Share News

Tasty Snacks for New Year Celebrations: న్యూ ఇయర్‌ వేళ... సరికొత్త స్నాక్స్‌

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:30 AM

నూతన సంవత్సరం మొదటి రోజున కొత్తగా ఏదైనా చేయాలని పిల్లలు, కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు తక్కువ సమయంలో సులువుగా తయారుచేసేవాటిని ప్రయత్నిస్తే బాగుంటుంది. అలా అందరికీ నచ్చేలా హెల్దీగా కమ్మగా ఉండే సరికొత్త రుచులు మీకోసం...

Tasty Snacks for New Year Celebrations: న్యూ ఇయర్‌ వేళ...  సరికొత్త స్నాక్స్‌

నూతన సంవత్సరం మొదటి రోజున కొత్తగా ఏదైనా చేయాలని పిల్లలు, కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు తక్కువ సమయంలో సులువుగా తయారుచేసేవాటిని ప్రయత్నిస్తే బాగుంటుంది. అలా అందరికీ నచ్చేలా హెల్దీగా కమ్మగా ఉండే సరికొత్త రుచులు మీకోసం...

కార్న్‌ ఫ్రిట్టర్స్‌

కావాల్సిన పదార్థాలు

మొక్కజొన్న కంకులు- రెండు, చిలగడ దుంపలు- రెండు, ఉల్లికాడల తరుగు- అర కప్పు, కొత్తిమీర తరుగు- పావు కప్పు, పచ్చిమిర్చి- రెండు, అవిశె గింజల పొడి- ఒకటిన్నర చెంచాలు, బ్రెడ్‌ పౌడర్‌- అర కప్పు, ఛీజ్‌ తురుం- ఒక కప్పు, ఉప్పు- తగినంత, నూనె- నాలుగు చెంచాలు

తయారీ విధానం

  • మొక్కజొన్న కంకుల నుంచి గింజలు తీసి గిన్నెలో వేసి ఉడికించాలి. ఆపైన మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. చిలగడ దుంపలను కూడా ఉడికించి తొక్క తీసి తురిమి పెట్టుకోవాలి.

  • వెడల్పాటి గిన్నెలో కార్న్‌ పేస్టు, చిలగడ దుంపల తురుం, ఉల్లికాడల తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, అవిశె గింజల పొడి, బ్రెడ్‌ పౌడర్‌, ఛీజ్‌ తురుం, ఉప్పు వేసి బాగా కలపాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని కార్న్‌ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ అరచేతిలో గుండ్రని బిళ్లల్లా చేయాలి.

  • స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నూనె వేసి వేడిచేయాలి. ఆపైన కార్న్‌ బిళ్లలు పరిచి రెండు వైపులా దోరగా వేయించాలి. తరువాత వీటిని పళ్లెంలోకి తీయాలి. ఈ కార్న్‌ ఫ్రిట్టర్స్‌ని గ్రీక్‌ యోగర్ట్‌ లేదా గ్రీన్‌ చట్నీతో సర్వ్‌ చేసుకోవచ్చు.


చికెన్‌ 555

కావాల్సిన పదార్థాలు

పలుచగా పొడవుగా కోసిన బోన్‌లెస్‌ చికెన్‌ స్ట్రిప్స్‌- అర కిలో, కోడిగుడ్లు- రెండు, మిరియాల పొడి- ఒక చెంచా, పెరుగు- ఆరు చెంచాలు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, కార్న్‌ఫ్లోర్‌- ఏడు చెంచాలు, నూనె- డీప్‌ ఫ్రైకి తగినంత, నెయ్యి- రెండు చెంచాలు, వెల్లుల్లి తరుగు- రెండు చెంచాలు, పచ్చి మిర్చి- ఎనిమిది, కరివేపాకు- రెండు రెమ్మలు, పసుపు- అర చెంచా, కారం- అర చెంచా, రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌- అర చెంచా, ధనియాల పొడి- అర చెంచా, ఉప్పు- తగినంత, సోయా సాస్‌- ఒక చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, పుదీనా తరుగు- కొద్దిగా

