From Abuse to Achievement: వేధింపులు దాటి శిఖరం వైపు
ABN , Publish Date - Nov 22 , 2025 | 03:44 AM
పదేళ్ల వయసు... రైలులో ప్రయాణిస్తుంటే ఒక పెద్దాయన... తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కాసేపటికి నా మీద చేతులు వేసి తడుముతున్నాడు. మంచి స్పర్శ ఏదో...
ప్రియతమా శర్మ... వేధింపులు ఆమెకు కొత్త కాదు. బాల్యంలోనే మొదలయ్యాయి. కౌమారానికి వచ్చాకా అవి కొనసాగాయి. వాటిని తట్టుకోలేక చిన్న వయసులోనే ఇల్లు వదిలిన ఆమె... తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నారు. అందుకు ఏకైక మార్గం చదువేనని గ్రహించి... మాస్టర్స్ చేశారు. ఆడపిల్ల ఇంటికి భారమని భావించే సమాజం నుంచి వచ్చిన ప్రియతమ... నేడు తనలాంటి ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపుతున్నారు.
‘‘పదేళ్ల వయసు... రైలులో ప్రయాణిస్తుంటే ఒక పెద్దాయన... తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కాసేపటికి నా మీద చేతులు వేసి తడుముతున్నాడు. మంచి స్పర్శ ఏదో... చెడు స్పర్శ ఏదో తెలుసుకోలేని వయసు. అక్కడేకాదు... పక్కింట్లో, ఆఖరికి మా బంధువుల ఇంట్లో కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను. పదిహేనేళ్ల వయసు వచ్చేవరకు ఇలాంటి ఘటనలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. చెప్పినా వినేవారు లేరు మా ఇంట్లో. ఎందుకంటే... అమ్మాయి అంటే మా ప్రాంతంలో కుటుంబానికి భారంగా, వేరొకరి ఇంటి సొత్తుగా భావిస్తారు. మగపిల్లలకు ఉన్న స్వేచ్ఛ, ఉన్నత చదువులు చదివే అవకాశం మాకు ఇవ్వరు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ మాది. మేం నలుగురు సంతానం. అక్కకు చిన్న వయసులోనే పెళ్లయింది. నన్ను ఆర్ట్స్‌తో సరిపెట్టిన అమ్మానాన్న... తమ్ముళ్లను మాత్రం ఇంజనీరింగ్‌లో చేర్పించారు. ప్రతిచోటా వివక్షే. వీటన్నిటికీ దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోదామని ఎన్నోసార్లు అనుకున్నా. కానీ ఏదో తెలియని భయం నన్ను ఆపేసేది.
ఇల్లు వదిలి...
నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. కానీ అక్కను చేసుకున్నవాడు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. వయసులో కూడా చాలా పెద్దవాడు. తన కాపురం చూశాక నాకు ఇంట్లోవాళ్లు తెచ్చే సంబంధాల మీద నమ్మకం పోయింది. నా జీవిత భాగస్వామిని నేనే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలోనే మా స్నేహితుడి స్నేహితుడితో పరిచయమైంది. తరువాత ఇద్దరి మనసులు కలిశాయి. గతంలో నాకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పాను. అతను పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి అతడిని పెళ్లి చేసుకున్నా. వేరే ఊళ్లో కాపురం పెట్టాం. ఇదంతా 2010లో. అప్పుడు నాకు ఇరవై ఏళ్లు.
మునుపెన్నడూ లేని గౌరవం...
