Share News

Nari Award Pragya: నిలదీసే ప్రజ్ఞ

ABN , Publish Date - May 03 , 2025 | 06:20 AM

యాసిడ్‌ దాడి బాధితులకు మానసిక, వైద్య సహాయం అందించేందుకు ప్రజ్ఞ ‘అతి జీవన్‌’ ఫౌండేషన్‌ ప్రారంభించింది. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో నారీ శక్తి పురస్కారంతో సత్కరించింది

Nari Award Pragya: నిలదీసే ప్రజ్ఞ

న్యూస్‌ మేకర్‌

బ్యాంకు ఖాతా తెరిచే సందర్భంలో కనురెప్పలు ఆర్పలేక ఇబ్బందిపడిన ప్రజ్ఞ ప్రసూన్‌... తనలాంటి ముఖ వైకల్యం కలిగి ఉన్నవారికి కేవైసీ నిబంధనలను సవరించాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి... విజయం సాధించింది. యాసిడ్‌ బాధితురాలైన ఆమె... ‘ఐ వోంట్‌ బ్లింక్‌’ పేరుతో ఉద్యమాన్ని లేవనెత్తి...సుదీర్ఘ న్యాయ పోరాటం సాగించింది. ఆ పోరాటం వెనుక వ్యధాభరిత కథ ఇది.

జూలై, 2023లో యాసిడ్‌ దాడి బాధితురాలైన ప్రజ్ఞ ప్రసూన్‌ ఖాతా తెరవడం కోసం ఐసిఐసిఐ బ్యాంకుకి వెళ్లింది. కానీ ‘లైవ్‌ ఫొటోగ్రాఫ్‌’ కోసం కనురెప్పలు ఆర్పలేని కారణంగా డిజిటల్‌ కెవైసి ప్రక్రియ పూర్తి చేయలేకపోవడంతో ఆమె బ్యాంకులో ఖాతా తెరవలేకపోయింది. ఈ చేదు అనుభవంతో మనస్థాపం చెందిన ప్రజ్ఞ, సామాజిక మాధ్యమాల్లో ‘ఐ వోంట్‌ బ్లింక్‌’ అనే పేరుతో, ఉద్యమాన్ని లేవనెత్తింది. ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగి, ప్రజ్ఞను సంప్రతించి, డిజిటల్‌ కెవైసి నుంచి మినహాయింపు ఇచ్చి, బ్యాంకు ఖాతా తెరవడంలో సహాయపడ్డారు. కానీ ప్రజ్ఞ అంతటితో సరిపెట్టుకోలేకపోయింది. తనలాంటి ముఖ వైకల్యం కలిగిన ఇతరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. బ్యాంకు ఖాతా మొదలు, సిమ్‌ కార్డు కొనుగోలు వరకూ వేర్వేరు సందర్భాల్లో డిజిటల్‌ కెవైసి పొందడం తప్పనిసరి. కళ్లకు సంబంధించిన సమస్యలున్నవారు, అగ్ని ప్రమాదాలు, యాసిడ్‌ దాడులతో ముఖ వైకల్యం వల్ల కనురెప్పలను ఆర్పలేని వారి పట్ల కెవైసి నిబంధనలను సవరించాలని కోరుతూ ప్రజ్ఞ వేసిన పిటిషన్‌కు సానుకూలంగా స్పందించిన సుప్రీమ్‌కోర్టు... డిజిటల్‌ కెవైసి ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అనీ, అర్హులైన వారికి ఆ ప్రక్రియను సులభతరం చేయాలనీ, అన్ని ప్రభుత్వ పోర్టల్స్‌, లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌, ఆర్థిక సాంకేతిక సేవలన్నీ అందరికీ అందుబాటులో ఉంచాలనీ తాజాగా సంచలనాత్మక తీర్పునిచ్చింది.


ఎవరీ ప్రజ్ఞ..?