తయారీ విధానం

  • వెడల్పాటి గిన్నెలో బోన్‌లెస్‌ చికెన్‌ స్ట్రిప్స్‌, ఒక చెంచా ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు చెంచాల పెరుగు, కోడిగుడ్ల తెల్ల సొన, కార్న్‌ఫ్లోర్‌ వేసి బాగా కలపాలి. ఈ చికెన్‌ స్ట్రిప్స్‌ మిశ్రమాన్ని పావు గంటసేపు నాననివ్వాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. అందులో చికెన్‌ స్ట్రిప్స్‌ను ఒక్కోటి వేస్తూ చిన్న మంట మీద దోరగా వేయించాలి. అన్నివైపులా ఎర్రగా వేగిన చికెన్‌ స్ట్రిప్స్‌ను పళ్లెంలోకి తీయాలి. స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. ఆపైన వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పొడి, రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత నాలుగు చెంచాల పెరుగు, సోయాసాస్‌ వేసి కలిపి మిశ్రమం దగ్గరకు వచ్చేదాకా ఉడికించాలి. ఆపైన వేయించి పెట్టుకున్న చికెన్‌ స్ట్రిప్స్‌ వేసి మెల్లగా కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి కలిపి స్టవ్‌ మీద నుంచి దించాలి.

  • ఈ చికెన్‌ 555ను టమాటా సాస్‌ లేదా చిల్లీ సాస్‌తో వేడిగా సర్వ్‌ చేయాలి.


ఐస్‌క్రీమ్‌ సందేశ్‌

కావాల్సిన పదార్థాలు

పనీర్‌ తురుం- ఒక కప్పు, కాచిన పాలు- ఒక కప్పు, కుంకుమపువ్వు రేకులు- 15, పంచదార పొడి- ముప్పావు కప్పు, పాలపొడి- అర కప్పు, యాలకుల పొడి- అర చెంచా, పిస్తా పలుకులు- అర కప్పు

తయారీ విధానం

  • పాలలో కుంకుమ పువ్వు రేకులు వేసి కలిపి మూతపెట్టి ఉంచుకోవాలి. మిక్సీలో పనీర్‌ తురుం, పాలపొడి, పంచదార పొడి, కుంకుమపువ్వు వేసిన పాలు, యాలకుల పొడి వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసి దాన్ని ఫాయిల్‌ పేపర్‌తో మూయాలి.

  • స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి మరగనివ్వాలి. అందులో ఒక స్టాండ్‌ పెట్టి దానిమీద పనీర్‌ మిశ్రమం ఉన్న గిన్నెను ఉంచాలి. పైన మూత పెట్టి 45 నిమిషాలపాటు ఆవిరి మీద ఉడికించాలి. తరువాత గిన్నెను స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి. పనీర్‌ గిన్నె మీద ఉన్న ఫాయిల్‌ పేపర్‌ను తీసివేసి ఒక పళ్లాన్ని మూతలా పెట్టి గిన్నెను రివర్స్‌ చేయాలి. పళ్లెంలో ఐస్‌క్రీమ్‌ సందేశ్‌ రెడీ అవుతుంది. దీనిమీద పిస్తా పలుకులు చల్లి చిన్న ముక్కలుగా కోసి సర్వ్‌ చేయాలి.


బ్లూ లగూన్‌

కావాల్సిన పదార్థాలు

పంచదార- అర కప్పు, మంచినీళ్లు- అర కప్పు, నిమ్మకాయలు- రెండు, ఐస్‌క్యూబ్స్‌- పన్నెండు, బ్లూ క్యురాకో సిరప్‌- ఒక బాటిల్‌, స్ర్పైట్‌ కూల్‌డ్రింక్‌- ఒక బాటిల్‌

తయారీ విధానం

స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి అందులో పంచదార, పావు చెంచా నిమ్మరసం వేసి మంచినీళ్లు పోసి కరిగించాలి. ఈ పంచదార నీళ్లను ఒక గిన్నెలోకి వడగట్టి దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. పొడవాటి గాజు గ్లాసును తీసుకుని అందులో నాలుగు ఐస్‌ క్యూబ్స్‌ను క్రష్‌ చేసి వేయాలి. తరువాత చల్లని పంచదార సిరప్‌ 25 ఎంఎల్‌, బ్లూ క్యురాకో సిరప్‌ 50 ఎంఎల్‌ వేసి రెండు చెంచాల నిమ్మరసం పిండాలి. ఆపైన గ్లాస్‌ నిండా స్ర్పైట్‌ కూల్‌డ్రింగ్‌ పోయాలి. ఇలా రెండు లేదా మూడు గ్లాసులు రెడీ చేసుకుని ఒక ట్రేలో పెట్టి సర్వ్‌ చేయాలి.

Updated Date - Dec 27 , 2025 | 03:30 AM