ష్రగ్స్‌తో కొత్త లుక్
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:33 AM
‘ఎప్పుడూ అవే కుర్తీలు, అవే లెహంగాలు, అవే చీరలు. కొత్తదనమే లేదా?’ అని కంగారు పడిపోవలసిన అవసరం లేదు. ఎలాంటి దుస్తులు ధరించినా, వాటికి కొత్త ఆకర్షణ చేకూరాలంటే, అదనంగా ‘ష్రగ్స్’ ఎంచుకోవాలి. వాటినెలా ధరించాలో, ఎలా మ్యాచ్ చేయాలో తెలుసుకుందాం!

రోజు వేసుకునే దుస్తులైనా, వేడుకల కోసం ధరించే దుస్తులైనా అదనపు హంగులు జోడించడం కోసం ష్రగ్స్‌ను ఎంచుకోవచ్చు. ఎలాంటి దుస్తులకైనా ఆధునిక సొబగును అద్దే ఒకప్పటి ష్రగ్స్ ఫ్యాషన్ మళ్లీ ఊపందుకుంది. వైవిద్యభరితంగా కనిపించడంతో పాటు అన్ని వయసులవారికీ, అన్ని రకాల దుస్తులకు నప్పడం ష్రగ్స్ ప్రత్యేకత. కాబట్టే వీటి పట్ల సర్వత్రా ఆదరణ పెరుగుతోంది.
మ్యాచింగ్ ఇలా...
పొడవాటి ష్రగ్స్‌ను జీన్స్, టీషర్ట్‌కు జతగా ధరించవచ్చు. లాంగ్‌ఫ్రాక్‌తో మ్యాచ్ చేయవచ్చు. గౌన్స్, ఫ్రాక్స్‌తో కలిపి కూడా వేసుకోవచ్చు. అయితే ఆ రెండు రకాల దుస్తుల రంగులూ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. పూర్తి భిన్నమైన రంగుల్లో ఉండకుండా, రంగు, డిజైన్ల పరంగా, రెండూ దగ్గరి పోలికలు కలిగి ఉండేలా చూసుకోవాలి. హైహీల్స్, స్లింగ్ బ్యాగ్ లాంటి అదనపు హంగులు కూడా జోడిస్తే ష్రగ్స్‌లో, రెట్టింపు స్టైల్‌తో అదరగొట్టేయవచ్చు.
ఇలా ఎంచుకోవాలి
ష్రగ్‌ను ఎంచుకునేటప్పుడు సమయం, సందర్భం దృష్టిలో పెట్టుకోవాలి. సరదాగా షికారుకెళ్లేటప్పుడు వేసుకునే ష్రగ్స్‌కూ, సాయంకాలను వేడుకల్లో ధరించే ష్రగ్స్‌కూ వైవిద్యం ఉండేలా చూసుకోవాలి. అందుకోసం సాదాసీదా కాటన్ ష్రగ్స్ మొదలు సెక్విన్స్‌తో మెరుపులు చిందించే భారీ ష్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో నప్పే ష్రగ్ ఎంచుకోవాలి. అలాగే శాటిన్, స్పన్‌తో తయారయ్యే ష్రగ్స్ పార్టీలకూ, కాటన్, రెయాన్‌లతో తయారయ్యే ష్రగ్స్ డైలీ వేర్‌కూ బాగుంటాయి.