Share News

Women Empowerment: ఒకే దారి... ఒకే సారి!

ABN , Publish Date - Oct 19 , 2025 | 04:50 AM

మెహెరాణికి చదువంటే ఎంతో ఇష్టం. తన అన్నయ్యలా న్యాయవిద్య అభ్యసించాలని ఆమె కోరిక. అయితే... ఆమె బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే ఉండగానే...

Women Empowerment: ఒకే దారి... ఒకే సారి!

ఎంతో ఇష్టపడి న్యాయవాద డిగ్రీని అందుకున్నా... కుటుంబ బాధ్యతల కారణంగా ప్రాక్టీ్‌సకు దూరమైన తల్లి...తల్లి స్ఫూర్తితో ‘లా’ చదివి, అమ్మ చదువును సార్థకం చేయాలని తపించిన కుమార్తె...వారిద్దరూ ఇటీవల ఒకేసారి ఏపీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా పేర్లు నమోదు చేసుకున్నారు.పేదలకు న్యాయం జరిగేలా చూడాలన్నదే తమ ఆశయం అంటున్నారు... కాకినాడకు చెందిన మెహెరాణి, లక్ష్మీ ఐశ్వర్య.

మెహెరాణికి చదువంటే ఎంతో ఇష్టం. తన అన్నయ్యలా న్యాయవిద్య అభ్యసించాలని ఆమె కోరిక. అయితే... ఆమె బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే ఉండగానే... పోలీస్‌ శాఖలో ఎస్‌ఐ అయిన గాజుల వీరవెంకట సత్యనారాయణతో వివాహం అయింది. చదువు కొనసాగించాలనే మెహెరాణి తపనను గుర్తించిన భర్త... ఆ దిశగా ఆమెను ప్రోత్సహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీఏ పూర్తి చేసిన మెహెరాణి... రాజీవ్‌ గాంధీ లా డిగ్రీ కళాశాలలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరి తన కలను నెరవేర్చుకున్నారు. 2015లో తను కోరుకున్న న్యాయవాద డిగ్రీని అందుకున్నారు. అయితే... భర్త ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు తిరగడం వల్ల ఎక్కడా ప్రాక్టీస్‌ చేసే అవకాశం ఆమెకు లభించలేదు. మెహెరాణి, సత్యనారాయణ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు మెహెర్‌... బిట్స్‌-పిలానీలో ఇంజినీరింగ్‌, యూఎ్‌సలో ఎంఎస్‌ చేశారు. విదేశాల్లో డేటా సైంటి్‌స్టగా స్థిరపడ్డారు. కుమార్తె లక్ష్మీ ఐశ్వర్య మాత్రం తల్లిలా న్యాయ విద్యను అభ్యసించాలనుకున్నారు. హ్యుమానిటీస్‌ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తి చేశాక... 2020లో ఒడిశాలోని నేషనల్‌ లా యూనివర్సిటీలో... అయిదేళ్ల బీబీఏ- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) కోర్సులో చేరి.. ఐదేళ్ల విద్యను అభ్యసించారు.

1.jpg

అమ్మ గురించి ఆలోచించి...

‘‘ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో... బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకోవాలనుకున్నప్పుడు... అమ్మ గురించే ఆలోచించాను. తను ఎంతో ఇష్టంగా ‘లా’ చదివి, ఖాళీగా ఉండడం నాకు నచ్చలేదు. అమ్మ చదువుకు సార్థకత ఉండాలనుకున్నాను. అందుకే అమ్మకు నచ్చజెప్పాను. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ విభాగంలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న మా నాన్న మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు’’ అని చెప్పారు లక్ష్మీ ఐశ్వర్య. ‘‘నా తల్లిదండ్రులు మల్లిపూడి బాబామెహర్‌ ప్రసాద్‌, శ్యామల, భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ‘లా’ చదివాను. కుటుంబ బాధ్యతలను, చదువును సమన్వయం చేసుకోవడం మొదట్లో కష్టంగా ఉండేది. న్యాయవాద కోర్సు పూర్తిచేసి, పట్టా అందుకున్నా... ప్రాక్టీస్‌ చేయడం సాధ్యపడలేదు. ఇప్పుడు మా అమ్మాయి కోరిక మేరకు ప్రాక్టీ్‌సకు సిద్ధమయ్యాను. ఇటీవల బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా ఒకే రోజు మా పేర్లు నమోదు చేసుకున్నాం. న్యాయం కోసం వచ్చే పేదలకు సాయపడాలనేదే మా ఆశయం’’ అంటున్నారు మెహెరాణి. ఐఏఎస్‌ కావాలి. సమాజానికి సేవ చెయ్యాలి. ఇదే నా లక్ష్యం’’ అంటున్న లక్ష్మీ ఐశ్వర్య... ప్రస్తుతం హైదరాబాద్‌లోని నల్సార్‌లో ఎల్‌ఎల్‌ఎం చేస్తున్నారు.

-పీవీవీ వరప్రసాద్‌, కాకినాడ

Updated Date - Oct 19 , 2025 | 04:50 AM