Polala Amavasya Celebrations: పోలాల పండుగ...సంబరాలు మెండుగా...
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:18 AM
అన్నదాతలకు పంటల సాగులో ఆద్యంతం అండగా నిలిచేవి బసవన్నలు. వాటికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ ..
అన్నదాతలకు పంటల సాగులో ఆద్యంతం అండగా నిలిచేవి బసవన్నలు. వాటికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ ప్రాంతంలోని పల్లెల్లో రైతులు ఉత్సవాలు చేస్తారు. శ్రావణమాసం చివరి రోజున... పోలాల అమావాస్య నాడు ఈ పండుగను నిర్వహించుకోవడం తరతరాల ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాలను పోలాల అమావాస్య’, ఎడ్ల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ వేడుక రైతుల జీవితంలో ముఖ్యమైన భాగం.
బసవన్నలను అలంకరించి...
పోలాల అమావాస్య నాడు రైతులు ఉదయాన్నే నిద్ర లేచి, వాకిళ్ళలో ఆవుపేడతో కల్లాపి చల్లుతారు. తరువాత ఎద్దులను గ్రామ సమీపంలోని చెరువులు, కుంటలు, నీటి కాలువలలోకి తీసుకువెళ్ళి శుభ్రపరుస్తారు. ఆ రోజంతా వ్యవసాయ పనుల జోలికి వెళ్ళరు. పగలంతా పశువులను కడుపునిండా మేపి, గడ్డి మోపులతో సాయంత్రం ఇంటికి చేరుకుంటారు. పొద్దున్నే అడవి నుంచి తీసుకువచ్చిన మోదుగ కొమ్మ నారను ఎద్దు కొమ్ములకు కడతారు. దాన్ని ‘పత్రి పట్టి’ అంటారు. అలాగే గజ్జెలు, గంటలు, రంగురంగుల వస్త్రాలతో ఎద్దులను ముస్తాబు జేస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన వస్త్రాలను (జూళ్ళను) వాటిపై కప్పుతారు. కొమ్ములకు అద్దాల అలంకరణలు చేసి, రంగురంగుల బెలూన్స్ కడతారు. వాటి శరీరమంతా రంగులు పూసి అందంగా తయారు చేస్తారు.

ప్రత్యేక పూజలు, హారతులు,నైవేద్యాలు...
ఇలా ప్రత్యేకంగా అలంకరించిన బసవన్నలను ఊరు బయట ఒక చోటికి చేర్చుతారు. అక్కడ రైతులందరూ గ్రామ పెద్ద (పటేల్) సమక్షంలో... ఇసుకతో శివలింగాన్ని, నంది అడుగులను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలో ఉపయోగించిన పసుపు, కుంకుమలను బసవన్నల నుదుట దిద్దుతారు. అక్కడి నుంచి డప్పు వాయిద్యాలతో వాటిని గ్రామ హనుమాన్ ఆలయాలకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఆలయం దగ్గర కట్టిన మామిడి ఆకుల తోరణాన్ని పటేల్ ప్రత్యేకమైన కర్రతో కొట్టి తెంపుతారు. దాంతో పోలాల అమావాస్య వేడుకలు ప్రారంభమవుతాయి. ‘‘ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ’’ అని నినాదాలు చేస్తూ... గ్రామ దేవతల చుట్టూ బసవన్నలను ప్రదక్షిణలు చేయించి... ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ వాటికి గుగ్గిలంతో హారతి ఇస్తారు. పప్పు బూరెలు, బియ్యం-బెల్లంతో చేసిన పాయసం, గారెలు, అప్పాలతో నైవేద్యాన్ని సమర్పించి, మొక్కులు తీర్చుకుంటారు. ఆ తరువాత... పొద్దుటి నుంచి పాటించిన ఉపవాసాన్ని రైతు కుటుంబాలు విరమిస్తాయి. ఇలా చేయడం వల్ల శివపార్వతుల అనుగ్రహం, ఆశీస్సులు దక్కుతాయని, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని రైతుల నమ్మకం. ఈ ఉత్సవాలు నిర్వహించడం, తోరణాలు తెంపడం తరతరాల ఆచారమనీ, ఇలా చేయడం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయనీ, పశువులు ఆరోగ్యంగా ఉంటాయనీ రైతులు నమ్ముతారని తాంసి మండలానికి చెందిన గ్రామ పటేల్ కాడగిరి రామన్న యాదవ్ వివరించారు.
ప్రత్యేక గుర్తింపు కోసం...
సాగులో ఎక్కువగా యంత్రాల వాడకంపై ఆధారపడుతున్న చాలామంది అన్నదాతలు పశు పోషణపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనితో అనేక గ్రామాల్లో వేళ్ళమీద లెక్కపెట్టేటన్ని మాత్రమే కాడెద్దుల జతలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... బసవన్నల గొప్పతనాన్ని, ఈ పండుగ వైభవాన్ని భావితరాలకు తెలియజెప్పేందుకు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తేవడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ ఏడాది తాంసి మండల కేంద్రంలో శనివారం పోలాల అమావాస్య పండుగను నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా చెప్పారు. దీనిలో భాగంగా సాంస్కృతిక, హస్తకళా ప్రదర్శనలు, జానపద నృత్య కార్యక్రమాలు, తినుబండారాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
మాదస్తు రాజేశ్వర్