President Draupadi Murmu: రఫేల్‌లో రాష్ట్రపతి
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:07 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. భారత వాయుసేనకు చెందిన రెండు వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా నిలిచారు...
యుద్ధవిమానంలో ప్రయాణించిన ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, అక్టోబరు 29: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. భారత వాయుసేనకు చెందిన రెండు వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా నిలిచారు. బుధవారం ఆమె రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. జి-సూట్, సన్‌గ్లా్‌సలు ధరించిన ముర్ము.. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి ఉదయం 11.27 గంటలకు రఫేల్ యుద్ధ విమానంలో టేకాఫ్ అయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు 200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించారు. విమానం 15 వేల అడుగుల ఎత్తులో, గంటకు 700 కి.మీ. వేగంతో ప్రయాణించింది. ఈ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహానీ నడిపారు. ముర్ము ప్రయాణించిన విమానానికి తోడుగా మరో రఫేల్ జెట్ వెళ్లింది. దాన్ని వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ స్వయంగా నడపడం విశేషం. రఫేల్ యుద్ధవిమానంలో ప్రయాణించి, అంబాలా వైమానిక స్థావరంలో కిందకు దిగిన అనంతరం రాష్ట్రపతి ముర్ము తన అనుభవాలను సందర్శకుల పుస్తకంలో రాశారు. ‘‘రఫేల్ యుద్ధవిమానంలో ప్రయాణించడం నాకు ఎన్నటికీ మరచిపోలేని అనుభూతి’’ అని ముర్ము పేర్కొన్నారు. అంతకుముందు రఫేల్ జెట్ తొలి మహిళా పైలట్, స్క్వాడ్రన్ లీడర్ శివాంగీ సింగ్ రాష్ట్రపతి ముర్ముతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. ఆపరేషన్ సిందూర్ వేళ శివాంగీని పాక్ సైన్యం బంధించినట్లుగా ఆ దేశ అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో కథనాలు వచ్చాయి. కాగా, ముర్ము 2023 ఏప్రిల్‌లో సుఖోయ్30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు.