Share News

Different Paths One Destination: మార్గాలు వేరు, గమ్యం ఒక్కటే

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:43 AM

జెన్‌ గురించి, జెన్‌ గురువుల గురించి ఓషో ఆచార్య రజనీశ్‌ ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన జైన కుటుంబంలో జన్మించినా... శ్రీకృష్ణుడు,

Different Paths One Destination: మార్గాలు వేరు, గమ్యం ఒక్కటే

జెన్‌ గురించి, జెన్‌ గురువుల గురించి ఓషో (ఆచార్య రజనీశ్‌) ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన జైన కుటుంబంలో జన్మించినా... శ్రీకృష్ణుడు, గౌతమబుద్ధుడు, మహావీరుడు, ఏసు క్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్తల గురించి అద్భుతంగా ప్రసంగించేవారు. ఒకసారి ఒక వ్యక్తి ఆయనను ‘‘మీరు ఏ మత ప్రవక్త గురించి చెప్పినా... అతను మాకు జెన్‌ గురువులాగే అనిపిస్తారు. ఎందుకని?’’ అని ప్రశ్నించాడు.

అప్పుడు ఓషో ‘‘నిజమే. వారంతా జెన్‌ గురువులే. ‘జెన్‌’ అంటే ఒక మతం కాదు. అది అన్ని మతాల మూలం, హృదయాల సారాంశం. సంస్కృతంలోని ‘ధ్యానం’... పాళీ భాషలో ‘జానం’, చైనాలో ‘చాన్‌’, జపాన్‌లో ’జెన్‌’ అయింది. అన్ని మతాల్లో ధ్యానమే ప్రధానమైన అంశం. ధ్యానం అంటే... ఆలోచనా తరంగాలు లేని చైతన్యం, ఎరుక. నేను కృష్ణుడు, మహావీరుడు, క్రీస్తు, మహమ్మద్‌... ఇలా ఎవరి గురించి ప్రసంగించినా... నా ఉద్దేశం మిమ్మల్ని అహంభావం, ఆలోచన లేని ఆ ధ్యాన స్థితికి చేర్చడమే. మీ అహంభావాన్ని నిర్మూలించడానికి, సమూలంగా నరికెయ్యడానికి వారిని నా కత్తులుగా ఉపయోగిస్తాను. ‘కృష్ణ’ అనే కత్తి కొందరికి ఉపయోగపడుతుంది. ‘క్రీసు’్త అనే కత్తి మరి కొందరి విషయంలో పని చేస్తుంది’’ అన్నారు.

వివిధ మతాలకు చెందిన మహనీయులు ఎన్నో విషయాలు చెప్పారు. అయితే వారు ప్రాధాన్యత ఇచ్చింది అహంకార, మమకార నిర్మూలనకే. వాటిని వదులుకున్నప్పుడు చేరే స్థితిని ‘జెన్‌’ అని, ‘ధ్యానం’ అని, ‘జ్ఞానం’ అని అంటారు. ‘పూర్ణం, బ్రహ్మం’ అని కొందరు అంటే... ‘శూన్యం, నిర్వాణం’ అని మరికొందరు అంటారు. ‘తావో’ అని కొందరు చెబితే, ‘నిర్వికల్ప సమాధి’ అని ఇంకొందరు చెబుతారు. భాష వేరు, గురువులు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు... కానీ సారాంశం ఒక్కటే. ఏకం సత్‌... విప్రా బహుధా వదన్తి... ఒకే సత్యాన్ని పండితులు బహు విధాలుగా చెప్పారు. మార్గాలు వేరు, గమ్యం ఒక్కటే. ‘‘ధ్యానమే మన స్వరూపం. ఇతర తలపులన్నిటినీ తొలగిస్తే... మన ఆత్మ సంభాషించడాన్ని వినగలుగుతాం. దానిని మీరు ఏ పేరుతోనైనా పిలవవచ్చు’’ అన్నారు రమణ మహర్షి.

రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - Oct 17 , 2025 | 03:43 AM