New Beginnings: కొత్తగా చిగురిద్దాం
ABN , Publish Date - Dec 26 , 2025 | 06:24 AM
మనసులో మార్పే కొత్తదనానికి ఊపిరి. కాలానికి అధిపతి ఆ ప్రభువే. అనంతమైన కాలాన్ని నియంత్రించే ఆయనను మన ఆలోచనల్లో... ముందు నిలుపుకొని...
మనసులో మార్పే కొత్తదనానికి ఊపిరి. కాలానికి అధిపతి ఆ ప్రభువే. అనంతమైన కాలాన్ని నియంత్రించే ఆయనను మన ఆలోచనల్లో... ముందు నిలుపుకొని, ఆయన అడుగుజాడల్లో బతుకు ప్రయాణం మొదలుపెడితే... అది శాంతంగా, ప్రశాంతంగా మనం అనుకున్న గమ్యానికి చేర్చుతుంది. దేవుణ్ణి ప్రేమించేవారు అందరినీ ప్రేమించగలుగుతారు. మానవుడికన్నా దేవుడు అత్యున్నతుడు. కానీ ఆయనకు మానవుడు అంటేనే ఇష్టం. అందుకే... తనకన్నా ఎక్కువగా మానవులను ప్రేమించేవారి చుట్టూ ఆయన తిరుగుతూ ఉంటాడు.
రోజుకో సద్గుణం
త్వరలో కొత్త ఏడాదిలో అడుగు పెడుతున్నాం. మనలో నూతన భావాలు కార్యరూపం దాలిస్తే తప్ప... కొత్త సంవత్సరం వాస్తవంగా మొదలైనట్టు కాదు. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ... పండుగ సమయాల్లో తమ కష్టార్జితంతో కొత్త దుస్తులు కుట్టించేవారు. వాటిని చూసి తెగ మురిసిపోయేవాళ్ళం. పాత దుస్తులను, మాసిన వస్త్రాలను ససేమిరా ఇష్టపడేవాళ్ళం కాదు. తల్లిదండ్రుల మాదిరిగానే దేవుడు కూడా కొత్త వరాలు, కొత్త వెలుగులు, నూతనమైన ఆలోచనలు, నూతన అవకాశాలు ప్రతి మనిషికీ అందిస్తున్నాడు. కానీ వాటిని మనం పట్టించుకోవడం లేదు. 365 రోజులు గడిచినంతమాత్రాన... కొత్తదనాన్ని ఆహ్వానించకపోతే... కొత్త ఏడాదిలో మార్పు తనంతట తానే మన జీవితాలలోకి వచ్చేస్తుందా? సర్వ సద్గుణ నిలయుడైన దేవుణ్ణి కేంద్రంగా నిలుపుకొని... రోజుకు ఒక సద్గుణాన్ని అలవరచుకోవాలి. కొత్త ఆలోచన, కొత్త ప్రవర్తన కలిగినప్పుడే జీవితం అర్థవంతంగా మారుతుంది.
సేవలో ప్రతిఫలించాలి
మనలో మార్పు లేనప్పుడు కొత్త సంవత్సరం జీవంలేని శరీరంలాంటిదే అవుతుంది. ‘‘అరణ్యాల్లో దేవుడు కొత్త దారులు చూపి నడిపిస్తున్నాడు. ఎడారిలో నదులను పుట్టించి ప్రవహింపజేస్తున్నాడు. వృక్షాలను కొత్తగా మొలకెత్తిస్తున్నాడు. ఇది గమనించగలరో, లేదో?’’ అని బైబిల్ ప్రశ్నిస్తోంది. గడచిన రోజుల్లో తప్పులు చేసి ఉండవచ్చు. కానీ దానికి కుంగిపోవడం వల్ల సమస్య తీరిపోదు. కోలుకోవాలి, మేలుకోవాలి. తప్పులు సరిదిద్దుకోవాలి. కొత్తగా చిగురించాలని పరితపించాలి. కొత్తగా జీవించడానికి ప్రయత్నించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ఆ ఆరాధన సాటి మనిషికి చేసే సేవలో ప్రతిఫలించాలి. బైబిల్‌లో ఎన్నో నీతులు కనిపిస్తాయి. వాటిలో ఒక్కటైనా పాటించలేమా? మన ప్రవర్తన బైబిల్ వాక్యానికి నిర్వచనంలా, వ్యాఖ్యానంలా సాగాలి. లేకపోతే ఎండమావుల దగ్గర తడిఆరిపోయిన గొంతుతో అరవడానికి కూడా శక్తిలేనివారిలా అయిపోతాం. కాబట్టి రాబోయే సంవత్సరమంతా ఏసుతో కలిసి పయనించాలని సంకల్పించుకుందాం.