Project Tribali: ఆసక్తే సంకల్పంగా
ABN , Publish Date - Jan 08 , 2025 | 04:28 AM
నృత్యం, సంగీతం... ఇవి నిహారికా నాయర్‌కు ప్రాణం. ఈ అభిరుచే గిరిజన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని ఆమెలో కలిగించింది.
కళలపై నిహారికా నాయర్‌లో చిగురించిన ఆసక్తి... గిరిజన జీవితాల్లో వెలుగు తేవాలనే సంకల్పంగా మారింది. బెంగళూరుకు చెందిన ఈ పదిహేడేళ్ల అమ్మాయి స్థాపించిన ‘ప్రాజెక్ట్ ట్రైబలి’... నాలుగేళ్లలో వెయ్యికి పైగా కుటుంబాలకు ఆసరా అందించింది. ఆమె ప్రయత్నం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రశంసలందుకొని, ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
నృత్యం, సంగీతం... ఇవి నిహారికా నాయర్‌కు ప్రాణం. ఈ అభిరుచే గిరిజన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని ఆమెలో కలిగించింది. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు... పలు గిరిజన ప్రాంతాలను సందర్శించి, వారి కళా రూపాల గురించి తెలుసుకోవాలనుకుంది. కానీ ఆ గూడేల్లో కఠోరమైన జీవన పరిస్థితులు ఆమెకు కనిపించాయి. ‘‘కనీస సదుపాయాలకు నోచుకోకుండా, తమకు అర్హత ఉన్నవాటిని సైతం అందుకోలేని ప్రజల అసక్తత, అవగాహనాలోపం నన్ను తీవ్రంగా కదిలించాయి. వారికోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనను నా కుటుంబానికి, స్నేహితులకు చెప్పినప్పుడు... అందరూ ఎంతగానో ప్రోత్సహించారు. అలా 2000 నవంబర్‌లో ‘ప్రాజెక్ట్ ట్రైబలి’ ప్రారంభించాను’’ అంటోంది నిహారిక. నాలుగేళ్ళలో ఈ ప్రాజెక్ట్ వెయ్యికి పైగా కుటుంబాల్లో సానుకూల మార్పుకు దోహదపడింది.
ఎన్నెన్నో సవాళ్లు...
‘‘దీనికోసం మొదట వారి ప్రాథమిక హక్కుల మీద దృష్టి పెట్టాను. చాలామందికి ఆధార్ కార్డులు లేవు. దీనివల్ల ప్రభుత్వం వారికి ఉద్దేశించిన పథకాలు అందడం లేదు. కొందరి పేర్లు నమోదైనా కార్డులు వారికి చేరలేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగాను. కొన్ని నెలల్లోనే దాదాపు ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా చేశాను. అదే సమయంలో... అత్యవసర సమస్యలు ఎదురైనప్పుడు వారికి డబ్బు అందుబాటులో ఉండడం కోసం బంధువులు, మిత్రుల నుంచి డబ్బు పోగుచేసి, ఒక నిధిని ఏర్పాటు చేశాను’’ అని గుర్తు చేసుకుంది నిహారిక. మొదట కర్ణాటకలోని ఒక గ్రామంలో మొదలుపెట్టి, ఈ నాలుగేళ్ళలో కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని సుమారు పది గిరిజన ప్రాంతాలకు ఆమె సంస్థ సేవలను విస్తరించింది. వైద్య శిబిరాలను నిర్వహించడం, పోషకాహార లోపాన్ని నివారించడం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం, కట్టెల పొయ్యిలకు బదులు సోలార్ కుక్కర్ల వినియోగానికి సాయపడడం... ఇలా పలు కార్యక్రమాలను నిహారిక చేపడుతోంది. ‘‘ఈ క్రమంలో నాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ప్రభుత్వాలు పథకాలు ప్రకటించి, నిధులు కేటాయించినా... అవినీతివల్ల అవి గిరిజనులకు అందడం లేదు. అలాగే గూడేల్లోని పిల్లలకు అర్థమయ్యేలా బోధన పద్ధతులు లేవు. దీనివల్ల ఎంతోమంది చదువుకు దూరమవుతున్నారు. మైదాన ప్రాంతాల్లోని పిల్లలతో సమానంగా చదువులో అభివృద్ధి చెందడానికి బోధన, శిక్షణ చేపడుతున్నాం. ఆధునిక సాగు పద్ధతులకు గిరిజనులు దూరంగా ఉన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయంతో వారికి ఆ పద్ధతులను నేర్పిస్తున్నాం. వాటి ప్రయోజనాలు వివరిస్తున్నాం’’ అంటారు నిహారిక.
అది మరచిపోలేను...
ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న పదిహేడేళ్ళ నిహారిక సేవా నిబద్ధత అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందుతోంది. 2023లో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్’లో తన ప్రాజెక్ట్ కార్యకలాపాలు, లక్ష్యాల గురించి ఆమె వివరించినప్పుడు... ప్రతినిధులందరూ ఆమెను ముక్తకంఠంతో ప్రశంసించారు. కిందటి ఏడాది డిసెంబర్ 24న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ‘1ఎం1బి- (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) నేషనల్ యంగ్ ఛేంజ్‌మేకర్స్ షోకే్‌స’లో పాల్గొనే అవకాశం ఆమెకు దక్కింది.
‘‘ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకోవడం, మాట్లాడడం నా జీవితంలోనే మరచిపోలేని గొప్ప అనుభవం. సమష్టి కృషిలో గొప్ప శక్తి ఉందని నేను ఎప్పుడూ నమ్ముతాను. మనం చేపట్టే పనులు క్షేత్రస్థాయిలో ప్రభావాన్ని సృష్టించినప్పుడే మార్పు సాధ్యమవుతుంది. అలాంటి మార్పు కోసం నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను’’ అంటోంది నిహారిక.
గిరిజనులకు వారి హక్కుల గురించి బోధించడం, వాటిని సాధించుకొనేలా సాయపడడం, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను పెంచడం, విలక్షణమైన వారి కళలను, సంస్కృతిని, సంప్రదాయాలను పరిరక్షించడం... ఇవే ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్న ‘ట్రైబలి’... గిరిజనులతో హస్తకళా ఉత్పత్తులను తయారు చేయించి, ప్రదర్శనలు ఏర్పాటు చేసి విక్రయిస్తోంది. నైపుణ్యాలను, జీవనశైలిని చాటి చెప్పే అవకాశం కల్పిస్తోంది.