Share News

బహుముఖ ప్రతిభ

ABN , Publish Date - Mar 19 , 2025 | 05:03 AM

‘‘మా నాన్న శేఖర్‌... ఎల్‌ఐసిలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌. అమ్మ సుజాత తెలంగాణ ఆర్థిక శాఖలో జాయింట్‌ సెక్రటరీగా పని చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థానాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న వారిద్దరినీ చూశాక.. పబ్లిక్‌ సర్వెంట్‌...

బహుముఖ ప్రతిభ

లక్ష్యం పట్ల నిబద్ధత, చక్కటి ప్రణాళిక ఉంటే అభిరుచులు కొనసాగిస్తూనే... చదువులో, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకోవడం సాధ్యమేనంటున్నారు ప్రతిభా శేఖర్‌. కవిత్వం, యాంకరింగ్‌, ఫిలిమ్‌మేకింగ్‌, ఫొటోగ్రఫీ... ఇలా అనేక అంశాల్లో రాణిస్తున్న ఆమె ఎక్కడా శిక్షణ తీసుకోకుండా, స్వయం సన్నద్ధతతోనే గ్రూప్‌-1లో మంచి స్కోర్‌ సాధించారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం, ప్రకృతిని ఆస్వాదించడం ఇష్టమంటున్న ప్రతిభ ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి...

‘‘మా నాన్న శేఖర్‌... ఎల్‌ఐసిలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌. అమ్మ సుజాత తెలంగాణ ఆర్థిక శాఖలో జాయింట్‌ సెక్రటరీగా పని చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థానాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న వారిద్దరినీ చూశాక.. పబ్లిక్‌ సర్వెంట్‌ కావాలన్న కోరిక నాకు చిన్న వయసులోనే కలిగింది. అదే లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. ‘నిట్‌- వరంగల్‌’లో బీటెక్‌ చేశాను. నాలుగేళ్ళ క్రితం నుంచి యుపిఎస్‌సికి ప్రిపేర్‌ కావడం ప్రారంభించాను. ఆ తరువాత తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రావడంతో... దానికీ సన్నద్ధమయ్యాను. అందుకోసం నేను ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. ‘ఎలా చదవాలి? ఏది ఎప్పుడు చదవాలి?’ అని కచ్చితంగా ప్రణాళిక వేసుకొని, దాన్నే అనుసరించాను. తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌, మా కుటుంబానికి సన్నిహితుడు మామిడి హరికృష్ణగారు నాకు మెంటార్‌గా వ్యవహరించారు. ప్రశ్నలకు నేను రాసిన జవాబులను ఆయన మూల్యాంకన చేసేవారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో నాకు 483.5 స్కోర్‌ వచ్చింది.


ఒత్తిడి తగ్గాలంటే...

సొంతంగా ప్రిపేర్‌ కావడం చాలా కష్టమని చాలామంది అనుకుంటారు. సరైన ప్రణాళిక ఉంటే అది ఏమాత్రం ఇబ్బంది కాదు. సాధారణ రోజుల్లో నాలుగైదు గంటలు చదివేదాన్ని. పరీక్షలు దగ్గరవుతున్నప్పుడు... నాలుగు నెలలపాటు ఏడెనిమిది గంటలు చదివాను. అలాగని పూర్తిగా దానికే అంకితం అయిపోలేదు. పెద్ద పరీక్షలకు సన్నద్ధం అవుతున్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఖాళీలు వందల్లో ఉంటే... పోటీపడేవారు లక్షల్లో ఉంటారు. పెద్ద లక్ష్యాల వెనుక పరిగెడుతున్నప్పుడు... మానసిక ఆరోగ్యం మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఇతర యాక్టివిటీస్‌ ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. నా వరకూ నేను ట్రావెలింగ్‌ను ఇష్టపడతాను. మూడు-నాలుగు నెలలకు ఒకసారి ఏదో ఒక ప్రదేశానికి వెళ్తాను. లద్దాఖ్‌, కేరళ, గోవా... ఇలా చాలా ప్రదేశాలను చూశాను. వీటిలో లద్దాఖ్‌ నాకు బాగా నచ్చిన ప్రదేశం. అక్కడ జనాభా తక్కువగా ఉంటుంది, ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది. టూర్లకు వెళ్ళినప్పుడు... మిగిలిన వాటి గురించి ఆలోచనలన్నీ వదిలేస్తాను. ఆ పర్యటనను ఆస్వాదించడం మీదే మనసు లగ్నం చేస్తాను. తిరిగి వచ్చాక మళ్ళీ పనిలో పడడానికి కావలసిన ఉత్తేజాన్ని నాలో నింపుకొంటాను.


