New Dishes : పండుమిర్చితో వేడివేడిగా...
ABN , Publish Date - Mar 01 , 2025 | 06:40 AM
పండుమిర్చి అనగానే కమ్మని పచ్చడి గుర్తుకువస్తుంది. టమాటా, గోంగూర, చింతకాయలను చేర్చి కూడా పచ్చళ్లు చేస్తూ ఉంటారు. ఇవి కాక పండుమిర్చితో తయారుచేసే సరికొత్త వంటకాలు మీకోసం...
వంటిల్లు
పండుమిర్చి అనగానే కమ్మని పచ్చడి గుర్తుకువస్తుంది. టమాటా, గోంగూర, చింతకాయలను చేర్చి కూడా పచ్చళ్లు చేస్తూ ఉంటారు. ఇవి కాక పండుమిర్చితో తయారుచేసే సరికొత్త వంటకాలు మీకోసం...
పండుమిర్చి పులిహోర
కావాల్సిన పదార్థాలు
బియ్యం- ఒక గ్లాసు, పండు మిర్చి- అయిదు, చింతపండు- కొద్దిగా, నూనె- మూడు చెంచాలు, ఆవాలు- ఒక చెంచా, జీలకర్ర- అర చెంచా, మినప గుండ్లు- ఒక చెంచా, పచ్చి శనగపప్పు- ఒక చెంచా, పల్లీలు- మూడు చెంచాలు, ఎండు మిర్చి- రెండు, కరివేపాకు- రెండు రెమ్మలు, ఇంగువ- చిటికెడు, పసుపు- అర చెంచా, ఉప్పు- తగినంత, కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం
ముందుగా బియ్యం కడిగి అన్నం వండి పెట్టుకోవాలి.
మిక్సీ గిన్నెలో పండు మిర్చి ముక్కలు, పది నిమిషాలు నీళ్లలో నానబెట్టిన చింతపండు, అరచెంచా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. తరవాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఎండు మిర్చి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి దోరగా వేపాలి. ఇందులో పండు మిర్చి పేస్టు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తరవాత అన్నం, చెంచా ఉప్పు వేసి కలపాలి. తరవాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరోసారి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
జాగ్రత్తలు
తాలింపులో పల్లీలు, పప్పులను ముదురు గోధుమ రంగు వచ్చే వరకూ వేపాలి.
పండు మిర్చి పేస్టులో చింతపండు ఎక్కువగా వేసుకోకూడదు. పులిహోర స్పైసీగా కావాలనుకుంటే మరో రెండు పండు మిర్చీలు వేసుకోవచ్చు.
పండుమిర్చి ఫ్రైడ్‌రైస్
కావాల్సిన పదార్థాలు
పండుమిర్చి- ఏడు, ఉడికించిన అన్నం- రెండు కప్పులు, నూనె- ఒక చెంచా, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు- అర చెంచా, సన్నగా తరిగిన అల్లం ముక్కలు- అర చెంచా, ఉల్లిపాయ- ఒకటి, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- అర చెంచా, ఆరోమాటిక్ పొడి- అర చెంచా, కొత్తిమీర- కొద్దిగా
తయారీ విధానం
పండుమిర్చిని ముక్కలుగా కోసి చిటికెడు ఉప్పు వేసి కచ్చాపచ్చాగా నూరి పెట్టుకోవాలి. ఉల్లిపాయని, ఒక పండుమిర్చిని సన్నగా తరగాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇందులో వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి బాగా వేపాలి. తరవాత పండుమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు వేసి రెండు నిమిషాలు మగ్గించాక పండు మిర్చి పేస్టు, ఉప్పు వేసి కలపాలి. ఇది వేగాక అన్నం, మిరియాల పొడి, ఆరోమాటిక్ పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి రెండు నిమిషాల తరవాత స్టవ్ మీద నుంచి దించాలి. స్పైసీగా వేడిగా తినాలనుకునేవారికి ఈ వంటకం బాగా నచ్చుతుంది.
జాగ్రత్తలు
ఇందులో కావాలనుకుంటే క్యారెట్, బీన్స్, ఉల్లికాడలు, పచ్చి బఠానీలను చేర్చుకోవచ్చు.
కమ్మదనం కోసం వేయించిన పల్లీలు, జీడిపప్పు కలుపుకోవచ్చు.

పండుమిర్చి పకోడి
కావాల్సిన పదార్థాలు
శనగపిండి- ఒక కప్పు, బియ్యప్పిండి- పావు కప్పు, సోడా- చిటికెడు, వాము- ఒక చెంచా, పల్లీలు- రెండు చెంచాలు, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉల్లిపాయలు- మూడు, పండు మిర్చి- అయిదు, నీళ్లు- తగినన్ని, నూనె- డీప్ ఫ్రైకి తగినంత, ఉప్పు- తగినంత
తయారీ విధానం
పల్లీలను నూనె లేకుండా వేయించి పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. పండుమిర్చి, ఉల్లిపాయలను చీలికల మాదిరి కోయాలి.
ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. తరవాత వాము, పల్లీల పొడి, సన్నగా తరిగిన కరివేపాకు, ఒక చెంచా నూనె, ఉల్లిపాయ ముక్కలు, పండు మిర్చి చీలికలు వేసి కలపాలి. అయిదు నిమిషాల తరవాత దీనిలో కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ పకోడీల పిండి మాదిరి కలపాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె పోసి వేడిచేయాలి. తరవాత పిండిని పకోడీల్లా నూనెలో వేస్తూ దోరగా వేపాలి. బంగారు రంగులోకి వచ్చిన పకోడీలను టిష్యూ పేపర్ వేసిన పళ్లెంలోకి తీయాలి. ఇవి కారంగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి.
జాగ్రత్తలు
ఉల్లిపాయలను మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుపాటి చీలికల్లా కోయాలి. పండు మిర్చిని అడ్డంగా రెండు ముక్కలు చేసిన తరవాత నిలువుగా సన్నని చీలికల్లా కోయాలి.
పకోడీలు మెత్తగా కావాలనుకుంటే బియ్యప్పిండికి బదులు కార్న్‌ఫ్లోర్ కలుపుకోవచ్చు.
