Share News

Breast Cancer Awareness: క్యాన్సర్‌తో పోరాడి.. కిరీటాన్ని గెలుచుకుని..

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:00 AM

చిన్న వయసులోనే క్యాన్సర్‌ బారిన పడి, దానిపై విజయవంతంగా పోరాడిన ఓపల్‌ సుచాత ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ అనే ప్రాజెక్ట్‌ ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్‌ బాధితులకు ఆర్థిక, మానసిక మద్దతు అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

 Breast Cancer Awareness: క్యాన్సర్‌తో పోరాడి.. కిరీటాన్ని గెలుచుకుని..

చిన్నప్పుడు ఏదైనా చిన్న దెబ్బతగిలితేనే ఎంతో హైరానా పడిపోతారు అందరూ. కానీ క్యాన్సర్‌ అంటే ఏంటో సరిగా తెలియని వయసులోనే దాని బారిన పడి పోరాడి గెలిచి నేడు ప్రపంచ సుందరిగా నిలిచారు ఓపల్‌ సుచాత షుంగ్‌సిరి. క్యాన్సర్‌తో తనలా ఎవరు ఇబ్బంది పడకూడదని ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ అనే ప్రాజెక్ట్‌ను ఆమె ప్రారంభించారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు ఈ థాయ్‌లాండ్‌ భామ. ఈ ప్రాజెక్ట్‌ గురించి పలు సందర్భాల్లో ఆమె పంచుకున్న సంగతులు..

నాకు పదహారవ ఏటనే రొమ్ములో కణితి ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డా, భయపడ్డా. నాకిక భవిష్యతే లేదని నిరాశ చెందా. కానీ భయంలో నుంచి నాలో ధైర్యం పుట్టుకొచ్చింది. దానితో క్యాన్సర్‌ను జయించా. అయితే ఆ పరిస్థితుల్లో నా కుటుంబం, చుట్టూ ఉన్న సమాజం నాకెంతో అండగా నిలబడింది. మరి నాలా ఇలాంటి అండ లేని వారి పరిస్థితి ఏంటనే ఆలోచనే ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ స్థాపనకు పునాది అయింది.


నాలా అండ లేని వారి కోసం

క్యాన్సర్‌ సంక్ష్లిష్ట సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను తెలిసిన వారితో పంచుకున్నాను. నేను చెప్పిన ఆ అనుభవాలు తమకు స్ఫూర్తినిచ్చిందని, తామూ క్యాన్సర్‌ను జయించామని కొందరు చెప్పారు. అప్పుడే క్యాన్సర్‌ రోగులకు అవగాహనతో పాటు మనోధైరాన్ని అందించాలని అర్థమయింది. నాలానే క్యాన్సర్‌ను జయించిన వారి జీవిత కథలు చెప్పి మరికొందరికి జీవితం మీద ఆశ కలిగించాలని నిర్ణయించుకున్నా. ఆలోచన అయితే ఉంది కానీ దానిని సరైన వేదిక లేదు. ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ స్థాపనతో ఆ వేదిక దొరికింది.

నా సంపాదన కూడా..

‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ ప్రాజెక్ట్‌లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన, దానిని ముందుగా గుర్తించాల్సిన ఆవశ్యకత తెలియజేశా. క్యాన్సర్‌ను జయించిన వారితో పాడ్‌కా్‌స్టలు, వైద్యులతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంతో మందిలో ఆత్మస్థైర్యం నింపడం ప్రారంభించా. అయితే ఆ తరువాత నాకో భయంకరమైన చేదు నిజం తెలిసింది. అదేంటంటే చాలా మందికి ఆస్పత్రులకు వెళ్లేందుకు డబ్బులు లేవని. దాంతో అలాంటి వారి కోసం నిధుల సేకరించడం మొదలుపెట్టా. నా సంపాదన కూడా నిరుపేద మహిళల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేశా. ఆపై ఆస్పత్రులు, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, లాభాపేక్ష లేని సంస్థలు ఆర్గనైజేషన్లు, థాయ్‌లాండ్‌ ప్రజారోగ్య శాఖతో కలిసి పనిచేయడం ప్రారంభించా. ఇలా ఇప్పటి వరకూ ఎంతోమంది థాయ్‌ మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించా. ప్రస్తుతం ఈ మిస్‌వరల్డ్‌ పోటీల ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన గురించి ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ స్వరాన్ని ప్రపంచమంతా వినిపించగలిగా.


ప్రపంచమంతా విస్తరించాలి..

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. థాయ్‌లాండ్‌లోనే ఏటా సుమారు 2 వేల మంది రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. వీటిలో 5 శాతం కంటే తక్కువ కేసులు మాత్రమే తొలి దశలో బయటపడుతుండడం బాధాకరం. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే సులభంగా దానిని జయించవచ్చు. అందుకే ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ కేవలం ఽథాయ్‌లాండ్‌కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్నా. ప్రపంచ నలుమూలల ఉన్న రొమ్ము క్యాన్సర్‌ బాధితులకు జీవితంపై ఆశలు రేకెత్తించాలని భావిస్తున్నా.

ఆరోగ్యమే ప్రధానం

క్యాన్సర్‌ నన్ను, నా ఆలోచనలను ఎంతో మార్చింది. మనిషి జీవితంలో ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే తన లక్ష్యాలు చేరుకోగలరు, ఏదైనా సాధించగలరు.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 05:00 AM