేది నా కల. తద్వారా ఈ కళారూపాన్ని మరింత లోతుగా అర్థంచేసుకొనే అకాశం లభిస్తుంది కదా.’’
అమ్మ లేకపోతే నేను లేను...
నా జీవితంలోనే కాదు... నా ఈ నాట్య ప్రయాణంలోనూ మా అమ్మ పాత్ర ప్రముఖమైనది. వెల కట్టలేనిది. నా ప్రతి దశలో తోడై, అడుగడుగునా ప్రోత్సహిస్తూ వస్తోంది. అంతేకాదు... నాట్య ప్రదర్శనకు అవసరమైన దుస్తులు తనే డిజైన్ చేసి, కుడుతుంది. అమ్మ నా నిశ్శబ్ద భాగస్వామి. నన్ను నలుగురిలో గొప్పగా నిలబెట్టడానికి అహర్నిశలూ కష్టపడుతుంది. తను లేకపోతే నేను లేను. నా మారథాన్ సమయంలో అమ్మ కూడా నిద్ర పోలేదు. సరిగ్గా తినలేదు. నిరంతరం నన్ను అంటిపెట్టుకొనే ఉంది.