Share News

New Hope for Lung Cancer Patients: ఈ మూడు చికిత్సలతో...లంగ్‌ క్యాన్సర్‌కు అడ్డుకట్ట

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:08 AM

ఉధృతంగా పెరుగుతున్న క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఒకటి. ఈ వ్యాధికి తాజాగా అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకొచ్చాయి. క్యాన్సర్‌ రోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్న ఆ సమర్థమైన చికిత్సల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు......

New Hope for Lung Cancer Patients: ఈ మూడు చికిత్సలతో...లంగ్‌ క్యాన్సర్‌కు అడ్డుకట్ట

ఉధృతంగా పెరుగుతున్న క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఒకటి. ఈ వ్యాధికి తాజాగా అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకొచ్చాయి. క్యాన్సర్‌ రోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్న ఆ సమర్థమైన చికిత్సల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అధికంగా కనిపించే క్యాన్సర్లలో లంగ్‌ క్యాన్సర్‌ ఒకటి. ఈ క్యాన్సర్‌కు ధూమపానం ప్రధాన కారణం అయినప్పటికీ, వాయు కాలుష్యం, ప్యాసివ్‌ స్మోకింగ్‌, జన్యు మార్పులు, దీర్ఘకాలం పాటు రసాయనాలకు బహిర్గతమవడం వల్ల కూడా ఊపిరితిత్తులకు క్యాన్సర్‌ సోకుతుంది. అయితే ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్స విప్లవాత్మకమైన పురోగతి సాధించింది. ఈ చికిత్సలో భాగంగా ప్రధానంగా కీమో థెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ అనే మూడు చికిత్సా విధనాలను వైద్యులు ఎంచుకుంటున్నారు. రెండు, మూడు, నాల్గవ దశల్లోని లంగ్‌ క్యాన్సర్‌ రోగులకు ఈ చికిత్సలు సమర్థమైన, ప్రభావవంతమైన ఫలితాలనిస్తాయి.

కీమో థెరపీ

శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్‌ సోకిన భాగాన్ని తొలగించిన తర్వాత, కీమో థెరపీలో భాగంగా అందించే ఔషథాలు, క్యాన్సర్‌ కణాల విభజనను అడ్డుకుంటాయి. అలాగే మిగిలి ఉన్న క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడంతో పాటు, వ్యాధి శరీరంలోని ఇతరత్రా అవయవాలకు పాకే మెటాస్టాటిక్‌ దశల్లో వ్యాధిని నిరోధించడానికి కీమో థెరపీ దోహదపడుతుంది. అలాగే పూర్వం కీమో థెరపీ తదనంతర దుష్ప్రభావాలు రోగులను మానసికంగా, శారీరకంగా కుంగదీసే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ ప్రస్తుత ఆధునిక ఔషథాలతో వాంతులు, జుట్టు రాలడం, నిస్సత్తువ మొదలైన దుష్ప్రభావాలను 70 నుంచి 80 శాతం మేరకు తగ్గించే వీలు కలుగుతోంది. నిరంతర పర్యవేక్షణ, పోషకాహారం, సపోర్టివ్‌ మెడిసిన్స్‌తో కీమో థెరపీని సులభంగా భరించగలిగే వీలుంది.


టార్గెటెడ్‌ థెరపీ

రోగుల్లో క్యాన్సర్‌ భిన్న స్వభావాలను కలిగి ఉంటుంది. కొందరి క్యాన్సర్‌ కణాల్లో జన్యుమార్పులుంటాయి. క్యాన్సర్‌ కణాల మీద నిర్దిష్టమైన రిసెప్టార్స్‌, ప్రొటీన్స్‌ ఉంటాయి. వీటి లక్ష్యంగా సాగే చికిత్సే టార్గెటెడ్‌ థెరపీ. ఈ చికిత్సలో భాగంగా రోగులకు ఇచ్చే ఇంజెక్షన్లు, ఆ లక్ష్యాల మీద దాడి చేయడం వల్ల, ఆరోగ్యకరమైన కణాలు మినహా, క్యాన్సర్‌ కణాలు మాత్రమే నాశనమవుతాయి. అయితే ఈ చికిత్స అర్హతను నిర్థారించుకోవడం కోసం రోగులకు ముందస్తు పరీక్షలు చేపడతారు. నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ పరీక్ష చేసి, వాటిలో మార్పులు ఉన్న రోగులకు వైద్యులు, టార్గెటెడ్‌ థెరపీని ఎంచుకుంటారు. నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలో భాగంగా 500 నుంచి 600 జన్యువులను పరీక్షించి, జన్యుపరమైన ఉత్పరివర్తనాలు కలిగి ఉన్న వారికి వైద్యులు టార్గెటెడ్‌ థెరపీని సూచిస్తారు. ఈ చికిత్స నోటి మాత్రల రూపంలోనే సాగుతుంది.

ఇమ్యునో థెరపీ

జన్యు పరివర్తన లేకుండా, పిడిఎల్‌1 రిసెప్టార్స్‌ కలిగిన క్యాన్సర్‌ కణాలు అధిక సంఖ్యలో ఉన్న రోగులకు ఇమ్యునోథెరపీ సత్ఫలితాన్నిస్తుంది. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సోకిన రోగుల్లో ఈ పిడిఎల్‌1 రిసెప్టార్లు కలిగిన క్యాన్సర్‌ కణాలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ ఇమ్యునో థెరపీ చికిత్సను ఆశ్రయించవచ్చు. ఇమ్యునోథెరపీ ప్రధానంగా వ్యాధినిరోధకశక్తిని బలోపేతం చేసే చికిత్స. క్యాన్సర్‌ కణాలతో పోరాడేలా ఈ చికిత్స వ్యాధినిరోధకశక్తిని ప్రేరేపిస్తుంది. సాధారణంగా వ్యాధికారక సూక్ష్మజీవులను మన వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగానే గుర్తించి, తుదముట్టిస్తుంది. కానీ క్యాన్సర్‌ విషయంలో ఈ కణాలు కొన్ని ప్రత్యేకమైన ప్రొటీన్ల సాయంతో, వ్యాధినిరోధక వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తాయి. కాబట్టి ఈ పొరపాటు జరగకుండా మన రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌ కణాలను సమర్థంగా గుర్తించగలిగేలా వాటిని ప్రేరేపించడానికి తోడ్పడే ఇంజెక్షన్లను ఈ చికిత్సలో ఇవ్వడం జరుగుతుంది. ఇమ్యునోథెరపీతో చక్కని ప్రతిస్పందన లభించడంతో పాటు, ఆ ఫలితం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. ఈ చికిత్స తీసుకున్న ప్రతి వంద మంది రోగుల్లో 20 మందిలో ఈ ప్రభావం కనిపిస్తుంది. టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీలను రెండు, మూడు, నాల్గవ దశల్లోని ఊపిరితిత్తుల క్యాన్సర్ల చికిత్సకు వాడుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఇమ్యునోథెరపీ చికిత్సను కీమోథెరపీతో కలిపి అందించవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో టార్గెటెడ్‌ థెరపీ, కీమెథెరపీ కలిపి ఇవ్వవలసి రావచ్చు. ఏ చికిత్స తీసుకున్నా, క్రమం తప్పక పెట్‌ స్కాన్స్‌ చేయించుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో నడుచుకుంటూ ఉండాలి.

Updated Date - Nov 11 , 2025 | 01:08 AM