Share News

Monsoon Lung Care: ఊపిరితిత్తులు ఇలా సురక్షితం

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:06 AM

వానాకాలంలో ఎక్కువగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు విజృంభిస్తాయి. అయితే అలర్జీ తత్వం ఉన్న వాళ్లు, ఉబ్బసం ఉన్న వాళ్లలో ఈ కాలం ఆ రుగ్మతలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

Monsoon Lung Care: ఊపిరితిత్తులు ఇలా సురక్షితం

వానాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలు విజృంభించడం సహజం. అయితే అప్రమత్తంగా వ్యవహరిస్తూ, సమర్థమైన మందులను ఎంచుకోగలిగితే, ఊపిరితిత్తుల వ్యాధులకు అడ్డుకట్ట వేయొచ్చు అంటున్నారు వైద్యులు.

వానాకాలంలో ఎక్కువగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు విజృంభిస్తాయి. అయితే అలర్జీ తత్వం ఉన్న వాళ్లు, ఉబ్బసం ఉన్న వాళ్లలో ఈ కాలం ఆ రుగ్మతలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కాలంలో చోటుచేసుకునే వాతావరణ మార్పుల వల్ల, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి అయిన సిఒపిడి రోగుల్లో ఆ సమస్య మరింత తీవ్రమవుతూ ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల మార్పిడి రోగులు, కీమోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్‌ రోగులు, తీవ్రమైన గుండెజబ్బులున్న వారు... ఇలా ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న వారికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం ఊపిరితిత్తుల మీద అధికంగా ఉంటుంది. ఫలితంగా ఇన్‌ఫెక్షన్‌ శ్వాసనాళానికే పరిమితమవకుండా, ఊపిరితిత్తుల్లోకి కూడా ప్రయాణించి, వైరల్‌ న్యుమోనియా తలెత్తుతుంది.


వైద్యులను ఎప్పుడు కలవాలి?

వానాకాలంలో దగ్గులు, జలుబులు సర్వసాధారణం. ఇవి మూడు నుంచి ఐదు రోజుల పాటు వేధిస్తాయి. అయితే ఉన్న వాటికి కొత్త లక్షణాలు తోడైనప్పుడు వెంటనే అప్రమత్తం కావాలి. అవేంటంటే....

  • లక్షణాలు ఐదు రోజులకు మించి కొనసాగినా...

  • క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతున్నా

  • విపరీతమైన నీరసం ఆవరించినా

  • కళ్లు తిరుగుతున్నా

  • విపరీతమైన డీహైడ్రేషన్‌కు గురైనా

  • రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గినా

  • గుండె వేగం పెరిగినా

అలాగే సిఒపిడి, ఉబ్బసం ఉన్న వారికి అప్పటికే ఉన్న లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. పిల్లికూతలు, కొన్ని అడుగులు నడకకే ఆయాసం అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలవాలి.

సమర్థమైన చికిత్సలున్నాయి

మునుపటితో పోలిస్తే, ప్రస్తుతం చికిత్సా ప్రక్రియలు మరింత పురోగతి సాధించాయి. మునుపు లక్షణాల ఆధారంగా మందులను సూచించేవారు. కానీ ఇప్పుడు జబ్బు తీవ్రతను అంచనా వేసి చికిత్సను నిర్థారించడం కోసం ఎక్స్‌ రే, సిటి స్కాన్‌లు, ఊపిరితిత్తుల పనితీరును అంచనా వేయడానికి పల్మొనరీ ఫంక్షన్‌ పరీక్ష అందుబాటులోకొచ్చాయి. అలాగే ఇన్‌ఫెక్షన్‌ రకాన్ని తెలుసుకోవడం కోసం ఊపిరితితుల్లోని కఫాన్ని సేకరించి పరీక్షించే బ్రాంఖోస్కోపీ పరీక్ష కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అలాగే సిఒపిడి రోగులకు కొత్త మందులు కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. ఆక్సిజన్‌ మోతాదు తగ్గిపోయిన వారికి ఇంట్లోనే వాడుకునే వీలుండే లాంగ్‌ టర్మ్‌ ఆక్సిజన్‌ థెరపీ, బైపాప్‌ సపోర్ట్‌ పరికరాలు కూడా అందుబాటులోకొచ్చాయి. అలాగే ఇంతకు ముందు తాత్కాలికంగా తక్షణ ప్రభావాన్ని కనబరిచే ఇన్‌హేలర్లు మాత్రదే దొరికేవి. కానీ ఇప్పుడు దీర్ఘకాలం పాటు పని చేసే ఇన్‌హేలర్లు దొరుకుతున్నాయి. ఈ ఇన్‌హేలర్‌ను రోజుకు ఒక్కసారి పీల్చినా, దాని ప్రభావం ఎక్కువ సమయం పాటు పని చేయడమే కాకుండా, ఊపిరితిత్తుల సామర్ధ్యం కూడా పెరుగుతుంది.


నియంత్రణ ఇలా...

వానాకాలంలో ఊపిరితిత్తుల సమస్యలకు అడ్డుకట్ట వేయడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...

  • ముందు నుంచి ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జనసమ్మర్థ ప్రదేశాల్లో, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్‌ ధరించాలి

  • చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి

  • జలుబు, దగ్గు ఉన్నప్పుడు మాస్క్‌ పెట్టుకోవడం ద్వారా వ్యాధి ఇతరులకు సోకకుండా నియంత్రించవచ్చు

  • ధూమపానం మానేయాలి

  • ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి

  • ప్రాణాయామం లాంటి శ్వాస వ్యాయామాలు చేయాలి

  • రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.

వ్యాక్సిన్లతో అడ్డుకట్ట

ఫ్లూ వ్యాక్సిన్‌: ఫ్లూతో ఊపిరితిత్తుల శక్తి సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి

న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌: ప్రివెనార్‌ 13, న్యుమోవ్యాక్స్‌ 23 అనే రెండు రకాల ఫ్లూ వ్యాక్సిన్లు ఉంటాయి. 65 ఏళ్లు పైబడిన వాళ్లు, 50 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక జబ్బులున్న వారు ఈ వ్యాక్సిన్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్‌ను ఏడాదికోసారి, న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌ను ఐదేళ్లకోసారి తీసుకోవాలి.

డిపిటి వ్యాక్సిన్‌: సిఒపిడి రోగులు ఈ వ్యాక్సిన్‌ వేసుకోవడం మంచిదనే మార్గదర్శకాలు తాజాగా విడుదలయ్యాయి.

షింజిల్స్‌ వ్యాక్సిన్‌: సిఒపిడి రోగులు, రోగనిరోధకశక్తి తగ్గిపోయిన వారు హెర్పిస్‌ జోస్టర్‌ ఇన్‌ఫెక్షన్‌ తిరిగి ప్రేరేపితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని నియంత్రించడం కోసం షింజిల్స్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

డాక్టర్‌ జి.ఐ.సుస్మిత రెడ్డి

కన్సల్టెంట్‌ ఇంటర్వెన్షనల్‌

పల్మొనాలజిస్ట్‌, మెడికవర్‌ హాస్పిటల్స్‌, నెల్లూరు.

Updated Date - Jul 08 , 2025 | 12:06 AM