Share News

Jesus Stand Against Injustice: అక్రమాలపై తిరుగుబాటు

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:29 AM

ఏసు క్రీస్తులో స్పష్టంగా కనిపించే రెండు కోణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి... ఆయనలో ఉన్న దైవికమైన స్వభావం. రెండోది... స్వచ్ఛమైన మానవ స్వభావం....

Jesus Stand Against Injustice: అక్రమాలపై తిరుగుబాటు

ఏసు క్రీస్తులో స్పష్టంగా కనిపించే రెండు కోణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి... ఆయనలో ఉన్న దైవికమైన స్వభావం. రెండోది... స్వచ్ఛమైన మానవ స్వభావం. సముద్రం అలజడిని, కల్లోలాలను ఆపినప్పుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు మొదటి స్వభావం కనిపిస్తుంది. ఆయన పడిన బాధల్లో, మరణ యాతనలో మానవ స్వభావం దర్శనమిస్తుంది. ఆయన బోధలు కూడా మానవ స్వభావానికి అనుగుణంగా సాగాయి. మనిషి పరిపూర్ణంగా ఎలా జీవించాలో ఆయన నేర్పాడు. మామూలు మనిషిని మహోన్నత స్థాయికి తీసుకుపోవడం కోసం బోధలు చేశాడు. వాటిని స్వయంగా ఆచరించాడు. ఏసు క్రీస్తు మీద ఆ రోజుల్లో ‘తిరుగుబాటుదారు’ అనే ముద్ర ఉంది. దీనికి కారణం ఏమిటంటే... నాటి రాచరిక వ్యవస్థ సామాన్య ప్రజల అజ్ఞానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని పాలన సాగించేది. ఏసు ఉంటే తాము బోధించే మూఢాచారాలకు భంగం వాటిల్లుతుందని, తమ భావాలు చెల్లవనీ భయపడేది యూదా మత వ్యవస్థ భావించింది. ఈ రెండు వ్యవస్థలూ కలిసి ఆయనను ఒక ద్రోహిగా చిత్రీకరించాయి. దానికితోడు ‘‘నేను ఈ లోకంతో సమాధానపడి రాజీ కుదుర్చుకోవడానికి రాలేదు, నిప్పు రగిలించడానికి వచ్చాను’’ అని ఏసు చేసిన ప్రకటనతో ఈ వ్యతిరేకత మరింత బలపడింది. కానీ స్వార్థపరులైన, సంకుచిత మనస్తత్వం కలిగిన ప్రత్యర్థులతో తాను రాజీ పడేది లేదని, ప్రజల్లో చైతన్యాన్ని రగిలించడానికి వచ్చాననీ ఆయన భావం. అన్యాయాన్ని చూస్తూ ప్రశాంతంగా ఉండడం కాదనీ, దాన్ని ఖండించాలని, శాశ్వత నిద్రలోకి జారుకున్న సమాధుల్లా ఉండవద్దని ఉద్బోధించాడు. లోకం తీరు తెలిసినవాడు కనుకనే... సత్యాన్ని బోధించడం కోసం తన శిష్యులను సంఘంలోకి పంపినప్పుడు ‘‘జాగ్రత్త! తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను’’ అని చెప్పాడు. ఆయన మొదటిసారిగా ఒక ప్రార్థనా మందిరంలోకి అడుగు పెట్టినప్పుడు... అక్కడ అక్రమాలు సాగిస్తున్న వ్యాపారులను తరిమి కొట్టి, తన తిరుగుబాటును ప్రకటించాడు. అప్పటి నుంచి మూఢనమ్మకాలను, స్వార్థ శక్తులను ఎదిరించడమే ధ్యేయంగా ఆయన ప్రయాణం కొనసాగింది.

Updated Date - Nov 07 , 2025 | 12:29 AM