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో పుట్టిన ప్రజ్ఞ ప్రసూన్‌ సింగ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌. ఏప్రిల్‌ 15, 2006న ప్రజ్ఞ పెళ్లైంది. అదే నెల 30న ఆమె ఢిల్లీలో ప్రాంగణ నియామకానికి హాజరు కావాల్సి ఉంది. దాంతో పెళ్లైన 15 రోజులకే, బనారస్‌ నుంచి ఢిల్లీ రైలు ప్రయాణానికి సిద్ధపడిందామె. అది రాత్రి ప్రయాణం. అర్ధరాత్రి దాటిన తర్వాత, గాఢ నిద్రలో ఉన్న ప్రజ్ఞ ముఖం మీద ఒక యువకుడు యాసిడ్‌ను కుమ్మరించాడు. అతనెవరో కాదు. గతంలో ప్రజ్ఞ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన యువకుడే! తన ప్రతిపాదనను తిరస్కరించడంతో పగ పెంచుకున్న సదరు యువకుడు, ప్రజ్ఞ మీద ఆ ఘాతకానికి తెగబడ్డాడు. అలా ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్న ప్రజ్ఞ, తనకేం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే జరగవలసిందంతా జరిగిపోయింది. తోటి ప్రయాణికుల సహాయంతో ఆస్పత్రికి చేరిన ఆమె ప్రాణాలు నిలిచినా, ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. ఆ ప్రమాదంలో ఆమె ఒక కన్నును కోల్పోయింది. వైద్యులు శ్రమించి ఒక కంటిని కాపాడగలిగారు. రెండేళ్ల పాటు వరుస సర్జరీల తర్వాత ప్రజ్ఞ పూర్తిగా కోలుకుంది. యాసిడ్‌ దాడితో జీవితం ఎంతలా తలకిందులైపోతుందో స్వీయానుభవంతో తెలుసుకున్న ప్రజ్ఞ తనలా యాసిడ్‌ దాడికి గురైన వారికి తోడ్పాటును అందించాలని నిర్ణయించుకుంది. అలాంటి వారికి ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఆమె 2013లో ‘అతిజీవన్‌ ఫౌండేషన్‌’ను స్థాపించింది. యాసిడ్‌ దాడి బాధితులకు ఉచిత సర్జరీలు చేయడంతో పాటు, వృత్తి విద్యల్లో శిక్షణ అందించి, పునరావాసం కల్పించడం అతిజీవన్‌ స్వచ్ఛంద సంస్థ లక్ష్యం. ఇప్పటివరకూ ప్రజ్ఞ అతిజీవన్‌ ఫౌండేషన్‌ ద్వారా 250మంది యాసిడ్‌ బాధితులకు సహాయం అందించింది.


నారీ పురస్కారం

ప్రజ్ఞ, తన స్వీయానుభవం గురించి వివరిస్తూ... ‘‘చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రిలో నాలాంటి కొందర్ని కలిశాను. వారిలో కొందరికి ఎవరి తోడూ లేదనీ, దిశానిర్దేశం చేసేవాళ్లు, ధైర్యం చెప్పేవాళ్లూ లేరనే విషయాన్ని గ్రహించాను. వాళ్లతో మాట్లాడి వివరాలు తెలుసుకుని, వారికి భరోసా కల్పించడం కోసం అతి జీవన్‌ ఫౌండేషన్‌ను స్థాపించాను. ఈ సంస్థ ద్వారా యాసిడ్‌ దాడి బాధితులకు స్కిన్‌ గ్రాఫ్టింగ్‌, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సేవలను అందించి, ముఖాకృతిని సరి చేసి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం అతిజీవన్‌ లక్ష్యం. సాధికారత కల్పించడంవల్ల బాధితులందరూ స్వాభిమానంతో జీవించగలుగుతున్నారు. సమాజం, యాసిడ్‌ దాడికి గురైనవారిని బాధితులుగా పరిగణించకూడదు. వారిని ధీశాలులుగా భావించాలి’’ అంటూ చెప్పుకొచ్చింది ప్రజ్ఞ. ప్రజ్ఞ కృషికి ప్రభుత్వ గుర్తింపు దక్కింది. 2019లో భారత ప్రభుత్వం ఆమెను నారీ శక్తి పురస్కారంతో సత్కరించింది.

Updated Date - May 03 , 2025 | 06:21 AM