గొప్ప గౌరవంగా భావిస్తున్నా..

నేను పుట్టిందీ, పెరిగిందీ హైదరాబాద్‌లో. అన్ని విషయాల్లోనూ నన్ను ఎంతగానో నా తల్లితండ్రులు ప్రోత్సహించారు. ఇతర యాక్టివిటీస్‌ వల్ల పిల్లలు చదువులో వెనుకబడతారని చాలామంది తల్లితండ్రులు భావిస్తూ ఉంటారు. అది నిజం కాదు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కేవలం చదువు మాత్రమే సరిపోదు. చదువును, మన అభిరుచులను బ్యాలన్స్‌ చేసుకోవడం తెలిస్తే... దేన్నీ వదులుకోనక్కర్లేదు. నాకు కవిత్వం చదవడం, రాయడం ఇష్టం. దినపత్రికల్లో ప్రచురితమయ్యే కవితల్ని చదవడం ద్వారా ఈ అభిరుచి మొదలయింది. హైస్కూల్‌లో ఉన్నప్పటి నుంచే తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో కవితలు రాసేదాన్ని. కాలేజీకి వచ్చాక... అది మరింతగా పెరిగింది. నాలో కదిలే భావాలతో మలచిన హిందీ-ఉర్దూ కవితలతో ‘మాన్‌ షాయరానే కా’ అనే సంకలనాన్ని 2021లో విడుదల చేశాను. రిలాక్స్‌ కావాలనుకున్నప్పుడు కవితలు చదువుతాను, రాస్తాను. స్ఫూర్తిని, ప్రేరణను కలిగించే కవితలంటే ఇష్టం. ఉర్దూలో గాలిబ్‌, తెలుగులో శ్రీశ్రీ కవితలంటే ఇష్టం. రాబోయే రోజుల్లో మరికొన్ని కవితా సంకలనాలను తీసుకొస్తాను. ఇక, 2020లో ‘నిట్‌- వరంగల్‌’ యువజనోత్సవం సందర్భంగా నిర్వహించిన షార్ట్‌ ఫిలిమ్‌ మేకింగ్‌ పోటీలో మొదటి స్థానంలో నిలిచాను. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ కోసం ఒక డాక్యుమెంటరీని రూపొందించాను. యాంకరింగ్‌ నాకు ఇష్టమైన మరో అంశం. స్కూల్లో, కాలేజీలోనే కాదు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించాను. ‘తెలంగాణ బతుకమ్మ ఫిల్మోత్సవ్‌’ పేరిట నిర్వహించిన షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలకు యాంకరింగ్‌ చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. పర్యటనల్లో కనిపించిన మంచి దృశ్యాలను ఫొటోలు తీయడం నాకున్న ఇంకో హాబీ. సినిమాలు సెలక్టివ్‌గా చూస్తాను. సందేశాత్మక చిత్రాలు వస్తే వదిలిపెట్టను. గ్రూప్‌-1లో నాకు వచ్చిన మార్కుల ప్రకారం... మంచి పోస్టింగే వస్తుందని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో యుపిఎ్‌ససిలో ర్యాంక్‌ సాధించాలనేది నా లక్ష్యం. దానికోసం సిద్ధమవుతున్నాను.’’

కృష్ణశర్మ


విజయానికి అయిదు మెట్లు

జీవితంలో ఏది సాధించాలన్నా అయిదు ‘సి’లు చాలా ముఖ్యమని నేను నమ్ముతాను. వాటిలో మొదటిది కాన్ఫిడెన్స్‌... ఎప్పుడూ మనమీద మనకున్న నమ్మకాన్ని వదులుకోకూడదు. రెండోది కంటిన్యుటీ... అనుకున్నది సాధించేదాకా ఎన్ని అవరోధాలు ఎదురైనా దాన్ని కొనసాగించాలి. మూడోది కన్సిస్టెన్సీ... ఏ పనినైనా స్థిరత్వంతో, నిలకడగా చేయడం ముఖ్యం. నాలుగోది కర్టెసీ... అన్ని సమయాల్లో మర్యాదగా, వినయంతో నడుచుకోవడం ప్రధానం. అయిదోది కమ్యూనికేషన్‌... మనకి తెలిసిన విషయాన్ని, మన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించే సామర్థ్యం ఉండాలి. ఏ రంగంలోనైనా విజయానికి ఈ అయిదు అంశాలు సోపానాలవుతాయనేది నా అభిప్రాయం.

ఇవి కూడా చదవండి:

BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Updated Date - Mar 19 , 2025 | 05:03 AM