నూనె వాడకం తగ్గించాలంటే..!
ABN , Publish Date - Feb 11 , 2025 | 10:50 PM
వంటకాల్లో అధికంగా నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నూనె వాడకాన్ని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం!
వంటకాల్లో అధికంగా నూనెను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. నూనె వాడకాన్ని ఎలా తగ్గించాలో తెలుసుకుందాం!
వంట చేసేటప్పుడు నూనెను నేరుగా బాటిల్‌తో కాకుండా చెంచాతో కొలిచి వేయడం అలవాటు చేసుకోవాలి. కూరలు చేసేటప్పుడు, పచ్చళ్ల తాలింపులో ఎక్కువ నూనెని ఉపయోగించవద్దు.
మూకుడు నిండుగా నూనె పోసి చేసే వంటకాలకు బదులు ఆవిరి మీద ఉడికించి చేసే అల్పాహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేపుళ్లు తగ్గించాలి. తాలింపు కూరలు చేసుకుంటే శరీరానికి ఎ, డి, కె విటమిన్లు బాగా అందుతాయి.
అప్పడాలను నూనెలో వేయించకుండా సన్నని మంట మీద కాల్చుకుని తినవచ్చు.
డీప్ ఫ్రైకి బదులు షాలో ఫ్రై, రోస్ట్, బేకింగ్, గ్రిల్లింగ్, స్టీమింగ్ పద్ధతులను అనుసరించాలి.
గ్రేవీ ఆధారిత కూరలు, తొందరగా మగ్గే కూరలను తక్కువ నూనెతో చేసుకోవచ్చు. మాంసాహార కూరలు చేసేటప్పుడు అవసరమైనంతే నూనె వాడాలి.
దోశలు చేసేటప్పుడు పెనం మీద చెంచాతో నూనె రాయడానికి బదులు ఒక పెద్ద ఉల్లిపాయను మధ్యకు కోసి దానితో రుద్దితే చాలు. కావాలనుకుంటే దోశమీద బ్రష్‌తో కొద్దిగా నూనె రాసుకోవచ్చు. చపాతీలు కాల్చేటప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలి.
కూరగాయల ముక్కలను ముందుగానే ప్రెజర్ కుక్కర్ లేదా ఓవెన్‌లో ఉడికించి తరవాత తేలికపాటి తాలింపుతో కూరలు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
నెలకి ఎంత నూనె వాడుతున్నామో ఒక పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. దీనివల్ల నూనె వాడకంపై ఒక అవగాహన వస్తుంది.