పెద్ద షాక్ ఏంటంటే... అతడు పెళ్లికి ముందు నాతో చెప్పినవన్నీ అబద్దాలే... ఉద్యోగం, ఊరు, పేరు సహా. చేసేదిలేక సర్దుకుపోయాను. కొన్ని నెలల తరువాత మా అమ్మానాన్న మమ్మల్ని కనిపెట్టారు. ‘మీరిద్దరూ కెరీర్‌లో స్థిరపడిన తరువాత మళ్లీ కలిసి జీవించవచ్చు’ అని నాకు నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్లారు. ఆరు నెలల్లో ఒక్కసారి కూడా నా భర్తను చూసేందుకు అనుమతించలేదు. నాకు చచ్చిపోవాలని అనిపించేది. అన్నిటినీ భరించాను. మా ఇంటి దగ్గరే ఉన్న ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పుడు కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఆపుదామని నాన్న ప్రయత్నించారు. నేను వినలేదు. నా బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చేశాను. నా జీవితంలో మొదటిసారి నాపై నాకు నమ్మకం కలిగింది ఆ ఉద్యోగంలో చేరాకనే. నాకు అంతకుముందు ఎక్కడా లేని గౌరవం, విలువ అక్కడ లభించాయి. నేనంటే అందరూ ఇష్టంగా ఉండేవారు. ఆడపిల్లననే వివక్ష ఎవరూ చూపలేదు.
చదువే మార్గమని...
కానీ నా ఎదుగుదల మావారికి నచ్చలేదు. నేను బయటకు వెళ్లినా, స్నేహితులు ఎవరితోనన్నా మాట్లాడినా ఇష్టపడేవాడు కాదు. కాదంటే కొట్టేవాడు. చివరకు ఉద్యోగం మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టాడు. తనకు తెలియకుండా వేరే ఉద్యోగాలు ప్రయత్నించాను. ఆ సమయంలో నాకు అర్థమైంది ఏంటంటే... ఉన్నత చదువులు చదివితే మంచి అవకాశాలు వస్తాయని. జీవితంలో బాగా స్థిరపడవచ్చని. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల వివక్ష చూపే సమాజంలో మార్పు రావాలన్నా, స్వశక్తితో ఎదగాలన్నా అందుకు చదువే ప్రధానమని అర్థమైంది. అందుకే మేనేజ్‌మెంట్ డిప్లమో కోర్సులో చేరాను. స్నేహితుల సహకారంతో కోర్సు పూర్తి చేశాను. ఆ సర్టిఫికెట్‌తో లఖనవూలో నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఆ క్షణం నా ఆనందాన్ని అంతులేదు. పంజరం నుంచి బయటకు వచ్చిన పక్షిలా స్వేచ్ఛను పొందిన అనుభూతి.
వారి స్ఫూర్తితో...
ఉద్యోగంలో భాగంగా ఐఐటీ, ఐఐఎం, బిట్స్, నిట్ గ్రాడ్యుయేట్స్‌ను కలిశాను. వారిని చూశాక నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. చదువు కొనసాగించాలన్న స్ఫూర్తి రగిలింది. లఖనవూ వర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్స్ చేశాను. అది నాలో మునుపెన్నడూ లేని ధైర్యాన్ని ఇచ్చింది. మరోవైపు భర్త వేధింపులు ఎక్కువ కావడంతో... అతడికి విడాకులు ఇచ్చాను. తరువాత నాకు చాలా సందర్భాల్లో అండగా నిలిచిన కోర్కీ సిన్హాను మూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాను. తన దృష్టిలో నేనొక యోధురాలిని. సిన్హాను చూశాక అనిపించింది... పెంపకాన్ని బట్టి మగవారి ఆలోచనాతీరు ఉంటుందని. అందుకే నాలాంటి అమ్మాయిలకు అండగా నిలవాలని అనుకున్నా. మగపిల్లలను చిన్నప్పటి నుంచే ఆడవారి పట్ల గౌరవ మర్యాదలతో మెలిగేలా పెంచాలని చెబుతున్నా. దీని కోసం అవగాహన తరగుతులు నిర్వహిస్తున్నా. అదే సమయంలో బాలికలకు మంచి స్పర్శ, చెడు స్పర్శలపై అవగాహన కల్పిస్తూ, యువతుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నా. దీనివల్ల ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా నా ప్రయత్నం ఫలించినట్టే.’’